Fake News, Telugu
 

చెన్నైలో ఒక తోపుడు బండిని JCB ధ్వంసం చేస్తున్న వీడియోను, తెలంగాణలో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

ఒక తోపుడు బండిని JCB ధ్వంసం చేస్తున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది తెలంగాణలో జరిగిన సంఘటన అని సూచిస్తూ ఈ వీడియో పైన ‘Are you Happy mr revanth Reddy? మరీ ఇంత అవసరమా’ అనే టెక్స్ట్ ఉంది. ఇటీవల హైదరాబద్‌లోని పలు భవనాలను హైడ్రా సంస్థ ధ్వంసం చేసిన నేపథ్యంలో ఈ వీడియోని షేర్ చేస్తున్నారు.  ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజముందో ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: సీఎం రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణలో ఇటీవల ఒక తోపుడు బండిని ఒక JCB ధ్వంసం చేస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని సంఘటన తమిళనాడులో జరిగింది, తెలంగాణలో కాదు. జూన్ 2024లో ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి, చెన్నై హైవే డిపార్ట్‌మెంట్ వారు తాంబరం అనే ప్రాంతంలో రోడ్డు పక్కన వ్యాపారులను క్లియర్ చేయడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించిన సంఘటనకి చెందిన వీడియో ఇది. కావున, పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియోనీ వెరిఫై చేయడానికి అందులోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, ఈ వీడియో యొక్క స్క్రీన్ షాట్‌ ఉన్న ఇండియా టుడే వార్త కథనం ఒకటి మాకు దొరికింది. దీన్ని ఇండియా టుడే 30 జూన్ 2024న ప్రచురించారు. 

ఈ కథనం ప్రకారం ఈ సంఘటన తమిళనాడులోని చెన్నైలో జరిగింది. “చెన్నై హైవే డిపార్ట్‌మెంట్ ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి తాంబరంలో రోడ్డు పక్కన వ్యాపారులను క్లియర్ చేయడానికి ఎక్స్‌కవేటర్‌ను ఉపయోగించింది. దీంతో వీధి వ్యాపారులు అవస్థలు పడ్డారు” అని ఈ వార్తా కథనంలో ఉంది.

దీని గురించి మరింత వెతికితే, పలు లోకల్ తమిళ న్యూస్ చానెల్స్ ఈ వీడియోను ప్రచురించడం గమనించాం (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). ఇదే వీడియోని గతంలో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటన అని వైరల్ చేసినప్పుడు, ఆ క్లెయిమ్ తప్పు అని చెప్తూ, మేము ప్రచురించిన ఫాక్ట్-చెక్ ఇక్కడ చూడవచ్చు.

చివరిగా, చెన్నైలో ఒక తోపుడు బండిని JCB ధ్వంసం చేస్తున్న వీడియోను, రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణాలో జరిగిన సంఘటన అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll