ఒక లారీ నిండా కుక్కలను తరలిస్తున్న ఒక వీడియోను షేర్ చేస్తూ ఈ కుక్కలను హైదరాబాద్‌లోని స్టార్ హోటల్స్‌లో మాంసాహారం కోసం తరలిస్తున్నారు అంటూ క్లెయిమ్ చేస్తున్న ఒక పోస్ట్ సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: హైదరాబాద్‌లోని స్టార్ హోటల్స్‌లో మాంసాహారం కోసం లారీ నిండా కుక్కలను తరలిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోకు హైదరాబాద్‌తో ఎలాంటి సంబంధం లేదు. నవంబర్ 2021లో ఇండోనేషియాలోని సుకోహార్జోలో మాంసం కోసం కుక్కలను తరలిస్తున్నప్పుడు పోలీసులు వారిని పట్టుకున్నారు. ఈ వీడియో ఆ సంఘటనకు సంబంధించింది. ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇలా హోటల్స్‌లో కుక్క మాంసాన్ని అందిస్తున్నారంటూ ఎలాంటి రిపోర్ట్స్ ఐతే లేవు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
హైదరాబాద్‌లోని హోటల్స్‌లో మాంసాహారం కోసం కుక్కలను తరలిస్తున్నారంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో అసలు భారత్ కు సంబంధించింది కాదు. ఈ వీడియో స్క్రీన్ షాట్స్‌ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇవే దృశ్యాలను 2021లో రిపోర్ట్ చేసిన పలు ఇండోనేషియా వార్తా కథనాలు మాకు కనిపించాయి (ఇక్కడ & ఇక్కడ).
ఈ కథనాల ప్రకారం ఇండోనేషియాలోని సుకోహార్జోలో మాంసం కోసం తరలిస్తున్న 50 కుక్కలను ‘డాగ్ మీట్ ఫ్రీ ఇండోనేషియా’ అనే స్వచ్ఛంద సంస్థ సహాయంతో పోలీసులు పట్టుకున్నారు.
ఆ తరవాత ‘డాగ్ మీట్ ఫ్రీ ఇండోనేషియా’ ఈ కుక్కల సంరక్షణ బాధ్యతను తీసుకుంది, ఈ కుక్కలు కోలుకుంటున్నట్టు అప్డేట్ కూడా ఈ సంస్థ అందించింది.
అప్పట్లో ఈ వార్తను రిపోర్ట్ చేసిన పలు ఇండోనేషియా వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. వీటన్నిటి బట్టి ప్రస్తుతం షేర్ అవుతున్న వీడియోతో హైదరాబాద్‌కు ఎటువంటి సంబంధం లేదని స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా ఈ మధ్య కాలంలో హైదరాబాద్‌లో ఇలా హోటల్స్‌లో కుక్క మాంసాన్ని అందిస్తున్నారంటూ ఎలాంటి రిపోర్ట్స్ ఐతే లేవు. గతంలో 2016లో హైదరాబాద్ లోని ఒక ప్రముఖ హోటల్‌లో కుక్క మాంసంతో చేసిన బిర్యాని విక్రయిస్తున్నారని పుకార్లు వచ్చినప్పటికీ ఇందులో నిజం లేదని తరవాత అధికారులు నిర్థారించారు.
చివరగా, ఇండోనేషియాలో కుక్కల అక్రమ రవాణాకు సంబంధించిన వీడియోను హైదరాబాద్‌లోని హోటళ్లలో కుక్క మాంసాన్ని విక్రయిస్తున్నారంటూ షేర్ చేస్తున్నారు.