అల్వర్లో ముస్లింలు హిందువుల ఇళ్లలోకి ప్రవేశించి కర్రలతో దాడి చేసారంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. కొందరు యువకులు కర్రలతో మహిళలు, ముసలి వాళ్ళపై దాడి చేస్తున్నట్టు ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: అల్వర్లో ముస్లింలు హిందువుల ఇళ్లలోకి ప్రవేశించి కర్రలతో దాడి చేస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ఈ వీడియోలోని ఘటన రాజస్థాన్ అల్వర్ జిల్లాలో రిపోర్ట్ అయ్యింది. ఐతే ఈ ఘర్షణలో పాల్గొన్న రెండు వర్గాలు హిందువులేనని, వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని పోలీసులు మరియు వార్తా కథనాలు తెలిపాయి. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం కీవర్డ్స్ ద్వారా ఇంటర్నెట్లో వెతకగా ఇటీవల ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేసిన పలు వార్తా కథనాలు మాకు కనిపించాయి. ఈ కథనాల ప్రకారం ఈ వీడియోలోని ఘటన రాజస్థాన్ అల్వర్ జిల్లాలోని ‘ఖాకస్య కి ధాని’ అనే గ్రామంలో జరిగింది. ఐతే వైరల్ పోస్టులో చెప్తున్నట్టు ఈ ఘటనకు మతాలతో సంబంధం లేదు.
ఈ ఘర్షణలో పాల్గొన్న రెండు వర్గాలు ఒకే కుటుంబానికి చెందిన వారని, వీరందరూ హిందువులేనని ఈ కథనాలు రిపోర్ట్ చేసాయి. తమ పూర్వీకులకు సంబంధించిన భూమి విషయమై వీరి మధ్య వివాదం మొదలైందని, ఈ క్రమంలోనే కర్రలతో దాడి చేసుకున్నారని పేర్కొన్నాయి. ఈ ఘటనకు సంబంధించి రెండు వర్గాలు ఒకే కుటుంబానికి చెందిన వారని చెప్తున్న మరికొన్ని వార్తా కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు.

కాగా హిందువులపై ముస్లింల దాడి అంటూ ఇటీవల ఇదే వీడియోను కొందరి ట్విట్టర్లో షేర్ చేయగా, అల్వర్ పోలీసులు స్పందిస్తూ ఈ దాడిలో పాల్గొన్న రెండు వర్గాలు హిందువులేనని, వీరందరూ ఒకే కుటుంబానికి చెందిన వారని తెలిపారు.
చివరగా, రాజస్థాన్ అల్వర్లో ఒకే కుటుంబానికి చెందిన రెండు వర్గాల మధ్య జరిగిన వీడియోను హిందువులపై ముస్లింల దాడి అంటూ షేర్ చేస్తున్నారు.