Fake News, Telugu
 

డిసెంబర్ 2024లో జర్మనీలో జరిగిన ఒక ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన వీడియోని అమెరికాలో వర్క్ పర్మిట్ లేకుండా పని చేస్తున్న వారిని పోలీసులు పట్టుకున్న వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత, అక్రమ వలసదారులపై కఠినమైన చర్యలు తీసుకోవడం ప్రారంభించాడు. దీని ఫలితంగా అనేక మంది వలసదారులను (ఇక్కడ , ఇక్కడ) ఆ దేశం నుంచి పంపించడం జరిగింది. ఈ నేపథ్యంలో అమెరికాలో సరైన వర్క్ పర్మిట్ లేకుండా షాపింగ్ మాల్స్‌లో పని చేస్తున్న వాళ్లని పోలీసులు బంధిస్తున్న వీడియో అని క్లెయిమ్ చేస్తున్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేయబడుతోంది (ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ). అసలు ఈ వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: వర్క్ పర్మిట్లు లేకుండా అక్రమంగా అమెరికాలో పని చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుంటున్న వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఈ వీడియో వాస్తవానికి జర్మనీలోని బెర్లిన్‌లో 20 డిసెంబర్ 2024న తీసింది, అమెరికాలో కాదు. బెర్లిన్ హౌప్ట్ బాన్‌హోఫ్ (సెంట్రల్ రైలు స్టేషన్) వద్ద పాలస్తీనా అనుకూల ప్రదర్శనకారులను జర్మన్ పోలీసులు చెదరగొట్టడాన్ని ఇది చూపిస్తుంది. కావున, ఈ పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియోను సరిగ్గా పరిశీలించిన తర్వాత, అందులో ఉన్న ఒక పోలీసు అధికారి జాకెట్ వెనుక భాగంలో “BE 11336 POLIZEI” అనే టెక్స్ట్ ఉందని మేము గమనించాము. ఇది జర్మనీలోని బెర్లిన్ పోలీసులు ఉపయోగించే గుర్తింపు సంఖ్య. ఆ తర్వాత వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చెక్ చేయగా, వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఈ వీడియో ఉన్న పోస్ట్‌లు కనిపించాయి. ఈ పోస్టుల్లో ఈ సంఘటన బెర్లిన్‌లో జరిగింది అని సూచిస్తూ “బెర్లిన్ టుడే 20.12.2024” అని టెక్స్ట్ ఉంది. అలాగే ఆ పోస్టుల వివరణలో “బెర్లిన్‌లోని సెంట్రల్ రైలు స్టేషన్‌లో ఈరోజు జరిగిన ప్రదర్శనలో పాలస్తీనాకు సంఘీభావంగా జర్మన్ పోలీసులు కార్యకర్తలపై దాడి చేశారు,”అని ఉంది 

ఈ సంఘటన గురించి మరిన్ని వివరాల కోసం తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా మాకు జర్మన్ స్థానిక వార్తా సంస్థలు, మిడిల్ ఈస్ట్ దేశాల మీడియా సంస్థలు ఈ సంఘటన గురించి ప్రచురించిన కొన్ని వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, 20 డిసెంబర్ 2024 సాయంత్రం, దాదాపు 30 మంది ఇజ్రాయెల్ వ్యతిరేక ప్రదర్శనకారులు బెర్లిన్ ప్రధాన రైలు స్టేషన్‌లో గుమిగూడారు. ఈ బృందం, “Resistance Until Victory” అనగా “విజయం వరకు ప్రతిఘటన” అని రాసి ఉన్న పెద్ద బ్యానర్‌ను పట్టుకుని నేలపై కూర్చుంది. వారు “యల్లా ఇంతిఫాదా” మరియు “Don’t Abandon Palestine” అంటే “పాలస్తీనాను వదిలివేయవద్దు” వంటి నినాదాలు చేశారు. నిరసనకి చెందిన చిత్రాలలో పాల్గొన్నవారిలో చాలా మంది అరబ్ స్కార్ఫ్‌లు (కెఫియేలు) ధరించి ఉన్నట్లు చూడవచ్చు.

ఈ సంఘటన జరిగిన స్థలాన్ని గుర్తించడానికి, మేము ఇంటర్నెట్లో మరింత పరిశోధన చేయగా “20.12.2024 Berlin police clear pro-Palestinian demonstrators from the main train station,” అనే టైటిల్ ఉన్న ఒక YouTube వీడియో మాకు లభించింది.  ఇందులో ఒకేలాంటి గుర్తింపు సంఖ్యలు కలిగిన పోలీసులు గస్తీ చేస్తూ “Resistance Until Victory” బ్యానర్‌ను మోస్తున్న నిరసనకారులను అడ్డుకుంటున్న దృశ్యాలు ఉన్నాయి.

A Day in the Life of the Berlin Hauptbahnhof,”అనే మరో యూట్యూబ్ వీడియోలో బెర్లిన్ సెంట్రల్ రైల్వే స్టేషన్ యొక్క టూర్ ఉంది.  ఇందులో ఉన్న బిల్డింగులు, సైన్‌బోర్డులు, లైటింగ్ వైరల్ వీడియోకు దగ్గరగా ఉన్నాయి. వైరల్ క్లిప్‌ను నిశితంగా పరిశీలిస్తే ఈ సంఘటన రైల్వే స్టేషన్ లోపల ఉన్న ఐన్‌స్టీన్ కాఫీ ముందు జరిగిందని తెలుస్తుంది. దీన్ని మరింత ధృవీకరించడానికి, మేము Google మ్యాప్స్‌లో యూజర్లు అప్‌లోడ్ చేసిన ఈ లొకేషన్ ఫోటోలను చూశాము. వాటిని వైరల్ ఫుటేజ్‌తో పోల్చి చూడగా, ఈ సంఘటన బెర్లిన్ హౌప్ట్ బన్‌హాఫ్‌లో జరిగిందని అని మాకు స్పష్టమైంది.

చివరగా, డిసెంబర్ 2024లో జర్మనీలో జరిగిన ఒక ఇజ్రాయెల్ వ్యతిరేక నిరసన వీడియోని  అమెరికాలో వర్క్ పర్మిట్ లేకుండా పని చేస్తున్న వారిని పోలీసులు బంధిస్తున్న వీడియో అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll