“7000 రూపాయలతో విమానం తయారు చేసిన బీహార్ యువకుడు, బీహార్‌లో వారంలోనే రూ. 7,000 ఖర్చు, కేవలం స్క్రాప్‌తో ఎగిరే విమానాన్ని తయారు చేసిన అవనీష్ కుమార్ అనే యువకుడు” అని చెప్తూ ఉన్న పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). పలు ప్రముఖ మీడియా సంస్థలు కూడా ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ కథనాలను ప్రచురించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: బీహార్‌కు చెందిన అవనీష్ కుమార్ కేవలం ₹. 7,000 ఖర్చుతో స్క్రాప్ మెటల్ ఉపయోగించి వారంలోనే విమానాన్ని తయారు చేశాడు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కు సంబంధించింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న విమానాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన జుల్హాస్ మొల్లా తయారు చేశాడు. రిపోర్ట్స్ ప్రకారం, ఈ విమానాన్ని తయారు చేయడానికి అతనికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది, అలాగే సుమారు 8 లక్షల టాకా (దాదాపు ₹. 5.7 లక్షల రూపాయలు) వరకు ఖర్చయింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, 16 జూన్ 2025న ఇన్‌స్టాగ్రామ్‌లో ఇదే క్లెయిమ్‌తో షేర్ చేయబడిన వీడియోను (ఆర్కైవ్డ్) ఒకటి లభించింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలో “క్రిసాన్ టీవీ (কৃষাণ টিভি)” అని బంగ్లా భాషలో (బెంగాలీ) వాటర్‌మార్క్ ఉండటం మేము గమనించాము. దీని ఆధారంగా ఇంటర్నెట్‌లో మరింత వెతకగా, ఇదే వైరల్ వీడియోను ‘క్రిసాన్ టీవీ’ అనే బంగ్లాదేశ్‌కు చెందిన యూట్యూబ్ ఛానల్ 09 మార్చి 2025న షేర్ (ఆర్కైవ్డ్) చేసినట్లు మేము గుర్తించాము. ఇదే వీడియోను ‘క్రిసాన్ టీవీ’ ఫేస్‌బుక్‌లో కూడా షేర్ చేసింది. ఈ వీడియో వివరణ ప్రకారం, వైరల్ వీడియో బంగ్లాదేశ్‌కి సంబంధించినది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న విమానాన్ని బంగ్లాదేశ్‌లోని మాణిక్‌గంజ్ జిల్లాకు చెందిన జుల్హాస్ అనే వ్యక్తి తయారు చేశాడు.

ఈ సమాచారం ఆధారంగా ఈ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న విమానాన్ని రిపోర్ట్ చేస్తూ పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు మార్చి 2025లో ప్రచురించిన వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ,& ఇక్కడ). ఈ కథనాల ప్రకారం, బంగ్లాదేశ్‌లోని మాణిక్‌గంజ్‌లోని షిబలోయ్ ఉపజిల్లాలోని షైత్‌ఘర్ టియోటా గ్రామానికి చెందిన జుల్హాస్ మొల్లా (28) అనే యువకుడు 04 మార్చి 2025న జాఫర్‌గంజ్ ప్రాంతంలోని జమునా నది ఒడ్డున అతను స్వయంగా తయారు చేసిన విమానాన్ని నడిపాడు.

జుల్హాస్ మొల్లా తయారు చేసిన ఈ విమానం 100 కిలోగ్రాముల కంటే ఎక్కువ బరువు కలిగి ఉందని, విమానాన్ని అల్యూమినియం, స్టెయిన్‌లెస్ స్టీల్, ఇనుముతో తయారు చేశాడని, విమానం దాదపు 50 అడుగుల ఎత్తుకు వరకు ఎగిరిందని, ఈ విమానాన్ని తయారు చేయడానికి అతనికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టిందని, అలాగే సుమారు 8 లక్షల టాకా (దాదాపు ₹ 5.7 లక్షల రూపాయలు) వరకు ఖర్చయిందని ఈ కథనాలు పేర్కొన్నాయి. వార్తా కథనాల ప్రకారం, జుల్హాస్ మొల్లా పరిశోధనకు ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తుందని మాణిక్‌గంజ్ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ మోనోవర్ హుస్సేన్ ప్రకటించారు. అలాగే, యుఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ కూడా మొల్లాకు ఆర్థిక, సాంకేతిక సహాయాన్ని అందిస్తామని ప్రకటించింది. 04 మార్చి 2025న జాఫర్‌గంజ్ ప్రాంతంలోని జమునా నది ఒడ్డున జుల్హాస్ మొల్లా తాను తయారు చేసిన విమానంలో ప్రయాణించడాన్ని పలు బంగ్లాదేశ్ మీడియా సంస్థలు రిపోర్ట్ చేస్తూ న్యూస్ వీడియోలను పబ్లిష్ చేశాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
జుల్హాస్ మొల్లా యూట్యూబ్ ఛానెల్‌లో అతను తయారు చేసిన విమానానికి సంబంధించిన అనేక వీడియోలను మనం చూడవచ్చు.

చివరగా, వైరల్ వీడియోలో కనిపిస్తున్న విమానాన్ని బంగ్లాదేశ్‌కు చెందిన జుల్హాస్ మొల్లా తయారు చేశాడు. ఈ విమానాన్ని తయారు చేయడానికి అతనికి దాదాపు నాలుగు సంవత్సరాలు పట్టింది.