Fake News, Telugu
 

2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేపట్టిన ఓ రోడ్ షోలో జనం లేరని చెప్తూ షేర్ చేస్తున్న ఈ ఫోటో 2019 నాటిది

0

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఒక రోడ్ షోలో జనం లేరని చెప్తూ ఓ ఫోటో(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ & ఇక్కడ)  సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటోలో పూలదండ వేసిన ఓ వాహనం రాత్రి సమయంలో ఖాళీగా ఉన్న రోడ్డు మధ్యలో ఉండటం మనం చూడవచ్చు. కొన్ని పోస్టులో ఈ ఫోటో ఇటీవల నెల్లూరులో జరిగిన రోడ్ షోగా పేర్కొన్నారు. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకు సంబంధించి నిజేమెంటో చూద్దాం.

ఇలాంటి మరొక  పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహించిన ఓ రోడ్ షోలో జనం లేకపోవడాన్ని చూపిస్తున్న ఫోటో.

ఫాక్ట్(నిజం): ప్రస్తుత 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తున్న రోడ్ షోలకు, వైరల్ పోస్టులో షేర్ చేస్తున్న ఫోటోకు ఎలాంటి సంబంధం లేదు. ఈ ఫోటో 2019 నుంచి ఆన్‌లైన్‌లో ఉంది. ఇదే ఫోటోను 2019లో ప్రముఖ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ తన X(ట్విట్టర్)లో షేర్ చేసారు. అయితే, ఈ ఫోటో యొక్క ప్రామాణికతను మేము నిర్ధారించలేము. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

సెర్చ్ చేసి వెతికగా, ఇదే ఫోటోను ప్రముఖ సినిమా దర్శకుడు రాంగోపాల్ వర్మ 03 ఏప్రిల్ 2019న తన అధికారిక X(ట్విట్టర్)లో పోస్ట్ (ఆర్కైవ్డ్ లింక్) చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ ఫొటోకు క్యాప్షన్‌గా లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రం రిలీజ్ కావటంలో ఆలస్యమైనందుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అసంతృప్తితో చంద్రబాబు రోడ్ షోను బాయ్ కాట్ చేశారు అంటూ రాసుకొచ్చారు.

ఈ ఫోటోకి సంబంధించిన  మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 2019 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏప్రిల్ 2019లో చంద్రబాబు నాయుడు నెల్లూరులో రోడ్ షో, ప్రచార సభలు నిర్వహించినట్లు తెలిసింది. అయితే, కొన్ని మీడియా సంస్థల ప్రకారం ఈ చంద్రబాబు నెల్లూరు రోడ్ షోలో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారని తెలపగా(ఇక్కడ & ఇక్కడ), మరికొన్ని మీడియా సంస్థలు ఈ బాబు రోడ్ షో ప్రజలు లేక ఫ్లాప్ అయిందని రిపోర్ట్ చేసాయి (ఇక్కడ). కావున, ఈ ఫోటో యొక్క ప్రామాణికతను మేము నిర్థారించలేము. అయితే, ఈ ఫోటో 2019 నుండే ఇంటర్నెట్‌లో ఉందని మనం నిర్థారించవచ్చు. అలాగే ఇటీవల మార్చి 2024లో చంద్రబాబు నాయుడు నెల్లూరులో పర్యటించారని, ఈ పర్యటనలో చంద్రబాబు ర్యాలీకి జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారని చెప్తున్నా పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ & ఇక్కడ).

ఈ క్రమంలోనే టీడీపీ ఫాక్ట్ చెక్ విభాగం 19 ఏప్రిల్ 2024న తమ అధికారిక X(ట్విట్టర్) హ్యాండిల్ ద్వారా ఈ ఫోటో ఫేక్ అని, ఇదే ఫోటో ఉపయోగిస్తూ 2019లో చేసిన ప్రచారం కూడా ఫేక్ అని తెలిపింది.

చివరగా, 2024 ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు చేపట్టిన ఓ రోడ్ షోలో జనం లేరని చెప్తూ షేర్ చేస్తున్న ఈ ఫోటో 2019 నాటిది.

Share.

About Author

Comments are closed.

scroll