Fake News, Telugu
 

సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ పక్కకు నెట్టేసిన ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది, ఆంధ్రప్రదేశ్‌లో కాదు

0

సైకిల్ పైన ప్రయాణం చేస్తున్న ఒక వ్యక్తిని ఒక ట్రాఫిక్ పోలీస్ ఆపి పక్కకి తోసివేసిన వీడియోని, ఆంధ్రాలో వైసీపీకి ఓటు వేసిన వారి పరిస్థితి ఇదా? అని అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అసలు ఇందులో ఎంత నిజముందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం. 

క్లెయిమ్: ఆంధ్ర ప్రదేశ్లో ఒక ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ సైకిల్ పైన వెళ్తున్న ఒక వ్యక్తిని ఆపి పక్కకి తోసివేసిన సంఘటనకి చెందిన వీడియో ఇది. 

ఫాక్ట్(నిజం): ఈ సంఘటన ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది, ఆంధ్ర ప్రదేశ్లో కాదు. ఘోసి అసెంబ్లీ ఉప ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఉత్తర్ ప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య కాన్వాయ్ రోడ్డు పైన వెళ్తుండగా, సైకిల్ పైన వెళ్తున్న ఒక వ్యక్తి అడ్డు రాగా, సబ్- ఇన్స్పెక్టర్ కేదార్నాథ్ భారతి ఆ వ్యక్తిని ఆపి పక్కకి తప్పుకోమని అడిగాడు, అయితే ఆ వ్యక్తి మాట వినకపోయేసరికి అతన్ని కేదార్నాథ్ భారతి పట్టుకొని పక్కకి తోసివేశాడు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

ఈ సంఘటన గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తగిన కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతికితే. వైరల్ వీడియో గురించి సెప్టెంబర్ 2023లో ప్రచురితమైన కొన్ని వార్తా కథనాలు దొరికాయి (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ). 

వీటిని బట్టి, ఈ సంఘటన 2023 ఆగస్టు నెలలో ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది.  ఉత్తర్ ప్రదేశ్‌లోని మావూ జిల్లాలో ఉన్న ఘోసి అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల ప్రచారానికి ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య వెళ్లినప్పుడు, రోడ్డుపై వెళ్తున్న తన కాన్వాయ్‌కి అడ్డంగా ఒక సైకిల్ చోదకుడు రాగా, సబ్- ఇన్స్పెక్టర్ కేదార్నాథ్ భారతి పక్కకి తోసి వేసాడు. ఈ సంఘటనకి చెందిన దృశ్యాలనే తప్పుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సంఘటన అని షేర్ చేస్తున్నారు.

ఈ వీడియో సెప్టెంబర్ 2023లో వైరల్ అవ్వగా పలువురు నేతలు విమరిస్తూ ట్వీట్ చేసారు.(ఇక్కడ, ఇక్కడ). 

అయితే, పోలీసు వారు ఈ విషయం గురించి మాట్లాడుతూ, సైకిల్ పై వెళ్తున్న వ్యక్తి మద్యం సేవించి ఉన్నాడని, సబ్- ఇన్స్పెక్టర్ కేదార్నాథ్ భారతి తనని ఆపి పక్కకు తప్పుకో అన్నప్పుడు వినలేదని, అందుకే తాను అతన్ని పక్కకు తోసి వేసాడని చెప్పారు. ఇలా చేయడం మూలాన ఒక పెద్ద ప్రమాదం తప్పింది అని పోలీసులు మీడియాకి తెలిపారు.

చివరగా, సైకిల్ మీద వెళ్తున్న వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ పక్కకి నెట్టేసిన ఈ సంఘటన ఆంధ్రప్రదేశ్‌లో జరగలేదు, ఉత్తర్ ప్రదేశ్‌లో జరిగింది. 

Share.

About Author

Comments are closed.

scroll