క్రైస్తవ మతంలోకి మారాడని ఒక వ్యక్తిని కొందరు హిందువులు చితకబాదారు అని చెప్పి, ఒక వ్యక్తిని కొందరు జనం కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఉన్న నిజానిజాలు ఎంతో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.
క్లెయిమ్: క్రైస్తవ మతంలోకి మారాడని ఒక వ్యక్తిని, హిందూ సమాజానికి చెందిన కొందరు, చితకబాదుతున్న దృశ్యాలు.
ఫ్యాక్ట్(నిజం): ఈ సంఘటన 2022లో తెలంగాణ సంగారెడ్డిలో ఉన్న చిలమామిడిలో జరిగింది. వార్తా కథనాల ప్రకారం, ఈ ఘటనలో ఎటువంటి మత మార్పిడి కోణం లేదు. వీడియోలో తన్నులు తింటున్న బేగరి నరేష్ అనే వ్యక్తి, తమ కులానికి చెందిన మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని, కొంత మంది అతని మీద దాడి చేసారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి, ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, జూలై 2022లో ‘సూరజ్ కుమార్ బవుద్’ అనే వ్యక్తి చేసిన ఒక ‘X’ పోస్టులో మాకు ఇదే వీడియో లభించింది. ఈ పోస్ట్ ప్రకారం ఈ సంఘటన తెలంగాణ సంగారెడ్డిలో జరిగింది.
దీన్ని క్లూగా తీసుకుని ఇంటరెనెట్లో కీ వర్డ్ సెర్చ్ చేయగా, ఈ సంఘటనకి చెందిన వార్తా కథనాలు(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) దొరికాయి. వీటి ప్రకారం, ఈ సంఘటన జూలై 2022లో తెలంగాణలోని సంగారెడ్డిలో జరిగింది.
జరసంఘం మండలానికి చెందిన చిలమామిడి గ్రామంలో కొందరు వ్యక్తులు, తమ కులానికి చెందిన ఒక మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు అని, బేగరి నరేష్ అనే వ్యక్తిని ఇలా చితక బాదారు. ఈ క్రమంలో నరేష్ కుటుంబ సభ్యులను కూడా ఊరి జనం కొట్టారు. ఈ ఘటనకి చెందిన వీడియో అప్పట్లో ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది.
అయితే, ఈ సంఘటన తర్వాత ఇరు వర్గాల వారు ఒకరిపై ఒకరు కేసులు నమోదు చేసుకున్నారు. ఆ FIR కాపీలను మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. ఈ ఘటనలో మొత్తం తొమ్మిది మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి 14 రోజుల జ్యూడిషల్ రిమాండ్‌కి పంపించారు.
చివరిగా, రెండు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనకి చెందిన వీడియోని, ఒక మత మార్పిడి కోణం జోడించి తప్పుడు ప్రచారం చేస్తున్నారు.