Fake News, Telugu
 

రాజస్థాన్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన ఒక ఘర్షణ వీడియోని తెలంగాణలో హైడ్రాను వ్యతిరేకిస్తున్న ప్రజల దృశ్యాలు అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

0

హైడ్రా ను హడలెత్తిస్తున్న ప్రజలు…. ప్రజల్లో మార్పు మొదలయ్యింది.. ఇక తెలంగాణ నుండి కాంగ్రెస్ ను తరుముడే..’అని చెప్తూ సోషల్ మీడియాలో కొందరు ఒక జేసీబీ మీదకి రాళ్లు విసురుతున్న వీడియో (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇటీవల హైదరాబద్‌లోని పలు భవనాలను హైడ్రా ధ్వంసం చేసిన నేపథ్యంలో(ఇక్కడ మరియు ఇక్కడ) ఈ వీడియోని షేర్ చేస్తున్నారు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఇప్పుడు చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు. 

క్లెయిమ్: వీడియోలో చూపిస్తున్నది తమ భవనాలను కూల్చడానికి వచ్చిన హైడ్రా వాహనంపై తెలంగాణ ప్రజలు దాడి చేస్తున్న సంఘటనది.

ఫ్యాక్ట్(నిజం): ఈ సంఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది, దీనికి తెలంగాణకి, హైడ్రాకి, ఎలాంటి సంబంధం లేదు. వార్తా కథనాల ప్రకారం, అజ్మీర్‌లో రెండు వర్గాల మధ్య ఒక స్థలానికి సంబంధించి ఉన్న వివాదం నేపథ్యంలో జరిగిన ఒక ఘర్షణకి చెందిన వీడియో ఇది. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి వైరల్ వీడియోలోని కొన్ని కీ ఫ్రేమ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి చూడగా, ఈ వీడియోకి సంబంధించిన కొన్ని వార్తా కథనాలు (ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) మాకు దొరికాయి. వీటి ఆధారంగా ఈ సంఘటన రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో జరిగింది అని మాకు అర్థం అయ్యింది.

22 సెప్టెంబర్ 2024లో ప్రచురింపబడిన ఇండియా టుడే వారి ఒక వార్తా కథనం ప్రకారం, ఈ సంఘటనకు కారణం ఒక స్థలానికి సంబంధించి రెండు వర్గాల మధ్య జరిగిన ఒక తగాదా. అజ్మీర్‌లోని రూపన్‌ఘర్ అనే ఒక ఏరియాలో ఒక స్థలంలో జరుగుతున్న ఒక భవన నిర్మాణాన్ని ఒక వర్గం వారు అడ్డుకున్నప్పుడు ఈ ఘర్షణ జరిగింది. వాళ్ల గ్రామ సర్పంచ్ ఈ స్థలాన్ని తప్పుగా లీజుకు ఇచ్చారు అని ఆరోపిస్తూ వాళ్లు ఈ నిర్మాణాన్ని ఆపారు.

ఈ ఘర్షణలో రెండు వర్గాల వారు ఇరువురిపై రాళ్లు, కట్టెలతో దాడి చేసుకోగా, ఒకరు ప్రాణాలు కోల్పోగా మరొకరు గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.ఈ విషయంపైన అజ్మీర్ ఐజి ఓం ప్రకాష్ మేఘ్వాల్ మీడియాతో మాట్లాడారు ఆ వీడియో రిపోర్టుని మీరు ఇక్కడ చూడవచ్చు.ఈ సంఘటనకు సంబంధించిన మరి కొన్ని వార్తా కథనాలు మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. 

చివరిగా, రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో రెండు వర్గాల మధ్య జరిగిన పోరుకు చెందిన వీడియోని తెలంగాణలో హైడ్రాపై తిరగబడ్డ జనం అని తప్పుగా షేర్ చేస్తున్నారు. 

Share.

About Author

Comments are closed.

scroll