Fake News, Telugu
 

ఇంగ్లీషులో అడిగిన ప్రశ్న అర్థంకాక ఏపీ సీఎం వై.ఎస్.జగన్ సమాధానం చెప్పకుండా దాటేసాడు అని ఒక ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఇంగ్లీషులో అడిగిన ప్రశ్న అర్ధంకాక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పకుండా “ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్ (It’s a very lengthy question)” అని దాటేసాడు అని చెప్తూ వీడియో(ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ) ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఈ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

ఇలాంటి మరొక పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఒక ఇంటర్వ్యూలో ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ ఇంగ్లీషులో అడిగిన ప్రశ్న అర్ధంకాక వై.ఎస్. జగన్ సమాధానం చెప్పకుండా “ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్” అని దాటేస్తున్న దృశ్యాలు.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఎడిట్ చేయబడింది. ఇటీవల 30 ఏప్రిల్ 2024న ప్రసారం అయిన ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలోని వీడియో క్లిప్పింగ్‌కి, మే 2022లో దావోస్ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జగన్ మాట్లాడిన ఆడియోని చేర్చి ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వైరల్ వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ‘India Today’ వార్తా సంస్థ యొక్క లోగో ఉండటాన్ని మనం గమనించవచ్చు. దీని ఆధారంగా, ఈ వీడియోకు సంబంధించి మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, ఈ వైరల్ వై.ఎస్. జగన్ ఇంటర్వ్యూ యొక్క పూర్తి నిడివి గల వీడియోని 30 ఏప్రిల్ 2024న ‘ఇండియా టుడే(India Today)’ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో “Elections Unlocked: Andhra Pradesh CM Jagan Mohan Reddy Exclusive | India Today” అనే శీర్షికతో లైవ్ టెలికాస్ట్ చేసినట్టు తెలిసింది.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని దృశ్యాలు  టైంస్టాంప్ 10:47 వద్ద మొదలై, టైంస్టాంప్ 11:03 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. వాస్తవంగా, ఈ ఇంటర్వ్యూలో చాలా మంది ఎంపీల, ఎమ్మెల్యేలను మార్చడం పై రాజ్‌దీప్‌ సర్దేశాయ్‌ అడిగిన ప్రశ్నకు ఏపీ సీఎం వై.ఎస్. జగన్ సమాధానం చెప్పారు. ఈ వీడియోలో జగన్ “తమ వ్యూహంలో భాగంగా, తన మీద తనకున్న నమ్మకంతో మార్చాను”( ఇంగ్లిష్ నుండి తెలుగులోకి అనువదించగా, క్లుప్తంగా)  అని చెప్పారు. ఈ మొత్తం ఇంటర్వ్యూలో వై.ఎస్. జగన్ ఎక్కడా వైరల్ వీడియోలో చూపించిన విధంగా “ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్ (It’s a very lengthy question)” అని అంటూ ప్రశ్నలను దాటవేయలేదు.

తరువాత వైరల్ వీడియోలో వై.ఎస్. జగన్ “ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్” అని అంటున్న ఆడియో కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, 23 మే 2022న ‘సాక్షి టీవీ(Sakshi TV)’ తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో “CM YS Jagan Superb Answers at World Economic Forum in Davos | Sakshi TV” అనే శీర్షికతో లైవ్ టెలికాస్ట్ చేసిన వీడియో ఒకటి లభించింది. ఈ వీడియో యొక్క వివరణ ప్రకారం, మే 2022లో దావోస్ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జగన్ మాట్లాడిన సందర్భంలోనిది అని తెలుస్తుంది. ఈ వరల్డ్ ఎకనామిక్ ఫోరం చర్చలో జగన్ పాల్గొంది రిపోర్ట్ చేసిన మరిన్ని వార్త కథనాలు ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.

ఈ వీడియోని పూర్తిగా పరిశీలిస్తే, వైరల్ వీడియో క్లిప్పింగ్ లోని జగన్ మాట్లాడినట్లు చెప్తున్న దృశ్యాలు  టైంస్టాంప్ 02:33 వద్ద మొదలై, టైంస్టాంప్ 02:35 వద్ద ముగుస్తుంది అని తెలిసింది. ఈ సదస్సులో అడిగిన ఒక సుదీర్ఘమైన ప్రశ్నకు సమాధానం చెప్తూ వై.ఎస్. జగన్ “ఇట్స్ ఏ వెరీ లెంగ్తీ క్వశ్చన్(It’s a very lengthy question)”  అని అన్నారు. దీన్ని బట్టి ఇటీవల ప్రసారం అయిన ‘ఇండియా టుడే’ ఇంటర్వ్యూలోని వీడియో క్లిప్పింగ్‌కి, మే 2022లో దావోస్ జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో జగన్ మాట్లాడిన ఆడియోని చేర్చి ఎడిట్ చేస్తూ ఈ వైరల్ వీడియోను రూపొందించారు అని నిర్ధారించవచ్చు.

చివరగా, ఇంగ్లీషులో అడిగిన ప్రశ్న అర్థంకాక ఏపీ సీఎం వై.ఎస్. జగన్ సమాధానం చెప్పకుండా దాటేసాడు అని చెప్తూ ఎడిట్ చేసిన వీడియోను షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll