హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)ను పరిధిలో ఉన్న కంచ గచ్చిబౌలిలోని సర్వే నం.25లో 400 ఎకరాలను భూమిని టీజీఐఐసీ (TGIIC) ద్వారా వివిధ ప్రాజెక్టులకు కేటాయించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. యూనివర్సిటీకి చెందిన భూములను రాష్ట్ర ప్రభుత్వం వేలం వేసేందుకు ప్రయత్నిస్తోందని విద్యార్థులు చెబుతుండగా, ఆ భూములు ప్రభుత్వానివని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. 30 మార్చి 2025న ఈ భూములను జేసీబీలతో చదును చేసే పనులు ప్రభుత్వం ప్రారంభించగా, ఈ భూములు జింకలు, నెమళ్లు, తాబేళ్లు, పక్షులు సహా పలు రకాల వణ్యప్రాణులకు ఆవాసంగా ఉందని, పర్యావరణాన్ని నాశనం చేయొద్దని అభ్యంతరం వ్యక్తం చేస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు, పర్యావరణవేత్తలు, ప్రతిపక్షాలు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. 03 ప్రిల్ 2025 న ఈ భూముల్లో చెట్ల కొట్టివేతపై సుప్రీం కోర్టు స్టే విధించింది. అక్కడ జరుగుతున్న అన్ని పనులపై స్టే విధించింది. ఈ నేపథ్యంలో ఒక దుప్పి హెచ్‌సీయూ నుంచి తప్పించుకొని వచ్చి జనావాసాల్లో తిరుగుతుందని ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలోని కంచ గచ్చిబౌలి భూములను చదును చేస్తుంటే అక్కడినుంచి తప్పించుకొని జనావాసాలలోకి వచ్చిన దుప్పి యొక్క వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్ ప్రాంతానికి చెందినది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన దుప్పికి 02 ఏప్రిల్ 2025న స్థానికులు మంచి నీరు అందిస్తుండగా ఈ వీడియో తీయబడింది అని Way2News స్పష్టం చేసింది. కొంత మంది స్థానికులు కూడా ఇటువండి వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ వీడియో విశాఖపట్నంలోని విశాలాక్షి నగర్ ప్రాంతానికి చెందినదిగా కొందరు యూజర్లు ‘Way2News’ లోగోతో ఉన్న వీడియోని సోషల్ మీడియాలో షేర్ చెయ్యడం గమనించాం. దీని ఆధారంగా 02 ఏప్రిల్ 2025 న ఈ వీడియోని విశాఖపట్నంలోని జరిగిన ఘటనగా Way2News పబ్లిష్ చేసిందని గుర్తించాం.

దీని గురించి మరింత వెతకగా, కనీసం 2022 నుంచి ఈ ప్రాంతంలో దుప్పిలు పక్కనే ఉన్న అటవీ ప్రాంతం నుంచి ఇక్కడికి వస్తున్నట్లు వార్త కథనాలు, వీడియోలు లభించాయి. అలాగే, 14 మార్చి 2025లో కూడా వైరల్ వీడియోలో ఉన్న దుప్పితో కొందరు విశాలాక్షి నగర్ స్థానికులు కూడా ఫోటోలు దిగారు.

ఇక వైరల్ వీడియోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ముడిపెడుతూ కొందరు షేర్ చేస్తుండడంతో, ఈ వీడియో 02 మార్చి 2025నాడు వైజాగ్‌లోని విశాలాక్షి నగర్లో తీసినదని Way2News వారు స్పష్టం చేశారు.

చివరిగా, వైజాగ్ దుప్పి వీడియోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి ముడిపెడుతూ తప్పుగా షేర్ చేస్తున్నారు.