14 నవంబర్ 2025న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ సారథ్యంలోని NDA కూటమి రాష్ట్రంలోని 243 స్థానాలకు గాను 202 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్, ఆర్‌జేడీ, ఇతర పార్టీల కూటమి అయిన MGB కూటమి కేవలం 35 సీట్లు మాత్రమే గెలుపొందింది. ఇతరులు 5 స్థానాల్లో గెలిచారు.
ఈ నేపథ్యంలో, భారత ఎన్నికల సంఘం (ECI) ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ, బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ‘ఓట్ చోరీ’ జరిగింది అంటూ బీహార్ ప్రజలు భారీ నిరసనలు చేస్తున్నారని పేర్కొంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ, ఓట్లు దొంగిలించారని బీహార్ ప్రజలు భారీ నిరసనలు నిర్వహిస్తున్నారు.
ఫాక్ట్(నిజం): 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ, ఓట్లు దొంగిలించారని బీహార్ ప్రజలు భారీగా నిరసన చేపట్టినట్టు ఎటువంటి రిపోర్ట్స్/ఆధారాలు లేవు. అలాగే, ఈ వైరల్ వీడియో బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని నేత్రంగ్‌లో 15 నవంబర్ 2025న ఆమ్ ఆద్మీ పార్టీ MLA చైత్ర్ వసావ నిర్వహించిన ర్యాలీకి సంబంధించినది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ముందుగా, వైరల్ పోస్టులో పేర్కొన్నట్లుగా, 14 నవంబర్ 2025న ECI ప్రకటించిన 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీగా నిరసనలు నిర్వహిస్తున్నారా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ క్లెయింను సమర్థించే విశ్వసనీయ రిపోర్ట్స్/ఆధారలు లభించలేదు. ఒకవేళ 2025 బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను వ్యతిరేకిస్తూ బీహార్ ప్రజలు భారీగా నిరసనలు చేపట్టి ఉంటే, ఆ విషయాన్ని పలు మీడియా సంస్థలు ఖచ్చితంగా రిపోర్ట్ చేసి ఉండేవి.
తదుపరి వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను చైత్ర్ వసావ ఆర్మీ అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్ 15 నవంబర్ 2025న అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ పోస్ట్ యొక్క వివరణ ప్రకారం, ఈ వీడియో గుజరాత్‌లోని నేత్రాంగ్‌కు సంబంధించినదని పేర్కొన్నారు.
ఈ ర్యాలీకి సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, చైత్ర్ వసావ గుజరాత్‌లోని దేడియాపాడ నియోజకవర్గం ఆమ్ ఆద్మీ పార్టీ MLA అని, నేత్రంగ్ గుజరాత్‌లోని భరూచ్ జిల్లాలోని ఒక చిన్న పట్టణం, ఇది దేడియాపాడ నియోజకవర్గానికి ఆనుకుని ఉందని మేము కనుగొన్నాము. వార్త కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ), బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా 15 నవంబర్ 2025న చైత్ర్ వసావ నేత్రంగ్‌లో భారీ ర్యాలీ నిర్వహించారు అని వార్త కథనాలు పేర్కొన్నాయి.

గూగుల్ స్ట్రీట్ వ్యూ ఉపయోగించి, వైరల్ వీడియోలో కనిపించే భవనాలు గుజరాత్‌లోని నేత్రంగ్‌లోని గ్రామ పంచాయతీ రోడ్డులో ఉన్నట్లు మేము గుర్తించాము. ఈ క్రింది ఫొటోలో మీరు ఈ విషయాన్ని స్పష్టంగా గమనించవచ్చు. దీని ఆధారంగా, ఈ వైరల్ వీడియో గుజరాత్‌కి చెందినది, బీహార్‌ది కాదని స్పష్టమైంది.

చివరిగా, వైరల్ వీడియో బీహార్ కు సంబంధించినది కాదు; ఇది 15 నవంబర్ 2025న గుజరాత్‌లోని నేత్రంగ్‌లో జరిగిన ఒక ర్యాలీకి సంబంధించినది.

