దేశ ప్రజలు తరచూ తినే నూడుల్స్ పంది బొక్కలను ఉపయోగించి తయారుచేస్తారంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా షేర్ అవుతోంది. ఒక పరిశ్రమలో నూడుల్స్ తయారీ ప్రక్రియను చూపిస్తున్న వీడియోని ఈ పోస్టులో షేర్ చేశారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: నూడుల్స్ పంది బొక్కలను ఉపయోగించి తయారు చేస్తారు.
ఫాక్ట్ (నిజం): దక్షిణ కొరియాలోని ‘హరిమ్’ పరిశ్రమ తయారుచేసే ‘ది గౌర్మెంట్ ఆర్టీసన్ రామెన్’ ఉత్పత్తులలో, నూడుల్స్‌తో పాటు ఇచ్చే బీఫ్ మసాలా ప్యాకేట్‌ల తయారీ ప్రక్రియలోని కొంత భాగాన్ని పోస్టులో షేర్ చేసిన వీడియో చూపిస్తుంది. నూడుల్స్‌ను సాధారణంగా గోధమపిండి, మంచి నీరు మొదలగు వాటిని ఉపయోగించి ఆధునిక యంత్రాంగాల సహాయంతో తయారుచేస్తారు. నూడుల్స్ తయారుచేసే ప్రక్రియలో పరిశ్రమలు పంది మాంసాన్ని ఉపయోగించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలను చూపిస్తున్న వీడియోని ‘Yummy Yammy’ అనే యూట్యూబ్ ఛానెల్ 2022 ఫిబ్రవరి నెలలో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. కొరియన్ నూడుల్స్ ఫ్యాక్టరీలో రామెన్ (జపనీస్ నూడిల్ డిష్) తయారుచేసే ప్రక్రియ దృశ్యాలంటూ ఈ వీడియోని షేర్ చేశారు. దక్షిణ కొరియాలోని ‘హరిమ్’ పరిశ్రమలో ‘ది గౌర్మెంట్ ఆర్టీసన్ రామెన్’ ప్యాకెట్ల తయారి ప్రక్రియను ఈ వీడియో చూపిస్తుంది.
ఈ వీడియోలోని 0:40 నిమిషాల దగ్గర నుండి ‘ది గౌర్మెంట్ ఆర్టీసన్ రామెన్’ ప్యాకెట్‌లలో నూడుల్స్‌తో పాటు ఇచ్చే బీఫ్ మసాలా ప్యాకేట్‌ల తయారీ ప్రక్రియ గురించి వివరించారు. గొడ్డు (బీఫ్) మాంసాన్ని ఉపయోగించి మసాలా తయారుచేసే ప్రక్రియను ఒక్కొక్కటిగా ఈ వీడియోలో చూపించారు. వీడియోలోని 7:18 నిమిషాల నుండి ‘ది గౌర్మెంట్ ఆర్టీసన్ రామెన్’ ప్యాకెట్‌లలో ఇచ్చే వెజిటబుల్ మసాలా ప్యాకెట్ల తయారీ గురించి కూడా చూపించారు.
8:02 నిమిషాల దగ్గర నుండి ప్రాధమిక నూడిల్స్ తయారీ ప్రక్రియ గురించి చూపించారు. గోధమపిండిని నీరు మొదలగు వాటితో కలిపి ఆధునిక యంత్రాంగాల సహాయంతో నూడుల్స్‌లను రూపొందించే విధానాన్ని ఈ వీడియోలో చూపించారు. అయితే, నూడుల్స్ తయారీ ప్రక్రియలో మొట్టమొదట కొంత చికెన్ సూప్‌ను గోధమపిండి ఫ్లోర్‌లో కలిపారు. కానీ, నూడుల్స్ తయారీలో పంది మాంసాన్ని కలిపినట్టు ఈ వీడియోలో ఎక్కడా చూపించలేదు. అసలు, ‘హరిమ్’ పరిశ్రమ తయారుచేసే ‘ది గౌర్మెంట్ ఆర్టీసన్ రామెన్’ ప్యాకెట్‌లలో పంది మాంసాన్ని ఎక్కడా ఉపయోగించరు. అలాగే, ఈ దక్షిణ కొరియాకు సంబంధించిన ‘ది గౌర్మెంట్ ఆర్టీసన్ రామెన్’ నూడిల్స్ ప్యాకెట్లు ప్రస్తుతం భారత దేశంలో కొనుగోలుకు అందుబాటులో లేదు.
భారత దేశంలో అందుబాటులో ఉండే మ్యాగీ, మరియు ఇతర నూడుల్స్ ఉత్పత్తులలో నూడుల్స్‌లను రోటీ లేదా బ్రెడ్ తయారుచేసే విధంగానే గోధమపిండి, నీరు మొదలగు వాటిని ఉపయోగించి తయారుచేస్తామని ఈ పరిశ్రమలు తమ వెబ్సైటులలో తెలిపారు. భిన్నమైన రుచులకు అనుగుణంగా చికెన్ మరియు ఇతర రెసిపి మసాలా నూడుల్స్ ఉత్పత్తులు కూడా ఈ-కామర్స్ వెబ్సైటులలో కొనుగోలుకు అందుబాటులో ఉన్నాయి. కానీ, నూడుల్స్ తయారుచేసే ప్రక్రియలో పరిశ్రమలు పంది మాంసాన్ని ఉపయోగించినట్టు ఏ ఒక్క వార్తా సంస్థ ఇప్పటివరకు రిపోర్ట్ చేయలేదు.
భారత దేశంలో తయారుచేసే మ్యాగీ నూడుల్స్ ఉత్పత్తులు ఏవి కూడా పంది మాంసంతో తయారుచేయబడవని మ్యాగీ ఇండియా తమ వెబ్సైటులో స్పష్టం చేశారు. మ్యాగీ ఉత్పత్తులలో చికెన్ నూడుల్స్ మినహా, మిగితా మ్యాగీ 2-మినట్ నూడుల్ వేరియంట్‌లు అన్నీ పూర్తిగా శాఖాహారమైనవని మ్యాగీ తమ వెబ్సైటులో స్పష్టం చేసింది.
చివరగా, దక్షిణ కొరియాలో నూడుల్స్ ప్యాకెట్‌లలో ఇచ్చే బీఫ్ మసాలా ప్యాకెట్‌ల తయారీని చూపిస్తున్న వీడియోని పంది బొక్కలతో నూడుల్స్ తయారుచేస్తున్న దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.