ఆస్ట్రేలియన్ వ్యోమగామి అంతరిక్షం నుంచి దూకుతున్న దృశ్యాలు అని చెప్తూ సోషల్ మీడియాలో ఓ వీడియో ఒక పోస్ట్ ద్వారా షేర్ అవుతోంది. అతను దాదాపు లక్షా ఇరవైఎనిమిది వేల అడుగుల ఎత్తు నుండి దూకి 1,236 కిలోమీటర్ల దూరాన్ని 4 నిమిషాల 5 సెకన్లలో ప్రయాణించి భూమిని చేరుకున్నాడని ఈ పోస్ట్ పేర్కొంది. పోస్ట్‌లో చేసిన క్లెయిమ్‌లోని నిజానిజాల్ని ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాము.

క్లెయిమ్: ఆస్ట్రేలియన్ వ్యోమగామి అంతరిక్షం నుండి దాదాపు లక్షా ఇరవైఎనిమిది వేల అడుగుల ఎత్తు నుండి 1,236 కి.మీలను 4 నిమిషాల 5 సెకన్లలో కవర్ చేస్తూ భూమిపైకి దూకుతున్న వీడియో.
నిజం (ఫాక్ట్): అంతరిక్షం నుండి దూకిన వ్యక్తి ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్, ఆస్ట్రేలియన్ వ్యోమగామి కాదు. రెడ్ బుల్ స్ట్రాటోస్ మిషన్‌లో భాగంగా ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ 14వ అక్టోబర్ 2012న అంతరిక్షం నుండి సూపర్‌సోనిక్ ఫ్రీ ఫాల్‌ను రికార్డ్ చేశాడు. అతను భూమి నుండి 1,28,097 అడుగుల లేదా దాదాపు 24 మైళ్ల ఎత్తు నుండి దూకి 10 నిమిషాల కంటే తక్కువ సమయంలో భూమిని చేరుకున్నాడు. కాబట్టి, పోస్ట్‌లో చేసిన క్లెయిమ్ తప్పు.
వీడియోలోని కొన్ని ఫ్రేమ్స్ యొక్క స్క్రీన్‌షాట్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చెయ్యగా, ‘స్కై న్యూస్’ అధికారిక YouTube ఛానెల్‌లో ప్రచురించబడిన ఒక వీడియోలో ఇలాంటి విజువల్స్ మాకు కనిపించాయి. ‘Sky News’ ఛానెల్ ఈ వీడియోను 15వ అక్టోబర్ 2012న “Felix Baumgartner skydives from the space” అనే శీర్షికతో ప్రచురించింది. వీడియో వివరణలో, స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ భూమి నుండి 1,28,097 అడుగుల ఎత్తు నుండి దూకి చరిత్ర సృష్టించాడని పేర్కొన్నారు. ఫెలిక్స్ బామ్‌గార్ట్నర్ ఒక పెద్ద హీలియం బెలూన్ నుండి దూకిన తర్వాత, తన పారాచూట్ తెరవడానికి ముందు నాలుగు నిమిషాల 19 సెకన్ల పాటు ఫ్రీ-ఫాల్ అయ్యాడని ఇందులో తెలిపారు.

దీనిపై మరింత సమాచారం కోసం ఇంటర్నెట్లో వెతకగా, 14వ అక్టోబర్ 2012న BBC న్యూస్ ప్రచురించిన కథనంలో అదే వీడియో కనిపించింది. ఈ కథనం ప్రకారం, ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ అక్టోబర్ 14 2012లో, రెడ్ బుల్ స్ట్రాటోస్ మిషన్‌లో భాగంగా రికార్డ్ బద్దలు కొట్టే స్కై డైవ్ చేసారు. బామ్‌గార్ట్‌నర్ 1,28,097 అడుగుల (39,000 మీటర్లు) లేదా భూమి నుండి దాదాపు 24 మైళ్ల ఎత్తు నుండి భూమి పైకి దూకి, ఎతైన స్కైడైవ్‌గా ప్రపంచ రికార్డును సృష్టించినట్లు ఆ రిపోర్ట్ చెప్తుంది. 833.9 mph లేదా 1,342 kmph గరిష్ట వేగాన్ని చేరుకుని, ధ్వని వేగం కంటే వేగంగా (సూపర్ సోనిక్) ప్రయాణించిన మొదటి స్కైడైవర్‌గా బామ్‌గార్ట్నర్ అవతరించినట్లు రాసారు. ఇదే విషయాన్ని రిపోర్ట్ చేస్తూ, ‘Space.com’ వెబ్‌సైట్ ఫెలిక్స్ బామ్గార్ట్నర్ యొక్క రికార్డ్-బ్రేకింగ్ సూపర్‌సోనిక్ జంప్‌పై కథనాన్ని ప్రచురించింది.

రెడ్ బుల్ స్ట్రాటోస్ వెబ్‌సైట్‌లో ప్రచురించిన వీడియోలలో కూడా ఇవే విజువల్స్ కనిపిస్తాయి. రెడ్ బుల్ స్ట్రాటోస్ అనేది ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్‌తో రెడ్ బుల్ వారు కలిసి చేసిన high altitude skydiving project. రెడ్ బుల్ స్ట్రాటోస్ అదే వీడియోను తమ అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో పోస్ట్ చేసింది. ఫెలిక్స్ బామ్గార్ట్నర్ యొక్క సూపర్సోనిక్ జంప్ ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్’ వెబ్‌సైట్‌లో కూడా ప్రస్తావించబడింది. వీటన్నిటి ప్రకారం, అంతరిక్షం నుండి దూకిన వ్యక్తి ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్‌గార్ట్‌నర్ అని, ఆస్ట్రేలియా దేశం యొక్క వ్యోమగామి కాదని నిర్ధారించవచ్చు.

చివరిగా, ఆస్ట్రియన్ స్కైడైవర్ ఫెలిక్స్ బామ్గార్ట్నర్ యొక్క సూపర్‌సోనిక్ ఫ్రీ ఫాల్ వీడియోని ఆస్ట్రేలియన్ వ్యోమగామి అంతరిక్షం నుండి దూకుతున్న దృశ్యాలుగా షేర్ చేస్తున్నారు.