ఓ వినాయక మండపంలో పూజ చేస్తుండగా గుండెపోటుకు గురైన ఒక పూజారిని వినాయకుడు కాపాడిన దృశ్యాలంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేయబడుతోంది (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, వినాయక మండపంలో పూజలు చేస్తున్న ఒక పూజారి అకస్మాత్తుగా స్పృహ తప్పి పడిపోగా, వినాయకుడి విగ్రహం నుండి ఒక జెండా పూజారిపై పడటంతో అతను తిరిగి లేవడం మనం చూడవచ్చు. దీన్ని ఒక నిజమైన సంఘటనలా సోషల్ నీడలో పలువురు షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: వినాయక మండపంలో గుండెపోటుకు గురైన పూజారిని వినాయకుడు కాపాడిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఇది నిజంగా జరిగిన సంఘటన కాదు, ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోను ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానెల్ రూపొందించి, 19 సెప్టెంబర్ 2024న సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వైరల్ వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు, ఇదే వీడియోను నటి సంజనా గల్రానీ తన ఫేస్‌బుక్ పేజీలో 19 సెప్టెంబర్ 2024న “It Was Pure Luck..” అనే ఇంగ్లీష్ శీర్షికతో అప్‌లోడ్ చేసినట్లు మేము కనుగొన్నాము.

ఈ క్రమంలోనే, ఇదే వీడియోను 19 సెప్టెంబర్ 2024న స్క్రిప్టెడ్ వీడియోలను తరచూ షేర్ చేసే ‘3RD EYE’ అనే యూట్యూబ్ ఛానల్ కూడా షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. ఈ వీడియో వివరణలో, ఈ వీడియో వినోదం మరియు ప్రజల అవగాహన ప్రయోజనాల కోసం మాత్రమే రూపొందించబడింది’ అని స్పష్టంగా పేర్కొన్నారు.
3rd eye, సంజన అప్లోడ్ చేసిన పలు స్క్రిప్టెడ్ వీడియోలను, గతంలో కూడా నిజమైన సంఘటనలగా సోషల్ మీడియాలో కొందరు షేర్ చేయగా, అవి నిజమైన సంఘటనలకి చెందిన వీడియోలు కావు అని చెప్తూ మేము (Factly) పబ్లిష్ చేసిన ఫాక్ట్-చెక్ కథనాలను ఇక్కడ, ఇక్కడ , ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, వినాయక మండపంలో గుండెపోటుకు గురైన పూజారిని వినాయకుడు కాపాడిన దృశ్యాలంటూ ఒక స్క్రిప్టెడ్ వీడియోను షేర్ చేస్తున్నారు.