‘రారండోయ్ తండ్రి బిడ్డల పెండ్లి చూద్దాం’ అని చెప్తూ సోషల్ మీడియాలో ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతురిని పెళ్లి కొన్నాడు అని క్లెయిమ్ చేస్తున్న వీడియో(ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) ఒకటి వైరల్ అవుతోంది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకొని వెళ్తుండగా వాళ్లని ఒకతను ప్రశ్నిస్తూ ఈ వీడియోని తీసినట్లు కనిపిస్తుంది. అసలు దీని వెనుక ఉన్న నిజానిజాలు ఏంటో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

క్లెయిమ్: ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతుర్ని పెళ్లి చేసుకున్న సంఘటనని ఈ వీడియో చూపిస్తుంది.
ఫ్యాక్ట్(నిజం): వాస్తవానికి ఇది ఒక స్క్రిప్టెడ్ వీడియో. ఈ వీడియోని కన్నయ్య సింగ్ అనే యూట్యూబర్ అప్లోడ్ చేశాడు. దీన్ని కేవలం ‘వినోదం’ కోసం తయారు చేశారు అని ఇదే వీడియోలో ఒక డిస్‌క్లైమర్ ఉంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.
వైరల్ వీడియోని గురుంచి పరిశోధిస్తున్న క్రమంలో అందులో 0:07 సెకన్ల నిడివి దగ్గర ఒక వివరణ మరియు ‘Kanhaiya Singh’ అనే పేరు ఉండటం గమనించాం. ఈ పేరు, ఈ వీడియోని మొదటగా అప్లోడ్ చేసిన వ్యక్తికి సంబందించింది అయ్యి ఉంటుంది అనే అనుమానంతో, ‘Kanhaiya Singh’కి సంబంధించిన సోషల్ మీడియా ప్రొఫైల్స్ కోసం తగిన ‘కీ వర్డ్స్’ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతికాము.

ఈ సెర్చ్ ద్వారా ‘Kanhaiya Singh’ యొక్క యూట్యూబ్ అకౌంట్ మాకు దొరికింది. ఇతని యూట్యూబ్ ఛానల్‌లో తను స్క్రిప్టెడ్ వీడియోలు అంటే ఫిక్షనల్ (కల్పత) వీడియోలని (ఇక్కడ మరియు ఇక్కడ) అప్లోడ్ చేస్తాడని మాకు తెలిసింది. వైరల్ వీడియోలో కనిపిస్తున్న వివరణ కార్డ్ ఇతని యూట్యూబ్ వీడియోలలో కూడా ఉంది.

కానీ, వైరల్ అవుతున్న వీడియో మాత్రం ఈ ఛానల్‌లో మాకు దొరకలేదు. ‘Kanhaiya Singh’ వివరణ కార్డ్ మరియు వీడియోలలో ఉన్న కంటెంట్ బట్టి ఇది ఇతను చేసిన వీడియోనే అని నిర్ధారణకు వచ్చి, మరికొన్ని కీ వర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో సెర్చ్ చేయగా తనకు ‘Kanhaiya Singh shorts’ అనే మరో యూట్యూబ్ ఛానల్ ఉంది అని తెలిసింది. వైరల్ అవుతున్న వీడియో ఇదే ఛానల్‌లో ఉంది.

ఈ వీడియోను అతను 7 సెప్టెంబర్ 2024న అప్లోడ్ చేశాడు. ఇందులో కూడా ఈ వీడియోని కేవలం ఎంటర్‌టైన్‌మెంట్/వినోదం కోసం తయారు చేశాడు అని చెప్తున్న వివరణ ఉంది. ఈ వీడియోలో ఉన్న వ్యక్తులు ఇతని ఛానల్‌లోనే వేరే వీడియోలలో కూడా నటించారు, వాటిని మీరు ఇక్కడ మరియు ఇక్కడ చూడచ్చు.
చివరిగా, ఒక ఫిక్షనల్ (కల్పిత) వీడియోని షేర్ చేస్తూ, ఒక ముస్లిం వ్యక్తి తన సొంత కూతుర్ని వివాహం చేసుకున్నాడు అని తప్పుగా క్లెయిమ్ చేస్తున్నారు.