Fake News, Telugu
 

స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పగుళ్లు వచ్చినట్టుగా 2018లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయంలో తీసిన ఫోటోను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

“ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్‌ విగ్రహం) విగ్రహానికి ఇటీవల పగుళ్లు ఏర్పడ్డాయి” అంటూ స్టాట్యూ ఆఫ్ యూనిటీకి సంబంధించిన ఫోటోలతో కూడిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది (ఇక్కడ,& ఇక్కడ). ఒక ఫొటోలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహం పాదాల సమీపంలో కొన్ని పగుళ్ల లాగా ఉన్న వాటిని మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఇటీవల స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ పటేల్‌ విగ్రహం) విగ్రహానికి పగుళ్లు ఏర్పడ్డాయి. అందుకు సంబంధించిన ఫోటో.

ఫాక్ట్(నిజం): స్టాట్యూ ఆఫ్ యూనిటీకి ఎలాంటి పగుళ్లు ఏర్పడలేదు. ఈ వైరల్ ఫోటో అక్టోబర్ 2018లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయంలో తీసిన ఫోటో. భారత ప్రభుత్వ PIB ఫాక్ట్ – చెక్ సంస్థ కూడా ఈ వార్తలో నిజంలేదని, ఈ ఫోటో 2018నాటిది అని స్పష్టం చేస్తూ పోస్ట్ చేసింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ముందుగా ఈ వైరల్ ఫొటోకు సంబంధించిన సమాచారం కోసం, గూగల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతకగా, 2018లో ఇదే ఫోటోను రిపోర్ట్ చేస్తూ పబ్లిష్ చేసిన పలు వార్త కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కథనాలలో పేర్కొన్న ఫోటో వివరణ ప్రకారం, ఈ ఫోటో 18 అక్టోబర్ 2018న నిర్మాణ కార్మికులు స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహానికి తుది మెరుగులు దిద్దుతున్న దృశ్యాలను చూపిస్తుంది. అలాగే, ఈ ఫోటోని యురోపియన్ ప్రెస్ ఫొటో ఏజెన్సీ(EPA)కి ఆపాదిస్తూ, దివ్యకాంత్ సోలంకి అనే వ్యక్తి ఈ ఫోటో తీసినట్టుగా ఈ కథనాలు పేర్కొన్నాయి.

తదుపరి మేము దీన్ని ఆధారంగా ఇదే ఫొటోను EPA వెబ్సైటులో కనుగొన్నము. “అహ్మదాబాద్ కు 200 కిలోమీటర్ల దూరంలో కెవాడియా వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద భారత నిర్మాణ కార్మికులు,” అనే వివరణతో ఈ ఫోటో 18 అక్టోబర్ 2018న అప్లోడ్ చేయబడింది.

వైరల్ ఫోటోను, మరియు ఈ 2018 స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయంలో తీసిన ఫోటోను పోల్చి చూస్తే, వైరల్ ఫోటో 2018లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయంలో తీసిన ఫోటోగా మనం నిర్ధారించవచ్చు. ఈ రెండు ఫొటోలను క్రింద పోల్చి చూడవచ్చు.

తదుపరి ఇటీవల స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పగుళ్లు వచ్చాయా? అని తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్‌లో వెతకగా, వైరల్ క్లెయిమ్ కు మద్దతు ఇచ్చే ఎలాంటి విశ్వసనీయమైన రిపోర్ట్స్ లభించలేదు. ఒక వేళ ఇలాంటి ఏదైనా ఘటన జరిగి ఉంటే, ఖచ్చితంగా పలు మీడియా సంస్థలు ఈ విషయాన్ని రిపోర్టు చేసి ఉండేవి. అలాగే మేము ఈ మధ్య కాలంలో స్టాట్యూ అఫ్ యూనిటీ యొక్క అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్టు చేసిన ఒక ఫొటోను కన్నుగొన్నాము, ఇందులో కుడా ఎలాంటి పగుళ్లు లేవు. ఈ క్రమంలోనే, మహారాష్ట్రలోని సింధుదుర్గ్ జిల్లాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం కూలిపోయిన నేపథ్యంలో స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పగుళ్లు వచ్చాయని చెప్తూ పలు తప్పుడు పోస్టులు సోషల్ మీడియా వైరల్ అవుతున్నాయి అని, వీటిపై గుజరాత్ పోలీసులు కేసు నమోదు చేశారు అని చెప్తున్న పలు వార్తాకథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ కేసుకు సంబంధించి గుజరాత్ పోలీసులు నమోదు చేసిన FIRను ఇక్కడ చూడవచ్చు.  

అలాగే ఈ  వైరల్ పోస్టులో ఎలాంటి నిజం లేదని. ఈ వైరల్ ఫోటో 2018లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయంలో తీసిన ఫోటో అని స్పష్టం చేస్తూ భారత ప్రభుత్వానికి చెందిన ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’(PIB) సంస్థ తమ అధికారిక ఫాక్ట్-చెకింగ్ X(ట్విట్టర్)లో పోస్ట్ చేసింది.  

చివరగా, ఇటీవల స్టాట్యూ ఆఫ్ యూనిటీకి పగుళ్లు వచ్చినట్టుగా2018లో స్టాట్యూ ఆఫ్ యూనిటీ నిర్మాణ సమయంలో తీసిన ఫోటోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll