Fake News, Telugu
 

భోపాల్ నగరాన్ని పాలించిన బేగంల ఫోటోలను షాజహాన్ భార్య ముంతాజ్ అని తప్పుగా షేర్ చేస్తున్నారు

0

మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ బేగం ఫోటో అని క్లెయిమ్ చేస్తూ రాజ వేషధారణలో అలంకరించబడిన మహిళల బ్లాక్ అండ్ వైట్ ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందో చూద్దాం.

క్లెయిమ్: మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ముంతాజ్ బేగం ఫోటో. 

ఫాక్ట్ (నిజం): ఫోటోలో ఉన్న మహిళల పేర్లు సుల్తాన్ షాజహాన్ బేగం, బేగం సుల్తాన్ జహాన్. వారు  భోపాల్ నగరాన్ని పాలించిన మూడవ బేగం మరియు నాలుగవ బేగం. ఈ ఫొటోలో ఉన్న వారికి షాజహాన్ భార్య ముంతాజ్ బేగంకి ఎటువంటి సంబంధం లేదు. కావున, ఈ పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు

పోస్టులో వైరల్ అవుతున్న క్లెయిమ్ నిజామా కాదా అని తెలుసుకోడానికి, ఎడమ వైపు ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఆ ఫోటో స్టాక్ ఇమేజ్  వెబ్సైట్ ఆలమిలో లభించింది. ఆలమిలో పేర్కొన్న వివరణ ప్రకారం ఫొటోలోని మహిళ భోపాల్ నగర బేగం సుల్తాన్ షా జహాన్ అని తెలిసింది.

అలాగే కుడి వైపు ఉన్న మహిళ ఫోటోని గూగుల్ లో  రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇండియన్ ఎక్ష్ప్రెస్స్ వారి కథనం  కనిపించింది. ఈ కథనం ప్రకారం ఆమె పేరు సుల్తాన్ జహాన్ అని, తాను భోపాల్ నగరాన్ని పాలించిన చివరి బేగం అని తెలిసింది.

భారత ప్రభుత్వానికి చెందిన అధికారిక పోర్టల్  “indianculture.gov.in” లో భోపాల్ కి సంబందించిన బేగంల గురించి వెతకగా వారి ఫోటోలు “బేగంస్ ఆఫ్ భోపాల్: 107 ఇయర్స్ అఫ్ గోల్డెన్ రెయిన్” అనే ఒక ఆర్టికల్ లో కనిపించాయి. ఈ ఆర్టికల్ ప్రకారం భోపాల్ నగరాన్ని 1819 నుండి 1926 వరకు నలుగురు మహిళలు పరిపాలించారని, ఎడమ వైపు ఫోటోలో ఉన్న షా జహాన్ బేగం (1838 – 1901) భోపాల్ ని పాలించిన  మూడవ బేగం అని, కుడి వైపు ఫోటోలో ఉన్నది సుల్తాన్ జహాన్  బేగం (1858 – 1930) అని, ఆమె భోపాల్ ని పాలించిన నాలుగవ మరియు చివరి బేగం అని తెలిసింది. అంతేకాక, ఆమె మూడవ బేగం అయిన షా జహాన్ బేగం కూతురు అని తెలిసింది.

మొఘల్ చక్రవర్తి, షాజహాన్ భార్య అయిన ముంతాజ్ మహల్ 1593 నుండి 1631 వరకు జీవించింది. తను తాజ్ మహల్ నిర్మాణానికి స్ఫూర్తిగా ప్రసిద్ధి. ఫోటోలో ఉన్న షా జహాన్ బేగం, సుల్తాన్ జహాన్ బేగం మరియు ముంతాజ్ మహాల్ వేరు వేరు కాలాలకు చెందిన వారు.

చివరగా, భోపాల్ నగరాన్ని పాలించిన మూడవ మరియు నాలుగవ బేగంల ఫోటోలను షాజహాన్ భార్య ముంతాజ్ అని తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll