Fake News, Telugu
 

గతంలో మధ్యప్రదేశ్‌లో పిడుగుపాటుతో చనిపోయిన వ్యక్తి ఫోటోను అసంబద్ధమైన తప్పుడు సమాచారంతో షేర్ చేస్తున్నారు

0

మధ్యప్రదేశ్‌లో ఒక రైతు పేదరికం వల్ల కాళ్ళ చెప్పులు కొనలేక పాత చెప్పును ఇనుప తీగతో చుట్టిన ఫలితంగా విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయాడంటూ, దీనికి సంబంధించిన ఫోటోలు షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోలకు సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: మధ్యప్రదేశ్‌లో ఒక రైతు పేదరికం వల్ల కాళ్ళ చెప్పులు కొనలేక పాత చెప్పును ఇనుప తీగతో చుట్టిన ఫలితంగా విద్యుత్ ప్రమాదానికి గురై చనిపోయిన ఫోటోలు.

ఫాక్ట్(నిజం): ఈ ఫోటో మధ్యప్రదేశ్‌లోని దేవస్ జిల్లాలోఒక రైతు పిడుగుపాటు వల్ల తన రెండు ఎద్దులతో పాటు అక్కడికక్కడే చనిపోయిన ఘటనకు సంబంధించింది. ఈ ఘటన 2018లో జరిగింది. ఇకపోతే చెప్పుకు ఇనుప తీగ చుట్టి ఉన్న ఫోటో అంతకు ముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉంది. ఈ రెండు ఫోటోలకు ఎటువంటి సంబంధంలేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

పోస్టులో షేర్ చేసిన ఫోటోలు రెండు ఒకదానికి ఒకటి సంబంధం లేదు. పైగా ఎద్దులతో పాటు వ్యక్తి చనిపోయింది పిడుగుపాటు వల్ల, విద్యుత్ఘాతం వల్ల కాదు. షేర్ అవుతున్న ఈ ఫోటోలకు సంబంధించి మరింత సమాచారం కోసం ఈ ఫోటోలను విడివిడిగా రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఎద్దులతో పాటు వ్యక్తి చనిపోయి ఉన్న ఫోటోను 2018లో ప్రచురించిన ఒక ఆన్లైన్ వార్తా కథనం మాకు కనిపించింది.

ఈ కథనం ప్రకారం మధ్యప్రదేశ్‌లోని దేవస్ జిల్లాలోని లక్ష్మీనగర్ కడుడియా గ్రామంలో వర్షం పడుతుండడంతో గట్టు భిలాల అనే రైతు తన రెండు ఎద్దులతో పాటు మామిడి చెట్టు కింద నిలబడి ఉన్న సమయంలో పిడుగు పడడంతో రెండు ఎద్దులతో పాటు రైతు కూడా అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఫోటో ఆ ఘటనకు సంబంధించినవే.

ఈ కథనం ఆధారంగా మరింత సమాచారం కోసం వెతకగా ఈ ఘటనకు సంబంధించిన మరొక ఫోటో పబ్లిష్ చేసిన వేరొక వార్తా కథనం మాకు కనిపించింది. ఈ కథనం కూడా ఈ ఫోటోకు సంబంధించి పైన తెలిపిన వివరాలను దృవీకరిస్తూ ఉంది.

పైగా ఈ రెండు కథనాలలో ఎక్కడ కూడా ఆ రైతు ఇనప తీగలు చుట్టిన చెప్పులు వేసుకున్నట్టు గానీ, ఇందువల్లే చనిపోయినట్టు గానీ రిపోర్ట్ చేయలేదు. వీటన్నిటి బట్టి పోస్టులో చెప్తున్నట్టు ఫోటోలోని రైతు చనిపోయింది విద్యుత్ఘాతం వల్ల కాదని, పిడుగుపాటు వల్ల అని స్పష్టమవుతుంది.

ఇకపోతే చెప్పుకు ఇనప తీగలు చుట్టిన ఫోటోకు ఈ ఘటనతో ఎటువంటి సంబంధం లేదు. ఈ ఫోటోను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటో పైన తెలిపిన ఘటన కన్నా ముందు నుండే ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉందని తెలిసింది. ఇదే చెప్పు ఫోటోను 2016లో మరియు 2017లో షేర్ చేసిన సోషల్ మీడియా పోస్టులు చూడొచ్చు.

పైగా చెప్పులపై ఉన్న బ్రాండ్ పేరు ఆధారంగా వెతకగా ఇది బ్రెజిల్‌కు చెందిన ‘Havaianas’ అని తెలిసింది. ఐతే ఈ కంపెనీ భారత్‌లో తమ విక్రయాలను 2019లో మొదలుపెట్టింది. అంటే దీన్నిబట్టి వైరల్ అవుతున్న ఫోటోకు పిడుగుపాటుకు చనిపోయిన వ్యక్తికి ఎటువంటి సంబంధంలేదని మళ్ళీ స్పష్టమవుతుంది.

చివరగా, గతంలో మధ్యప్రదేశ్‌లో పిడుగుపాటుతో చనిపోయిన వ్యక్తి ఫోటోను తప్పుడు వాదనతో ఇప్పుడు షేర్ చేస్తున్నారు

Share.

About Author

Comments are closed.

scroll