Fake News, Telugu
 

హైదరాబాద్‌లోని శంషాబాద్ వియామనాశ్రయంలో ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారని ఒక మాక్ డ్రిల్ వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు

0

శంషాబాద్ విమానాశ్రయంలో ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారని, అందులో ఒకరు తప్పించుకోబోతే పోలీసులు కాల్చి చంపేశారని చెప్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో కొందరు యూనిఫాం వేసుకున్న వ్యక్తులు, మోకాళ్లపై నుంచున్న ఇద్దరి వైపు తమ గన్నులు గురిపెట్టడం మనం చూడవచ్చు. అలాగే, ఈ వీడియోలో ఉన్న మరో క్లిప్పులో నల్ల దుస్తులు ధరించిన ఒక వ్యక్తి నేలపై పడిపోయి ఉండటం కూడా మనం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ క్లెయిమ్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: హైదరాబాద్‌లోని శంషాబాద్ వియామనాశ్రయంలో (రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) ముగ్గురు ఉగ్రవాదులు పోలీసులకు చిక్కినప్పుడు తీసిన దృశ్యాలు.

ఫ్యాక్ట్(నిజం): ఇది శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల జరిగిన ఒక CISF (Central Industrial Security Force) మాక్ డ్రిల్ సందర్భంగా తీసిన వీడియో అని తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు

ఈ క్లెయిమ్ వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా, శంషాబాద్ విమానాశ్రయంలో ఇటీవల ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారని చెప్తూ మాకు ఎటువంటి వార్తా కథనాలు దొరకలేదు.

అలాగే, ఈ సెర్చ్ ద్వారా, వైరల్ అవుతున్న క్లెయిమ్ ఫేక్ అని చెప్తూ తెలంగాణా ప్రభుత్వం యొక్క అధికారిక ఫాక్ట్ చెక్ విభాగం ‘Fact Check Telangana’ తమ అధికారిక ‘X’ అకౌంట్లో పోస్ట్ చేశారని మాకు తెలిసింది. 

వైరల్ వీడియోని పోస్ట్ చేస్తూ, ఇది ఫేక్ న్యూస్ అని, ఇది శంషాబాద్ విమానాశ్రయంలో ఒక CISF(Central Industrial Security Force) మాక్ డ్రిల్ జరుగుతున్నప్పుడు తీసిన వీడియో అని వారు 13 మే 2025న చేసిన పోస్టులో చెప్పారు. దీన్ని అక్కడ పాకిస్తానీ తీవ్రవాదులు పట్టుబడ్డారని చెప్తూ తప్పుగా షేర్ చేస్తున్నారని వారు పేర్కొన్నారు.ఇదే పోస్టుని CISF కూడా తమ అధికారిక ‘X’ హ్యాండిల్ ద్వారా షేర్ చేసింది

తెలంగాణ రాష్ట్ర సైబర్ బ్యూరో, శంషాబాద్ విమానాశ్రయం కూడా వారి ‘X’ హ్యాండిల్స్ ద్వారా ఈ పుకార్లన్నీ ఫేక్ అని స్పష్టం చేశారు (ఇక్కడ, ఇక్కడ).

చివరగా, హైదరాబాద్‌లోని శంషాబాద్ వియామనాశ్రయంలో ముగ్గురు ఉగ్రవాదులు పట్టుబడ్డారని, ఒక మాక్ డ్రిల్ వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll