వక్ఫ్ సవరణ చట్టం, 2025ని వ్యతిరేకిస్తూ, ఏప్రిల్ 2025లో పశ్చిమ బెంగాల్లోని చాలా చోట్ల నిరసనలు జరిగాయి. ముర్షిదాబాద్ జిల్లాలో ఈ ఆందోళనులు హింసాత్మకంగా మారి, గొడవలు, అల్లర్లు కూడా జరిగాయని వార్తా కథనాలు పేర్కొన్నాయి(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). వార్తా కథనాల ప్రకారం(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ), పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్‌లో జరిగిన ఈ గొడవల కారణంగా ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, ఇందులో చందన్ దాస్, హరగోబింద్ దాస్ అనే ఇద్దరు హిందువులు ఒక మూక దాడిలో మరణించగా, ఒక ముస్లిం వ్యక్తి పోలీసు కాల్పుల్లో చనిపోయాడు. ముర్షిదాబాద్ జిల్లాలో జరుగుతున్న ఈ హింసను తప్పించుకోవడానికి వందలాది హిందువులు తమ ఇళ్లను వదిలి, ఆశ్రయం పొందడానికి మాల్డా నగరానికి చేరుకున్నారు(ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). పరస్థితిని అదుపులోకి తీసుకురావడానికి జంగిపూర్‌లో కేంద్ర బలగాలని మోహరించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది(ఇక్కడ, ఇక్కడ). ఈ అల్లర్లకు సంబంధించి సుమారు 150 పైగా వ్యక్తులు అరెస్ట్ అయ్యారు (ఇక్కడ, ఇక్కడ).
ఈ నేపథ్యంలో, పశ్చిమ బెంగాల్‌లోని ఓ దళిత కుటుంబం ఇంటిపై ముస్లిం మూక దాడి చేసిందని పేర్కొంటూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ). ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్‌లో ఓ దళిత కుటుంబం ఇంటిపై ముస్లిం మూక దాడి చేస్తున్నట్లు చూపిస్తున్న దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో 2025 మార్చిలో మధ్యప్రదేశ్‌లోని సెహోర్ జిల్లాలోని బక్తారా గ్రామంలో జరిగిన అల్లర్ల సమయంలో తీయబడింది. అక్కడ, ఒక యువకుడి హత్య తర్వాత దళితులు, కిరార్ వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి, ఇది తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ వీడియోకు పశ్చిమ బెంగాల్‌తో ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ఈ వైరల్ వీడియోకు సంబంధించిన మరింత సమాచారం కోసం, ఈ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, బహుజన్ సమాజ్ పార్టీ జాతీయ కోఆర్డినేటర్, రాజ్యసభ ఎంపీ రాంజీ గౌతమ్ ఇదే వీడియోను 07 మార్చి 2025న X (ట్విట్టర్)లో షేర్ చేస్తూ, మధ్యప్రదేశ్‌లో అడవిరాజ్యం నడుస్తోందన్నారు. బీజేపీ ప్రభుత్వం దళితులు, వెనుకబడిన తరగతులు, గిరిజనులను రక్షించడంలో పూర్తిగా విఫలమైందని, సెహోర్ జిల్లా బక్తారా గ్రామంలో సుమారు 500 మంది గుంపు దళితుల ఇళ్లపై దాడి చేసి, ఇంటి తలుపులు పగలగొట్టారని మహిళలు, పిల్లలపై కూడా దాడి చేశారని, దీన్నంతా చూస్తూ పోలీసులు మౌనంగా నిలిచిపోయారని ఆయన పేర్కొన్నారు.
ఈ సంఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 07 మార్చి 2025న జీ న్యూస్ యూట్యూబ్ ఛానల్‌లో ప్రచురించబడిన ఒక రిపోర్ట్ మాకు లభించింది.
ఈ రిపోర్ట్ ప్రకారం, సీహోర్ జిల్లా బక్తారా గ్రామంలో దళితులు, కిరార్ సామాజిక వర్గాల మధ్య గొడవ జరిగింది. కిరార్ వర్గానికి చెందిన బబ్లేశ్ చౌహాన్ హత్య తర్వాత ఈ వివాదం పెరిగింది. ఊరిలో కొంతమంది చాలాచోట్ల నిప్పు పెట్టారు. కిరార్ వర్గం తమ దుకాణాల్లో దళితులకు సరుకులు అమ్మకానికి నిరాకరించింది. దాంతో వారు దళితులను బహిష్కరించడంతో గ్రామంలో ఉద్రిక్తతలు మరింతగా పెరిగాయి. ఈ ఉద్రిక్తతలు చివరకు అల్లర్లుగా మారాయి.
ఈ సంఘటనకు సంబంధించిన పలు వార్త కథనాలు ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, మార్చి 2025లో మధ్యప్రదేశ్‌లోని బక్తారా గ్రామంలో జరిగిన అల్లర్ల వీడియోని పశ్చిమ బెంగాల్ వివాదానికి ముడిపెడుతూ షేర్ చేస్తున్నారు.