22 ఏప్రిల్ 2025న పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి కారణంగా భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో, బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) పాకిస్తాన్‌పై దాడి చేసి పాక్ ఆర్మీకి చెందిన 40 మంది సైనికులని హతమార్చిందని చెప్తూ ఒక వీడియోతో పాటు బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ పేరుతో ఉన్న ఒక లేఖ సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.

క్లెయిమ్: పహల్గాం ఉగ్రదాడి తర్వాత బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 40 మంది పాక్ ఆర్మీ సైనికులను హతమార్చడాన్ని చూపుతున్న వీడియో.
ఫాక్ట్: ఈ వీడియో లెబనాన్ రాజధాని బీరుట్ పై నవంబర్ 2025లో ఇజ్రాయెల్ దాడి చేసిన దృశ్యాలను చూపుతుంది. అలాగే, వైరల్ వీడియోలోని లేఖని BLA 26 ఆగస్ట్ 2024లో విడుదల చేసింది, పాకిస్తాన్‌లోని బేలా నగరం వద్ద ప్రధాన సైనిక శిబిరంపై BLA జరిపిన దాడిలో 40 మంది పైగా పాక్ సైనికులను హతమార్చినట్లు BLA అప్పట్లో ప్రకటించింది. అయితే, 25 ఏప్రిల్ 2025లో క్వెట్టాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసి 10 మందిని పాక్ సైనికులను హతమార్చినట్లు BLA ప్రకటించింది. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
ముందుగా, వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా దీనికి సంబంధించిన అసలు వీడియో లభించింది. ఈ వీడియోని 25 నవంబర్ 2024లో ‘ది క్రాడిల్’ అనే వార్తా సంస్థ xలో పోస్టు చేసింది. దీని ప్రకారం, ఈ వీడియో లెబనాన్ రాజధాని బీరుట్ పై నవంబర్ 2025లో ఇజ్రాయెల్ దాడి చేసిన దృశ్యాలను చూపుతుంది.
ఇక వైరల్ వీడియోలో ప్రస్తావించిన లేఖ గురించి వెతకగా, ఈ లేఖని బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ (BLA) 26 ఆగస్ట్ 2024లో విడుదల చేసినట్లు గుర్తించాం. ఈ లేఖలో వెల్లడించిన వివరాల ప్రకారం, పాకిస్తాన్‌లోని బేలా నగరం వద్ద ప్రధాన సైనిక శిబిరంపై జరిగిన దాడిలో 40 మంది పైగా పాక్ సైనికులు మరణించారు. BLA కి చెందిన మజీద్ బ్రిగేడ్ సైనిక శిబిరం ప్రధాన ద్వారం వద్ద ఉన్న భద్రతా పోస్టుల వద్ద పేలుడు పదార్థాలు నిండిన రెండు వాహనాలను పేల్చి, వాటిని ధ్వంసం చేసింది. ఆరు గంటలుగా BLA యొక్క ఫిదాయీన్ యూనిట్ శిబిరంలోని గణనీయమైన భాగాన్ని తమ నియంత్రణలో ఉంచుకుందని ఆ ప్రకటన పేర్కొంది.

అయితే, వార్తా కథనాల ప్రకారం (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ), 25 ఏప్రిల్ 2025లో క్వెట్టాలో పాకిస్తాన్ ఆర్మీ కాన్వాయ్ పై దాడి చేసి 10 మందిని పాక్ సైనికులను హతమార్చినట్లు BLA ప్రకటించింది.

చివరిగా, పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి తర్వాత బెలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ 40 మంది పాకిస్తాన్ సైనికులను హతమార్చిందని ఆగస్టు 2024 నాటి లేఖని షేర్ చేస్తున్నారు.