తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో హత్యా నేరం కింద ఒక కోడిని పోలీసులు అరెస్ట్ చేసారని చెప్తూ, ఒక పోస్ట్ ని సోషల్ మీడియాలో కొంత మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: తెలంగాణలో హత్యా నేరం కింద ఒక కోడిని అరెస్ట్ చేసిన పోలీసులు.
ఫాక్ట్: సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు ఆ కోడిని అరెస్ట్ లేదా అదుపులోకి తీసుకోలేదని, దర్యాప్తులో భాగంగా ఆ కోడిని సంరక్షించాల్సిన బాధ్యత పోలీస్ వారి పై ఉంది కాబట్టి, అందులో భాగంగానే ఆ కోడిని కోళ్ల ఫారం నందు సంరక్షణ నిమిత్తం ఉంచడం జరిగిందని గొల్లపల్లి పోలీసు వారు FACTLY కి తెలిపారు. కావున పోస్ట్ లో చెప్పింది తప్పు.
పోస్ట్ లోని ఘటన గురించి ఇంటర్నెట్ లో వెతకగా, ఆ ఘటన కి సంబంధించి చాలా న్యూస్ ఆర్టికల్స్ సెర్చ్ రిజల్ట్స్ లో వచ్చాయి. కోడి కత్తి ప్రమాదవశాత్తూ తగలడంతో వ్యక్తి మరణించిన ఘటన జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో జరిగినట్టు ‘ఈనాడు’ ఆర్టికల్ లో చదవొచ్చు. అయితే, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నట్టు ఆ కోడిని అరెస్ట్ లేదా అదుపులోకి తీసుకోలేదని, దర్యాప్తులో భాగంగా ఆ కోడిని సంరక్షించాల్సిన బాధ్యత పోలీస్ వారి పై ఉంది కాబట్టి, అందులో భాగంగానే ఆ కోడిని కోళ్ల ఫారం నందు సంరక్షణ నిమిత్తం ఉంచడం జరిగిందని గొల్లపల్లి పోలీసు వారు తెలిపినట్టు ఇక్కడ చదవొచ్చు. FACTLY తో ఫోన్ లో మాట్లాడుతూ కూడా గొల్లపల్లి పోలీసులు అధికారులు ఇదే విషయం తెలిపారు.
ఆ ఘటన పై నమోదు చేసిన FIR లో కూడా కోడి ని నిందితుల లిస్టులో పెట్టలేదని ఇక్కడ చూడవొచ్చు.
చివరగా, తెలంగాణలో హత్యా నేరం కింద ఒక కోడిని పోలీసులు అరెస్ట్ చేయలేదు; దర్యాప్తులో భాగంగా సంరక్షిస్తున్నారు.