ఫార్ములా-ఈ కేసులో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న తెలంగాణ మాజీ మంత్రి కే. తారక రామారావును ఏసీబీ అధికారులు 09 జనవరి 2024 నాడు విచారణకు పిలిచిన నేపథ్యంలో ఆయన అరెస్టు కాకుండా ఉండాలని వైకాపా నేత దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితురాలు దివ్వెల మాధురి టెక్కలిలోని సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారని ఒక ‘Way2News’ కథనం కలిగిన పోస్టు (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. అలాగే, కేటీఆర్ తనకి మంచి మిత్రుడని గతంలో మాధురి ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్లుగా కూడా ఈ కథనంలో పేర్కొన్నారు. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: కేటీఆర్ ఫార్ములా-ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండాలని దివ్వెల మాధురి పూజలు చేశారని ‘Way2News’ పేరుతో ఉన్న కథనం.
ఫాక్ట్: ఈ కథనాన్ని ‘Way2News’ పబ్లిష్ చేసినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవు. పైగా, కేటీఆర్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆయనతో ఎటువంటి పరిచయం లేదని, గతంలో దివ్వెల మాధురి స్పష్టం చేశారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ పోస్టులోని ఆర్టికల్ ఐడీని (q5kupra) ‘Way2News’ ఫాక్ట్-చెక్ వెబ్సైట్ ద్వారా తనిఖీ చెయ్యగా, ఈ ఐడీతో ఉన్న ఎటువంటి ‘Way2News’ కథనం లభించలేదు.
అలాగే, వైరల్ పోస్టులో ఉన్న మాధురి ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఈ ఫోటోని (ఆర్కైవ్) వారణాసిలో దిగినట్లుగా 06 జూన్ 2024న తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఆమె అప్లోడ్ చేశారు.
అయితే, డిసెంబర్ 2024లో కూడా కేటీఆర్ తనకి మంచి మిత్రుడని మాధురి చెప్పినట్లుగా సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు వైరల్ కాగా, మాధురి వాటిని ఖండించారు. కేటీఆర్‌ను తాను ఎప్పుడూ కలవలేదని, ఆయనతో ఎటువంటి పరిచయం లేదని, ఇవన్నీ అసత్య ప్రచారాలని ఆమె అనేక సందర్భాల్లో స్పష్టం చేశారు. దీనికి సంబంధించి మేము రాసిన ఫాక్ట్-చెక్ ఆర్టికల్‌ని ఇక్కడ చూడవచ్చు.
చివరిగా, కేటీఆర్ అరెస్టు కాకుండా ఉండేందుకు దివ్వెల మాధురి పూజలు చేస్తున్నారంటూ ఒక నకిలీ ‘Way2News’ పోస్టును షేర్ చేస్తున్నారు.