Fake News, Telugu
 

ప్రధానమంత్రి మోదీ పర్యటన కోసం లేహ్ మిలిటరీ ఆసుపత్రిలో ఒక ఫేక్ వార్డును సృష్టించలేదు

0

ప్రధానమంత్రి నరేంద్రమోదీ 03 జులై 2020 లేహ్ లోని మిలిటరీ ఆసుపత్రిని సందర్శించి ఇటీవలే గాల్వాన్ లోయలో గాయపడిన సైనికుల్ని పరామర్శించారు. ఐతే ప్రధానమంత్రి పర్యటన కోసం డైనింగ్ హాల్ ని (కొందరు కాన్ఫరెన్స్ హాల్ గా అభివర్ణిస్తున్నారు) ఒక ఫేక్ హాస్పిటల్ వార్డుగా మార్చి, సైనికులతో పేషెంట్సగా నటింపచేసారు అని చెప్పే ఒక ఫోటో అనేక సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నది. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో ఈ కధనం ద్వారా తెలుసుకుందాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ప్రధానమంత్రి గాయపడిన సైనికులను సందర్శించినప్పుడు ఫొటోలకి పోజులివ్వడం కొరకు లేహ్ లో ఒక ఫేక్ హాస్పిటల్ వార్డుని సృష్టించారు.

ఫాక్ట్ (నిజం): ఆ ఫొటోలో ఉన్న వార్డు ప్రధానమంత్రి పర్యటన కోసం సృష్టించింది కాదు, అదే వార్డుని ఆర్మీ చీఫ్ జనరల్ నరవణే గాయపడిన సైనికుల్ని పరామర్శిండానికి 23 జూన్ 2020న  లేహ్ మిలిటరీ హాస్పిటల్ సందర్శించినప్పటి ఫోటోల్లో చూడొచ్చు. ఎప్పుడైతే ఈ హాస్పిటల్ ని కోవిడ్ హాస్పిటల్ గా మార్చాలని నిర్ణయించారో సాధారణంగా ఆడియో వీడియో ట్రైనింగ్ కి ఉపయోగించే హాల్ ని హాస్పిటల్ వార్డుగా మార్చారని ఆర్మీ ఒక ప్రెస్ రిలీజ్ ద్వారా తెలిపింది. క్రికెటర్ ధోని ఉన్న ఫోటో ఆగష్టు 2019లో ఆర్మీ జనరల్ హాస్పిటల్ పర్యటనకు సంబంధించింది. కావున ఈ పోస్ట్ ద్వారా చెప్తున్నది తప్పు.

ఆ ఫోటోని రెండు భాగాలుగా విడదీసి, ధోని ఉన్న ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఆ ఫోటో ఆగష్టు 2019 లో ధోని ఆర్మీ జనరల్ హాస్పిటల్ పర్యటనకు సంభంధించిగా తేలింది. ధోని పర్యటనుకు సంబంధించిన వీడియో ఇక్కడ చూడొచ్చు. దీన్ని బట్టి ఈ ఫోటో ఈ మధ్యకాలంలో తీసింది కాదని నిర్ధారించవచ్చు.

ఈ విషయం గురించి లోతుగా అన్వేషించగా, ప్రధానమంత్రి 03 జులై 2020 లేహ్ లోని జనరల్ హాస్పిటల్ పర్యటనపై చేసిన ఈ ఆరోపణలకు సంబంధించి ఇండియన్ ఆర్మీ వారు విడుదల చేసిన ఒక ప్రెస్ రిలీజ్ దొరికింది. ఇండియన్ ఆర్మీ ఇచ్చిన వివరణ ప్రకారం “పైన పేర్కోబడినది వంద పడకల క్రైసిస్ ఎక్సపాన్షన్ కెపాసిటీ లో భాగంగా తయారుచేసింది, ఇది జనరల్ హాస్పిటల్ లో అంతర్భాగమే. కోవిడ్-19 ప్రోటోకాల్ ప్రకారంగా హాస్పిటల్ లోని కొన్నివార్డులని ఐసొలేషన్ వార్డుగా మార్చే అవసరం ఏర్పడింది. అందుకే ఎప్పుడైతే ఈ హాస్పిటల్ని కోవిడ్ హాస్పిటల్ గా మార్చాలని నిర్ణయించారో, సాధారణంగా ఆడియో వీడియో ట్రైనింగ్ కోసం ఉపయోగించే హాల్ ని హాస్పిటల్ వార్డుగా మార్చారు. గాల్వాన్ లో గాయపడి ఇక్కడికి వచ్చినప్పటి నుండి సైనికుల్ని కోవిడ్ పరిసరాల నుండి దూరంగా ఇక్కడే ఉంచడం జరిగింది“.

ఈ విషయం గురించి వివరణ ఇస్తూ 23 జూన్ 2020 రోజున చీఫ్ అఫ్ ఆర్మీ స్టాఫ్ మరియు ఆర్మీ కమాండర్ గాయపడిని సైనికుల్ని ఇక్కడే పరామర్శించారని చెప్పారు. ప్రధానమంత్రి మరియు ఆర్మీ చీఫ్ పర్యటనకు సంబంధించిన ఫొటోల్ని పోల్చిచూసినప్పుడు రెండిటిలో ఉన్నది ఒకటే హాలుగా నిర్ధారించవచ్చు (రెండు ఫొటోల్లో ఒకే రకమైన కర్టైన్స్, పెయింటింగ్స్, టిబెట్ ప్రార్ధన జెండాలు చూడవచ్చు). దీన్నిబట్టి గాయపడిన సైనికులు ప్రధానమంత్రి పర్యటనకు మునుపే హాస్పిటల్ వార్డుగా మార్చబడిన హాలులో చికిత్స పొందుతున్నారని నిర్ధారించవచ్చు.

చివరగా ప్రధానమంత్రి పర్యటన కోసం కాన్ఫరెన్స్ హాల్ని హాస్పిటల్ వార్డుగా మార్చబడలేదు.

‘మీకు తెలుసా’ సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

Comments are closed.

scroll