Deepfake, Fake News, Telugu
 

పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ భారత్‌తో జరుగుతున్న యుద్ధంలో ఓటమి అంగీకరించి ఆ దేశ పార్లమెంట్‌లో ప్రకటన చేశాడని ఒక డీప్ ఫేక్ వీడియోని షేర్ చేస్తున్నారు

0

ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య సీజ్ ఫైర్ (కాల్పుల విరమణ) ఒప్పందం కుదిరిందని భారత ప్రభుత్వం 10 మే 2025న ప్రకటించింది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ). పాకిస్తాన్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ భారత్ యొక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్‌కు 10వ తేదీన 3:35 గంటలకు ఫోన్ చేశారని, ఇరువైపుల జరుగుతున్న కాల్పులు భారతీయ కాలమానం ప్రకారం 10 మే 5:00 గంటలకు విరమించుకోవాలని వారిరువురూ ఒక ఒప్పందానికి వచ్చారని విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా తెలిపారు. అయితే దీన్ని ఉల్లంఘిస్తూ సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందం జరిగిన కొన్ని గంటలకే పాకిస్థాన్ భారత్‌పై కాల్పులు జరిపిందని భారత ప్రభుత్వం తెలిపింది (ఇక్కడ, ఇక్కడ). భారతీయ సాయుధ దళాలు ఈ ఉల్లంఘనకు తగిన జవాబు ఇస్తున్నారని విక్రమ్ మిశ్రి ప్రకటించారు

ఈ నేపథ్యంలో ‘పాకిస్తాన్ బతికి ఉండాలి అంటే, మనం ఇండియాకు లొంగి పోవాలి.’ అని పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఆ దేశ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ అన్నారని సోషల్ మీడియాలో ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) వైరల్ అవుతోంది. ఈ వీడియోలో షెహబాజ్ షరీఫ్ ఆ దేశ ప్రజలను ఉద్దేశిస్తూ,  ‘భారత్‌తో జరుగుతున్న యుద్ధంలో మనం వెనక్కు తగ్గుతున్నాము..’ అని అనడం మనం చూడవచ్చు. అసలు ఈ క్లెయిమ్ వెనుక ఎంత నిజం ఉందో ఈ ఆర్టికల్ ద్వారా చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ మీరు ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 10 మే 2025న భారత్-పాక్ మధ్య జరిగిన సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందం తర్వాత, పాకిస్తాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ‘భారత్‌తో జరుగుతున్న యుద్ధం’లో ఆ దేశం వెనక్కి తగ్గుతుందని ఓటమి అంగీకరించారు, ఆ దేశ పార్లమెంట్‌లో దీని గురుంచి ప్రకటన చేసిన వీడియో.

ఫ్యాక్ట్(నిజం): ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఉపయోగించి ఎడిట్ చేసిన ఒక డీప్ ఫేక్ వీడియో. పాకిస్థాన్ పీఎం షెహబాజ్ షరీఫ్ ఆ దేశ పార్లమెంట్‌లో ఈ విధమైన ప్రకటన చేసినట్లు ఎటువంటి విశ్వసనీయ రిపోర్టులు లేవు. కావున పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

వైరల్ వీడియో వెనుక ఉన్న నిజానిజాలు తెలుసుకోవడానికి తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకాగా, సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందం తర్వాత పాక్ పీఎం షెహబాజ్ షరీఫ్ పాక్ ప్రజలను ఉద్దేశిస్తూ చేసిన ఒక ప్రసంగం మాకు దొరికింది (ఇక్కడ, ఇక్కడ).

ఈ వీడియోలో తను ఎక్కడా వైరల్ క్లెయిములో పేర్కొన్నట్లుగా అనలేదు. ఈ ప్రసంగంలో షెహబాజ్ షరీఫ్, భారత్‌-పాక్ సీజ్ ఫైర్(కాల్పుల విరమణ) ఒప్పందం గురించి చెప్తూ ఇది ఒక చారిత్రాత్మక విజయంగా అభివర్ణించాడు. 

వైరల్ వీడియోలోని దృశ్యాల గురించి మరిన్ని వివరాల కోసం, క్లెయిములో పేర్కొన్నట్లు పాకిస్తాన్ నేషనల్ అసెంబ్లీలో షెహబాజ్ షరీఫ్ మాట్లాడిన ప్రసంగాల కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతుకగా పాకిస్తాన్ యొక్క ప్రభుత్వ ఛానల్ ‘PTV Parliament’ యొక్క యూట్యూబ్ ఛానల్‌లో వైరల్ వీడియో యొక్క ఒరిజినల్ పూర్తి వెర్షన్ మాకు దొరికింది.

ఆపరేషన్ సింధూర్ తర్వాత 7 మే 2025న షెహబాజ్ షరీఫ్ పాక్ పార్లమెంట్‌లో ఇచ్చిన ప్రసంగం యొక్క దృశ్యాలివి, ఈ వీడియోలో ఎక్కడ కూడా షెహబాజ్ షరీఫ్ వైరల్ వీడియోలో చెప్పిన మాటలు అనలేదు, అలాగే వైరల్ క్లెయిములో చెప్తున్నట్టుగా పార్లమెంట్‌లో మాట్లాడినట్లు ఎటువంటి విశ్వసనీయ వార్తా కథనాలు కూడా మాకు దొరకలేదు. 

వైరల్ వీడియోని సరిగ్గా గమనించగా, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) ఉపయోగించి ఎడిట్ చేసిన వీడియో అని మాకు అనుమానాలు వచ్చాయి. మొదటగా, వైరల్ వీడియోలో ఒకే క్లిప్పు చాలా చోట్ల ఒక లూపూలో ఉండటం మేము గమనించాము, షెహబాజ్ షరీఫ్ వెనక కూర్చున్న వ్యక్తి చెయ్యి చాలా చోట్ల ఒకే లాగా కదులుతుంది. అలాగే 48 సెకన్లు దగ్గర షెహబాజ్ షరీఫ్ ముందు పోడియం పైన ఉన్న పుస్తకం వింతగా గాల్లోకి లేవడం కూడా గమనించాము. 

ఈ విషయాన్ని వెరిఫై చేయడానికి వీడియోని Hive యొక్క AI-కంటెంట్ డిటెక్షన్ టూల్ ఉపయోగించి చెక్ చేస్తే, వైరల్ వీడియోలో AI-ద్వారా రూపొందించిన/డీప్ ఫేక్ కంటెంట్ ఉండచ్చు అని రిపోర్ట్ వచ్చింది. ఇందులో ఉన్న ఆడియో 99 శాతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి తయారు చేసినదే అనే ఈ రిపోర్ట్ తెలిపింది. దీనిబట్టి వైరల్ వీడియో, 7 మే 2025న షెహబాజ్ షరీఫ్ పాక్ పార్లమెంట్‌లో మాట్లాడిన వీడియోని (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ) ఉపయోగించి తయారు చేసిన ఒక డీప్ ఫేక్ వీడియో అని మనకు స్పష్టం అవుతుంది.

చివరగా, వైరల్ వీడియో ఒక డీప్ ఫేక్. 7 మే 2025న పాక్ పార్లమెంట్‌లో షెహబాజ్ షరీఫ్  చేసిన ఒక ప్రసంగం యొక్క వీడియోని ఉపయోగించి దీన్ని తయారు చేశారు.

Share.

About Author

Comments are closed.

scroll