Fake News, Telugu
 

ప్రపంచకప్ ట్రోఫీ బహుకరించే సమయంలో నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో ఎడిట్ చేయబడింది

0

ఐసిసి క్రికెట్ ప్రపంచకప్ 2023 ఫైనల్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా విజయం సాధించిన తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచకప్ ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు బాహుకరించి, అతనిని పట్టించుకోకుండా వెళ్లిపోయాడంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతోంది. భారత జట్టు ఒడిపోయిందని, మన దేశానికి వచ్చిన అతిథిని అవమానించకూడదని ఈ వీడియోని షేర్ చేస్తూ తెలుపుతున్నారు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.  

క్లెయిమ్: ప్రపంచకప్ ట్రోఫీ బహుకరించే సమయంలో నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడు.

ఫాక్ట్ (నిజం): ప్రపంచకప్ గెలిచిన ఆస్ట్రేలియా జట్టును, ఆ జట్టు కెప్టెన్ పాట్ కమిన్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించి కరచాలనం చేశారు. నరేంద్ర మోదీ పాట్ కమిన్స్‌కు ట్రోఫీ అందజేసి, స్టేజి కిందకు వెళుతున్నప్పుడు తీసిన దృశ్యాలను మాత్రమే క్లిప్ చేసి పోస్టులో షేర్ చేసిన వీడియోని రూపోందించారు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.    

పోస్టులో చేస్తున్న క్లెయింకు సంబంధించిన వివరాల కోసం వెతికితే, ప్రపంచకప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించిన తర్వాత, భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రిచర్డ్ మార్ల్స్‌తో కలిసి ప్రపంచకప్ ట్రోఫీని ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌కు బాహుకరించిన దృశ్యాలు మాకు Hotstar వెబ్సైటులో అందుబాటులో ఉన్నా పూర్తి మ్యాచ్ రీప్లే మరియు హైలైట్స్ వీడియోలలో లభించాయి.

ట్రోఫీ బాహుకరించే సమయంలో నరేంద్ర మోదీ, పాట్ కమిన్స్‌తో కరచాలనం చేసి అతన్ని అభినందించారు. నరేంద్ర మోదీ ప్రపంచకప్ ట్రోఫీని అందజేసే సమయంలో తీసిన ఫోటోని అనేక వార్తా సంస్థలు పబ్లిష్ చేశాయి.

నరేంద్ర మోదీ పాట్ కమిన్స్‌కు ట్రోఫీ అందజేసి స్టేజి కిందకు వెళుతున్నప్పుడు తీసిన దృశ్యాలను క్లిప్ చేసి పోస్టులో షేర్ చేసిన వీడియోని రూపోందించారు. ఎడిట్ చేయని పూర్తి వీడియో క్లిప్పుని పలు యూసర్లు ట్వీట్ కూడా చేశారు.

అయితే, పాట్ కమిన్స్‌కు ట్రోఫీ అందజేసి, నరేంద్ర మోదీ మరియు రిచర్డ్ మార్ల్స్‌ స్టేజి కిందకు దిగి, మిగితా ఆస్ట్రేలియా జట్టు సభ్యులను అభినందిస్తూ కరచాలనం చేశారు. ఆ సమయంలో పాట్ కమిన్స్‌ ట్రోఫీ చేతిలో పట్టుకొని ఒంటరిగా స్టేజిపై ఇబ్బందిపడుతూ నిలబడ్డాడాని కొన్ని స్పోర్ట్స్ వెబ్సైట్లు కథనాలు పబ్లిష్ చేశాయి. కానీ, ప్రపంచకప్ ట్రోఫీ అందజేసే సమయంలో నరేంద్ర మోదీ పాట్ కమిన్స్‌ను పట్టించుకోకుంటా వెళ్లిపోయారని ఏ ఒక్క వార్తా సంస్థ రిపోర్ట్ చేయలేదు.

చివరగా, ప్రపంచకప్ ట్రోఫీ బహుకరించే సమయంలో నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌ను పట్టించుకోకుండా వెళ్లిపోయాడంటూ షేర్ చేస్తున్న ఈ వీడియో ఎడిట్ చేయబడింది.

Share.

About Author

Comments are closed.

scroll