“జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. ఇది నా శాసనం” అని వైకాపాకి చెందిన ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి ఆర్. కే. రోజా చెప్తున్నట్లుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చూద్దాం.
క్లెయిమ్: వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకూడదని చెప్తున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా.
ఫాక్ట్: ఇది ఎడిట్ చేసిన వీడియో. పవన్ కళ్యాణ్ గతంలో వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కాకూడదని ఈ వ్యాఖ్యలు చేశారంటూ ఆమె తన ప్రసంగంలో చెప్పారు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.
ముందుగా వైరల్ వీడియోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన పూర్తి వీడియో 16 అక్టోబర్ 2023లో సాక్షి టీవీలో యూట్యూబ్ చానెల్లో అప్‌లోడు చేసినట్లు గుర్తించాం. కృష్ణ జిల్లాలోని పెడన నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ఒక సభలో మాట్లాడుతూ రోజా ఈ విధంగా అన్నారు, “…మొన్న వచ్చిన వాడు (పవన్ కళ్యాణ్) ఇంకో మాట కూడా అన్నాడు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడు. ఇది నా శాసనం అన్నాడు. శాసనం, శాసనం అన్న వాడిని శాసన సభ గేటుని కూడా తాకనీయలేదు.”
జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గతంలో చేసిన వ్యాఖ్యలంటూ ఆమె ఇలా తన ప్రసంగంలో చెప్పారు. అయితే ఈ వీడియోని క్లిప్ చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాడని రోజా చెప్పారంటూ తప్పుడు ప్రచారం జరుగుతుంది.
చివరిగా, వై.ఎస్.జగన్ ముఖ్యమంత్రి కాడని ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా చెప్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో ఎడిట్ చేయబడినది.