Fake News, Telugu
 

అగస్టా వెస్ట్‌ల్యాండ్ కేసుకు సంబంధించి 2016లో వెల్లడైన 225 పేజీల తీర్పు బహిరంగంగా చాలా రోజుల నుండే అందుబాటులో ఉంది

0

ఇటీవల ప్రధాని మోదీ ఇటలీలో జరిగిన G7 సమావేశంలో పాల్గొన్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో భాగంగానే మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో ప్రత్యేకంగా భేటీ అయినట్టు వార్తా కథనాలు రిపోర్ట్ చేసాయి. ఈ క్రమంలోనే మోదీ ఇటలీ నుండి అగస్టావెస్ట్‌ల్యాండ్ కేసుకి సంబంధించి 2016లో వెల్లడైన 225 పేజీల తీర్పు కాపీ తీసుకొచ్చాడని ఒక వార్త సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. 2016లో ఈ తీర్పు వచ్చినప్పటికీ అప్పటి భారత ప్రభుత్వం ఒత్తిడి వల్ల ఇటలీ ప్రభుత్వం ఈ తీర్పు కాగితాలు ఎప్పుడూ బహిరంగపరచలేదని, కానీ ఇప్పటి పర్యటనలో మోదీ ఈ తీర్పు కాపీలను తీసుకొస్తున్నాడంటూ ఈ వార్తను షేర్ చేస్తున్నారు (ఇక్కడ & ఇక్కడ). ఐతే ఈ కథనం ద్వారా ఈ వార్తలో నిజమేంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: 2016 నుండి గోప్యంగా ఉన్న అగస్టావెస్ట్‌ల్యాండ్ తీర్పు కాపీలను ఇటీవల మోదీ ఇటలీ నుండి తీసుకొచ్చాడు.

ఫాక్ట్(నిజం): అగస్టావెస్ట్‌ల్యాండ్ కేసులో అవినీతి జరిగిందని మిలాన్ కోర్టు 2016లో వెల్లడించిన 225 పేజీల తీర్పు కాపీ చాలా రోజుల నుండే బహిరంగంగా అందుబాటులో ఉంది. ఈ తీర్పు వెల్లడైన టైంలో ఈ అంశంపై పార్లమెంట్‌లో ప్రస్తావన కూడా వచ్చింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

వీవీఐపీల ప్రయాణానికి వినియోగించే హెలికాప్టర్ల కొనుగోలు కోసం 2010లో అప్పటి యూపీఏ ప్రభుత్వం అగస్టా వెస్ట్‌ల్యాండ్ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో అవకతవకలు జరిగినట్టు రిపోర్ట్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఐతే G7 సమావేశంలో పాల్గొనడానికి ఇటలీ వెళ్లిన మోదీ ఈ కేసుకి సంబంధించిన డాకుమెంట్స్ తీసుకొచ్చాడంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి స్పష్టత లేదు. మోదీ ఈ కేసు తీర్పు డాకుమెంట్స్ తీసుకొచ్చాడని ప్రధాన వార్తా సంస్థలేవి కూడా రిపోర్ట్ చేయలేదు.

అగస్టావెస్ట్‌ల్యాండ్ కేసు :

అక్టోబర్ 2014లో ఇటలీలోని ఒక కోర్టు భారత్‌కు హెలికాప్టర్‌ల విక్రయంలో అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో అగస్టావెస్ట్‌ల్యాండ్ సీఈఓ బ్రూనో స్పగ్నోలిని, అగస్టా మాతృసంస్థ ఫిన్‌మెకానికా చైర్మన్ గిసెప్ ఓర్సీని నిర్దోషులుగా తెలుస్తూ తీర్పు ఇచ్చింది. కాకపొతే ఈ కేసులో “తప్పుడు ఇన్‌వాయిస్” సృష్టించారనే అనే తక్కువ అభియోగంపై కోర్టు వారిని దోషులుగా నిర్ధారించి రెండేళ్ల జైలు శిక్ష విధించింది.

ఈ కోర్టు తీర్పును అప్పీల్ చేయగా, ఇటలీలోని ‘మిలాన్ కోర్ట్ ఆఫ్ అప్పీల్’ ఏప్రిల్ 2016లో కింది కోర్టు ఇచ్చిన తీర్పును కొట్టిపడేస్తూ ఈ కొనుగోలులో అవినీతి జరిగిందని తేల్చింది.  భారత్‌లోని రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్‌లు మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులకు ముడుపులు అందాయి అంటూ ఫిన్‌మెకానికా చైర్మన్ గిసెప్ ఓర్సీకు నాలుగు సంవత్సరాల జైలు శిక్ష విధించింది. కోర్టు ఈ విచారణకు సంబంధించి 225 పేజీల తీర్పును వెల్లడించింది. ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో ప్రస్తావించింది ఈ తీర్పు గురించే.

ఈ తీర్పు బహిరంగంగానే ఉంది :

ఐతే ప్రస్తుతం షేర్ అవుతున్న వార్తలో చెప్తున్నట్టు 2016లో వెల్లడైన తీర్పు కాపీ గోప్యంగా ఏమి లేదు. మిలాన్ కోర్టు వెల్లడించిన ఈ తీర్పు కాపీ చాలా రోజుల నుండే బహిరంగంగా అందుబాటులో ఉంది. అప్పట్లో ఈ తీర్పుకు సంబంధించిన పాత్రలను ప్రచురించిన కొన్ని కథనాలు ఇక్కడ మరియు ఇక్కడ చూడొచ్చు. ఈ తీర్పు కాపీ ఇక్కడ చూడొచ్చు.

అప్పట్లో ఈ తీర్పు భారత్‌లో రాజకీయంగా చర్చనీయాంశం అయ్యింది. భారత పార్లమెంట్‌లో కూడా ఇటలీ కోర్టు తీర్పుపై ప్రస్తావన వచ్చింది (ఇక్కడ & ఇక్కడ). దీన్నిబట్టి 2016 తీర్పు కాపీ బహిరంగంగానే ఉందని స్పష్టమవుతుంది.

అయితే, ఏప్రిల్ 2016 శిక్షను రద్దు చేసి, మిలాన్‌లో మళ్లీ విచారణ జరపాలని డిసెంబర్ 2016లో ఇటలీ సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈక్రమంలోనే జనవరి 2018లో మిలాన్ లోని ‘థర్డ్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్’ ఈ కేసుకు సంబంధించి అన్ని ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు లేవని తెలుస్తూ నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

చివరగా, అగస్టావెస్ట్‌ల్యాండ్ కేసుకు సంబంధించి 2016లో వెల్లడైన 225 పేజీల తీర్పు బహిరంగంగానే అందుబాటులో ఉంది.

Share.

About Author

Comments are closed.

scroll