Fake News, Telugu
 

ఈవ్ టీజర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు కొడుతున్న దృశ్యాలంటూ 2015లో ఇండోర్ పోలీసులు కొంతమంది నేరస్థులను రోడ్లపై బహిరంగంగా కొట్టిన వీడియోను షేర్ చేస్తున్నారు

0

“ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయిలను వేధించిన వారిని యూపీ పోలీసులు కొడుతున్న దృశ్యాలు” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ఈ వీడియోలో, పోలీసులు కొంతమందిని రోడ్లపై బహిరంగంగా కొడుతుండటం మనం చూడవచ్చు. యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈవ్ టీజర్ల పట్ల కఠినంగా ఉంటుందని చెబుతూ ఈ వీడియో షేర్ చేస్తున్నారు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్‌లో అమ్మాయిలను వేధించిన వారిని అక్కడి పోలీసులు కొడుతున్న దృశ్యాలను చూపిస్తున్న వీడియో.

ఫాక్ట్(నిజం): ఈ వైరల్ వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందింది కాదు. నేరాలను అరికట్టడానికి ఇండోర్ పోలీసులు మే 2015లో నిర్వహించిన ప్రత్యేక నేర నిరోధక డ్రైవ్‌లో భాగంగా కొంతమంది నేరస్థులను రోడ్లపై బహిరంగంగా కొట్టిన దృశ్యాలను ఈ వైరల్ వీడియో చూపిస్తుంది. యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఈవ్ టీజర్లను అరికట్టడానికి మార్చి 2017లో ‘యాంటీ-రోమియో’ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వైరల్ వీడియోకు సంబంధించిన వివరాల కోసం, వైరల్ వీడియో యొక్క కీఫ్రేములను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, వైరల్ వీడియోలోని దృశ్యాలనే కలిగిన ఉన్న అధిక నిడివి గల వీడియోను మీడియా సంస్థ ‘ABP న్యూస్’ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో 29 మే 2015న  షేర్ చేసినట్లు కనుగొన్నాము. ఈ వీడియోను “ఇండోర్ పోలీసులు నేరస్థులను రోడ్లపై బహిరంగంగా కొట్టారు” (ఇంగ్లీష్ నుండి తెలుగులోకి అనువదించగా) అనే శీర్షికతో షేర్ చేశారు. ఈ వీడియో వివరణ ప్రకారం, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో నేరాలను అరికట్టడానికి ఇండోర్ పోలీసులు నిర్వహించిన ప్రత్యేక నేర నిరోధక డ్రైవ్‌లో భాగంగా కొంతమంది నేరస్థులను రోడ్లపై బహిరంగంగా కొట్టిన దృశ్యాలను ఈ వీడియో చూపిస్తుంది.

అలాగే, ఇదే వైరల్ వీడియోను 2015లో పలువురు ఫేస్‌బుక్‌లో ఇండోర్ పోలీసులు కొంతమంది నేరస్థులను రోడ్లపై బహిరంగంగా కొట్టిన దృశ్యాలుగా పేర్కొంటూ షేర్ చేసినట్లు మేము కనుగొన్నాము. నేరాలను అరికట్టడానికి ఇండోర్ పోలీసులు మే 2015లో నిర్వహించిన ఈ ప్రత్యేక నేర నివారణ డ్రైవ్‌కు సంబంధించిన మరిన్ని వార్తా కథనాలను ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ చూడవచ్చు. ఈ సమాచారం ఆధారంగా, ఈ వీడియో 2015 నాటిదని, ఈ వీడియో ఉత్తరప్రదేశ్‌కు చెందింది కాదని మనం నిర్ధారించవచ్చు.

ఇవే దృశ్యాలు 2020లో ఉత్తరప్రదేశ్‌కు చెందినవిగా పేర్కొంటూ పలువురు సోషల్ మీడియాలో షేర్ చేయగా, ఉత్తరప్రదేశ్‌ పోలీసుల ఫాక్ట్-చెక్ విభాగం X(ట్విట్టర్)లో స్పందిస్తూ, ఈ దృశ్యాలు ఉత్తరప్రదేశ్‌కు సంబంధించినవి కాదని స్పష్టం చేసింది. అలాగే ఈ దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ 29 మే 2015న మీడియా సంస్థ ‘ABP న్యూస్’ తన అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో షేర్ చేసిన వీడియోను కూడా ఈ పోస్టులో షేర్ చేశారు.

యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, ఈవ్ టీజర్లను అరికట్టడానికి మార్చి 2017లో ‘యాంటీ-రోమియో’ స్క్వాడ్‌లను ఏర్పాటు చేశారు (ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ). ‘ది ప్రింట్’ కథనం ప్రకారం, మార్చి 2017 నుండి మార్చి 2024 మధ్య, యూపీ పోలీసులు ‘యాంటీ-రోమియో’ డ్రైవ్‌లో భాగంగా 1,44,06,253 మందికి హెచ్చరికలు జారీ చేశారు, ఇంకా 32,077 మందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ‘యాంటీ-రోమియో’ డ్రైవ్‌లో భాగంగా, పోలీసులు రోడ్లపై ఈవ్ టీజర్లను బహిరంగంగా కొట్టిన కొన్ని సంఘటనలు కూడా జరిగాయి.

చివరగా, 2015లో ఇండోర్ పోలీసులు కొంతమంది నేరస్థులను రోడ్లపై బహిరంగంగా కొట్టిన వీడియోను ఉత్తరప్రదేశ్ పోలీసులు ఈవ్ టీజర్లను కొడుతున్న దృశ్యాలు అంటూ షేర్ చేస్తున్నారు.  

Share.

About Author

Comments are closed.

scroll