Fake News, Telugu
 

2022 వీడియోని ఎడిట్ చేసి పాత తెలంగాణ తల్లి రూపాన్ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారంటూ ప్రచారం చేస్తున్నారు

0

09 డిసెంబర్ 2024న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర సచివాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే గతంలోని తెలుగు తల్లి విగ్రహం యొక్క రూపురేఖలను మార్చి ప్రస్తుత విగ్రహాన్ని ఏర్పాటు చేశారని ప్రతిపక్ష పార్టీలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాత తెలంగాణ తల్లి రూపాన్ని దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫా భవనంపై ప్రదర్శించారని చెప్తూ ఒక వీడియో (ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ) సోషల్ మీడియాలో బాగా ప్రచారంలో ఉంది. దీంట్లో ఎంత నిజముందో ఇప్పుడు చుద్దాం.

ఆర్కైవ్ పోస్టుని ఇక్కడ చూడవచ్చు

క్లెయిమ్: బుర్జ్ ఖలీఫాపై పాత తెలంగాణ తల్లి రూపాన్ని డిసెంబర్ 2024లో ప్రదర్శించినప్పటి వీడియో.

ఫాక్ట్: ఇది ఎడిట్ చేయబడిన వీడియో. 2022 నాటి బుర్జ్ ఖలీఫా వీడియోకి తెలుగు తల్లి ఫోటోని జోడించారు. అసలు వీడియోలో బుర్జ్ ఖలీఫాపై తెలంగాణ తల్లి రూపం ప్రదర్శించబడలేదు. కావున పోస్టులో చేయబడ్డ క్లెయిమ్ తప్పు.

ముందుగా బుర్జ్ ఖలీఫాపై పాత తెలంగాణ తల్లి రూపం ప్రదర్శించడంపై ఎటువంటి విశ్వసనీయ మీడియా కథనాలు మాకు లభించలేదు. బుర్జ్ ఖలీఫా సోషల్ మీడియా ఖాతాలలో దీని గురించి ఎటువంటి సమాచారం లభించలేదు. ఇక వైరల్ వీడియోలోని దృశ్యాలను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, దీనికి సంబంధించిన అసలు వీడియో 15 జూలై 2022లో ‘Learning Lens’ అనే యూట్యూబ్ ఛానెల్లో అప్లోడ్ (ఆర్కైవ్) చేసి ఉండడం గుర్తించాం. ఇవే దృశ్యాలను చూపుతున్న వేరే యాంగిల్ నుంచి తీసిన వీడియోలను ఇక్కడ చూడవచ్చు.

ఈ రెండు వీడియోలని పోల్చి చూడగా, తెలంగాణ తల్లి ఫోటోని ఎడిటింగ్ ద్వారా ఈ యూట్యూబ్ వీడియోకి జోడించి బుర్జ్ ఖలీఫాపై కనిపించేలాగా చేశారని తెలుస్తుంది.

గతంలో కూడా ఇదే యూట్యూబ్ వీడియోని ఉపయోగించి బుర్జ్ ఖలీఫాపై విరాట్ కోహ్లీ, అంబేద్కర్ రూపాలు ప్రదర్శించినట్లుగా ఉన్న ఎడిట్ చేయబడ్డ వీడియోలు లభించాయి.

పై ఆధారాలను బట్టి,  వైరల్ వీడియో అసలైనది కాదని, తెలంగాణ తల్లి ఫోటోని యూట్యూబ్ వీడియోకి జోడించడం ద్వారా తెలంగాణ తల్లి రూపం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించినట్లు కనిపిస్తుందని నిర్ధారించవచ్చు.

చివరిగా, 2022 నాటి వీడియోని ఎడిట్ చేసి పాత తెలంగాణ తల్లి రూపాన్ని బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll