గుజరాత్‌లోని ఖేడా ప్రాంతంలో గర్బా నృత్యం చేస్తున్న మహిళలపై మసీదు నుండి కొందరు యువకులు రాళ్లు విసరగా, కొందరు మహిళలు గాయపడ్డారని, ఈ ఘటనపై పోలీసులు స్పందించి, ఆ యువకులను ఒక పోల్ కు కట్టి శిక్షిస్తున్నట్లు చెబుతూ వీడియోను సోషల్ మీడియాలో (ఇక్కడ, ఇక్కడ, మరియు ఇక్కడ) షేర్ చేస్తున్నారు. ఈ సంఘటన 2024లో జరిగినట్టు షేర్ చేస్తున్నారు . ఈ ఆర్టికల్ ద్వారా ఆ వీడియోలో ఉన్న నిజమెంతో తెలుసుకుందాం.

క్లెయిమ్: గర్బా డ్యాన్స్ చేస్తున్న మహిళలపై మసీదు నుండి రాళ్లు రువ్విన యువకులను పోలీసులు పోల్‌కు కట్టేసి లాఠీలతో కొడుతున్నారు, ఈ సంఘటన 2024లో జరిగింది .
ఫాక్ట్(నిజం): వీడియోలోని ఘటన 03 అక్టోబర్ 2022న గుజరాత్ ఖేడాలోని ఉంధేలా గ్రామంలో జరిగింది. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ ఏర్పాటు చేశారు. కానీ, మసీదు దగ్గర గర్బా జరుపుతుండటంపై గ్రామంలోని ముస్లిం సభ్యులు అభ్యంతరాలు చెప్పారు. ఈ సందర్భంగా కొందరు మసీదు నుండి రాళ్ల దాడి చేశారు. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసులు 04 అక్టోబర్ 2022న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకుని, గ్రామస్తుల ముందు లాఠీలతో కొట్టారు. గ్రామస్థులు “గుజరాత్ పోలీస్ జిందాబాద్” అంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇది ఇటీవల జరిగిన సంఘటన కాదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.
వైరల్ అవుతున్న వీడియోలోని కీఫ్రేమ్‌లను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసినప్పుడు. 04 అక్టోబర్ 2022 న NDTV న్యూస్ చానల్ పబ్లిష్ చేసిన న్యూస్ రిపోర్ట్ వీడియో ఒకటి లభించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో నవరాత్రి గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్వారని ఆరోపిస్తూ అరెస్టయిన కొంతమంది ముస్లిం వ్యక్తులను పోలీసు సిబ్బంది పోల్ కు కట్టి లాఠీలతో కొట్టారు అని తెలిసింది .

ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం తగిన కీవర్డ్స్ ఉపయోగించి వెతకగా,మాకు సంఘటనను వివరిస్తున్న అక్టోబర్ 2022 మీడియా కథనాలు (ఇక్కడ, ఇక్కడ) లభించాయి. ఆ కథనాల ప్రకారం, 03 అక్టోబర్ 2022న ఖేడాలోని ఉంధేలా గ్రామంలో నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గర్బా కార్యక్రమంలో రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలు అయ్యాయి. గ్రామ సర్పంచ్ గర్బా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు, అయితే గ్రామంలోని ముస్లిం సభ్యులు మసీదుకు దగ్గరగా గర్బా చేయడం పై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో కొందరు మసీదు నుండి రాళ్ల దాడి చేశారు. పోలీసులు 04 అక్టోబర్ 2022న తొమ్మిది మందిని అదుపులోకి తీసుకొని గ్రామస్థుల ముందుగా లాఠీతో కొట్టారు. ఈ ఘటనకు గ్రామస్థులు “గుజరాత్ పోలీస్ జిందాబాద్” అంటూ హర్షం వ్యక్తం చేశారు. దీని మీద అప్పట్లో పెద్ద ఎత్తున దుమారం రేగడంతో, సంబంధిత అధికారులు పబ్లిక్ గా కొట్టిన పోలీసుల మీద ఎంక్వయిరీ చేపట్టారు.

చివరిగా, గుజరాత్‌లో గర్బా కార్యక్రమంలో రాళ్లు రువ్విన వారిని పోలీసులు కొడుతున్న 2022 వీడియోను ఇటీవలిదిగా తప్పుగా షేర్ చేస్తున్నారు.