Fake News, Telugu
 

2021 వీడియోని మచిలీపట్నంలో కింగ్ కోబ్రా సంచరిస్తున్న ఇటీవలి దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు

0

మచిలీపట్నంలో కింగ్ కోబ్రా సంచరిస్తున్న దృశ్యాలంటూ సోషల్ మీడియాలో ఇటీవల ఒక వీడియో షేర్ అవుతోంది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం మచిలీపట్నంలోని పొలాలలో 20 అడుగుల కింగ్ కోబ్రా దర్శనమిచ్చిందని ఇదే వీడియోని షేర్ చేస్తూ ‘ETV Bharath’ వార్తా సంస్థ ఇటీవల ఆర్టికల్ పబ్లిష్ చేసింది. ఆ  పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

క్లెయిమ్: కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కింగ్ కోబ్రా సంచరిస్తున్న ఇటీవల దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రా సంచరించిన దృశ్యాలంటూ ఈ వీడియోని పలు వార్తా సంస్థలు 2021 ఆగస్టు నెలలో పబ్లిష్ చేశారు. పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది మరియు మచిలిపట్నానికి సంబంధించినది కాదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లను రివర్స్ ఇమేజ్ సర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘TV 5’ వార్తా సంస్థ 05 ఆగస్టు 2021 నాడు పబ్లిష్ చేసినట్టు తెలిసింది. తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం చింతలూరు గ్రామంలో 12 అడుగుల కింగ్ కోబ్రా సంచరిస్తున్న దృశ్యాలంటూ ఈ వార్తా సంస్థ వీడియో వివరణలో తెలిపారు.

ఈ విషయాన్ని రిపోర్ట్ చేస్తూ పలు ఇతర వార్తా సంస్థలు కూడా ఈ వీడియోని 2021లో పబ్లిష్ చేశాయి. ఆంధ్రప్రదేశ్‌లోని అనకాపల్లి జిల్లా ముకుందాపురం గ్రామంలో ఈస్ట్రన్ ఘాట్ వైల్డ్ లైఫ్ బృందం ఇటీవల 13 అడుగుల కింగ్ కోబ్రాను పట్టుకొని అటవీ ప్రాంతంలో వదిలేశారు.  మచిలీపట్నంలో ఇటీవల కింగ్ కోబ్రా కనిపించినట్టు ఎక్కడా రిపోర్ట్ కాలేదు.

చివరగా, 2021 వీడియోని మచిలీపట్నంలో కింగ్ కోబ్రా సంచరిస్తున్న ఇటీవల దృశ్యాలంటూ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll