Fake News, Telugu
 

అమిత్ షా రథం నుంచి జారి పడబోయిన పాత వీడియోని పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ ఎన్నికల ప్రచారానికి ముడి పెడ్తున్నారు

0

కేంద్ర హోం మంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో ఒక వేదికపై జారి పడ్డాడని అర్ధం వచ్చేలా ఒక వీడియో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో షేర్ అవుతోంది. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: పశ్చిమ బెంగాల్ లోని నందిగ్రామ్ లో ఒక వేదికపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా జారిపడ్డ వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ వీడియో 2018లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో భాగంగా రథం ఎక్కిన అమిత్ షా జారి పడబోయిన ఘటనకి సంబంధించింది. ఈ వీడియోకి బెంగాల్ లోని నందిగ్రామ్ కి ఎటువంటి సంబంధం లేదు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.

ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్ లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఇదే వీడియోని 2018 రిపోర్ట్ చేసిన చాలా వార్తా కథనాలు మాకు కనిపించాయి. టైమ్స్ అఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం 2018లో మధ్యప్రదేశ్ లో జరిగిన ఒక ఎన్నికల ర్యాలీలో ఒక రథం పై జారి పడబోయాడు, ఈ వీడియో ఆ ఘటనకి సంబంధించిందే.

ఇండియా టుడే కూడా ఈ వీడియోని రిపోర్ట్ చేస్తూ, ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని ఎన్నికల ర్యాలీలో జరిగిందని ప్రచురించింది. వీటన్నిటి బట్టి, ఈ వీడియో బెంగాల్ లోని నందిగ్రామ్ కి సంబంధించింది కాదని తెలుస్తుంది.

బెంగాల్ లో జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న నందిగ్రామ్ లో  ర్యాలీ నిర్వహించిన నేపథ్యంలో ఇలాంటి తప్పుదోవ పట్టించే పోస్టులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

చివరగా, 2018లో మధ్యప్రదేశ్‌లో అమిత్ షా రథం నుంచి జారిపడబోయిన పాత వీడియోని మళ్ళీ షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll