ఈ వీడియో మద్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు కమల్ నాథ్ ముస్లింలతో ఆర్ఎస్ఎస్ మరియు హిందువులను విదిలించుకోవాలి అంటూ రహస్య సమావేశం జరిపినట్టుగా షేర్ చేస్తున్నారు. ఇందులో ఎంత నిజం ఉందో ఏ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం.
క్లెయిమ్: కాంగ్రెస్ నాయకుడు, కమల్ నాథ్ ముస్లింలతో, ఆర్ఎస్ఎస్ (RSS) మరియు హిందువులను వదిలించుకోవాలంటూ రహస్య సమావేశం నిర్వహించారు.
ఫాక్ట్ (నిజం): ఈ వీడియోలో కమల్ నాథ్ ఆర్ఎస్ఎస్ మరియు హిందువులను వదిలించుకోవాలని ఎక్కడా అనలేదు. ఈ వీడియో 2018 ఎన్నికల ముందు మద్యప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ నేత, కమల్ నాథ్ ముస్లింలతో సమావేశం జరిపిన సమయంలోది. వైరల్ అవుతున్న వీడియో గురించి కమల్ నాథ్ 2018 లోనే వివరణ ఇస్తూ, తాను ఎన్నికల వరకు మత సామరస్యాన్ని కొనసాగించాలని మాత్రమే ముస్లిం మతపెద్దలకు చెప్పానని, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లు దానికి భంగం కలిగించే ప్రయత్నాల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించినట్లు తెలిపారు. కావున పోస్టులో చేసిన క్లెయిమ్ తప్పు.
ఈ కథనంపై మరింత సమాచారం కోసం కీ వర్డ్ ఉపయోగించి ఇంటర్నెట్లో వెతకగా ఈ పోస్టుకు సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ (ఇక్కడ మరియు ఇక్కడ) మరియు వీడియోలు లభించాయి. వీటి ద్వారా, ఇది 2018లో వైరల్ అయిన వీడియో అని మరియు దీనిపై కమల్ నాథ్ స్పందించడం కూడా జరిగింది అని స్పష్టం అయింది. ఈ వీడియోలో కమల్ నాథ్ పోస్టులో పేర్కొన్నట్టు, ఆర్ఎస్ఎస్ మరియు హిందువులను వదిలించుకోవాలని ఎక్కడా అనలేదు.
వీడియోలో కమల్ నాథ్, ‘మాకు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అన్నదానిపై సమాచారం ఉంది, చింద్వాడా నాగపూర్ కి అతి సమీపంలో ఉన్నందున నాగపూర్ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు సులువుగా చింద్వాడా ప్రజలను సంప్రదిస్తున్నారు. ఈ కార్యకర్తలకు ఒకే నినాదం ఉన్నది- మీరు హిందువులకు ఓటు వేయాలనుకుంటే హిందూ షేర్ మోదీకి ఓటు వేయండి, ముస్లింలకు ఓటు వేయాలి అనుకుంటే కాంగ్రెస్ కు ఓటు వేయండి. ఇధి ప్రజలను ప్రేరేపించే ఒక వ్యూహం, దీనిని ఎన్నికల దాకా సహించండి, ఆ తరువాత మేము వారితో వ్యవహరిస్తాము’ అని మాట్లాడడం జరిగింది.
వైరల్ అవుతున్న వీడియో గురించి కమల్ నాథ్ 2018 లోనే వివరణ ఇస్తూ, ఈ వీడియో సమావేశం జరిగిన మూడు నెలల తరువాత వైరల్ అవుతోందని, తాను చేసిన ప్రతిపాదనలో తప్పు లేదు అని, సమాజాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న వారితో జాగ్రత్తగా వ్యవహరించమన్నానని, తాను ప్రతి సంఘం ప్రతినిధి బృందంతో ఈ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేసారు.
చివరిగా, 2018 ఎన్నికల ముందు కమల్ నాథ్ ముస్లింలతో జరిపిన సమావేశం వీడియోని తాను హిందువులను వదిలించుకోవాలని అన్నట్టు ఇప్పుడు తప్పుగా షేర్ చేస్తున్నారు.