Fake News, Telugu
 

2017లో సమాజ్‌వాది పార్టీ యూత్ వింగ్ కార్యకర్తలు యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలని ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు

0

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై దాడికి ప్రయత్నించిన దృశ్యాలు, అంటూ సోషల్ మీడియాలో ఒక వీడియో షేర్ అవుతుంది. ఈ వీడియోలో యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై ఈ దాడి చేసింది రైతులని కొందరు పోస్టులు పెడితే, ఉత్తరప్రదేశ్‌లోని నిరుద్యోగ యువత ఈ దాడికి పాల్పడినట్టు మరికొందరు పోస్టులు పెడుతున్నారు. ఆ పోస్టులలో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్టు యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్‌ని ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై రైతులు దాడికి ప్రయత్నించిన దృశ్యాలు.

ఫాక్ట్ (నిజం): పోస్టులో షేర్ చేసిన వీడియో పాతది. 2017లో లక్నో యూనివర్సిటీలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవడానికి వెళ్తున్న ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై, సమాజ్‌వాది పార్టీ యువజన విభాగం కార్యకర్తలు దాడికి ప్రయత్నించిన దృశ్యాలని ఈ వీడియో చూపిస్తుంది. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పుదోవ పట్టించేలా ఉంది.

పోస్టులో షేర్ చేసిన వీడియో కోసం కీ పదాలు ఉపయోగించి గుగూల్‌లో వెతికితే, ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని ‘Lehren News’ ఛానల్  12 జూన్ 2017 నాడు తమ యూట్యూబ్ ఛానెల్లో పబ్లిష్ చేసినట్టు తెలిసింది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలని ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారాలంగా వీడియోలో కనిపిస్తున్న ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికితే, ఈ ఘటనకు సంబంధించిన వివరాలని తెలుపుతూ ‘ABP’ న్యూస్ ఛానల్ తమ యూట్యూబ్ ఛానెల్లో ఇవే దృశ్యాలు కలిగిన వీడియోని పబ్లిష్ చేసినట్టు తెలిసింది. 05 జూన్ 2017 నాడు లక్నో యూనివర్సిటీలో నిర్వహించిన కార్యక్రమానికి వెళ్తున్న యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై సమాజ్‌వాది పార్టీ యువజన విభాగం కార్యకర్తలు దాడికి ప్రయత్నించారని ఈ వీడియోలో రిపోర్ట్ చేసారు.

ముఖ్యమంత్రి భద్రతా ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన నేరం కింద ఇద్దరు అమ్మాయిలతో సహా 11 మంది విద్యార్ధులను పోలీసులు అరెస్ట్ చేసినట్టు తెలిసింది. యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన నిందితులకి లక్నో లోకల్ కోర్టు బెయిల్ నిరాకరించిందని ‘NDTV’ న్యూస్ ఛానల్ 10 జూన్ 2017 నాడు పబ్లిష్ చేసిన వీడియోలో రిపోర్ట్ చేసింది. ఈ ఘటనకి సంబంధించి పబ్లిష్ అయిన న్యూస్ ఆర్టికల్స్‌ని ఇక్కడ, ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 2017లో సమాజ్‌వాది పార్టీ యువజన విభాగం కార్యకర్తలు యోగి ఆదిత్యనాథ్ కాన్వాయ్‌పై దాడికి పాల్పడిన దృశ్యాలని ఇటీవల జరిగిన సంఘటనగా షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll