Fake News, Telugu
 

2015లో బెల్జియం నాయకుడు ఖురాన్ గ్రంథాన్ని అవమానించిన వీడియోని చూపిస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ లో చర్చ అంటూ షేర్ చేస్తున్నారు.

0

ఫ్రాన్స్ పార్లమెంట్ లో ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ గురించి జరుగుతున్న చర్చ, అంటూ షేర్ చేస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ‘ప్రపంచంలో జరిగే అన్ని ఉగ్రవాద చర్యలకి మూల కారణం ఈ ఖురాన్ గ్రంథం, అని ఒక నాయకుడు ఖురాన్ పుస్తకాన్ని పట్టుకొని మాట్లాడుతున్న దృశ్యాలు ఈ వీడియోలో మనం చూడవచ్చు. ఆ పోస్టులో ఎంతవరకు నిజముందో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.  

క్లెయిమ్: ఫ్రాన్స్ పార్లమెంట్ లో ఒక నాయకుడు ఖురాన్ గ్రంథాన్ని అవమానిస్తున్న వీడియో.

ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఆ ఘటన చోటుచేసుకుంది బెల్జియం పార్లమెంట్ లో, ఫ్రాన్స్ పార్లమెంట్ లో కాదు. 2015లో పారిస్ నగరంలో జరిగిన ఉగ్రవాద చర్య గురించి బెల్జియం నాయకుడు ఫిలిప్ డివింటర్ మాట్లాడుతూ, ‘ప్రపంచంలో జరిగే అన్ని ఉగ్రవాద చర్యలకి మూల కారణం ఈ ఖురాన్ గ్రంథం’ అని అన్నాడు. ఈ వీడియోకి ఇటివల ఫ్రాన్స్ దేశంలో జరిగిన ఘటనలకి ఎటువంటి సంబంధం లేదు. కావున, పోస్టులో చేస్తున్న క్లెయిమ్ తప్పు.

పోస్టులో షేర్ చేసిన వీడియో యొక్క స్క్రీన్ షాట్లని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేసి వెతికితే, ఇవే దృశ్యాలతో ఉన్న వీడియోని ‘Israel Islam & End Times’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసినట్టు తెలిసింది. బెల్జియం పార్లమెంట్ సభ్యుడు ఇస్లాం మత గ్రంథమైన ఖురాన్ ని ప్రపంచంలో జరిగే అన్ని ఉగ్రవాద చర్యలకి మూలమని తెలిపినట్టు ఈ వీడియో వివరణలో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా ఆ ఘటనకి సంబంధించిన మరింత సమాచారం కోసం వెతికగా, వీడియో లోని ఒక దృశ్యాన్ని చూపుతూ టర్కీ న్యూస్ వెబ్ సైట్ ‘23 జనవరి 2015’ నాడు పబ్లిష్ చేసిన ఆర్టికల్ ని ఇక్కడ చూడవచ్చు. పారిస్ నగరంలో జరిగిన చార్లీ హెబ్దో ఉగ్రవాద చర్య గురించి బెల్జియం నాయకుడు ఫిలిప్ డివింటర్ మాట్లాడుతూ, ‘ప్రపంచంలో జరిగే అన్ని ఉగ్రవాద చర్యలకి మూల కారణం ఈ ఖురాన్ గ్రంథం’ అని అన్నట్టు ఈ ఆర్టికల్ వివరించారు. ‘22 జనవరి 2015’ నాడు బెల్జియం పార్లమెంట్ లో జరిగిన సభలో ఫిలిప్ డివింటర్ ఈ వ్యాఖ్యలు చేసారు.

‘Middle East Eye’ న్యూస్ వెబ్ సైట్ పబ్లిష్ చేసిన ఆర్టికల్ లో కూడా వీడియోలో కనిపిస్తున్న ఘటన బెల్జియం పార్లమెంట్ లో 2015లో చోటుచేసుకున్నట్టు తెలిపారు. ముస్లిం మత వ్యతిరేకి అయిన ఫిలిప్ డివింటర్, బెల్జియం దేశంలో ముస్లిం మతస్థులు వలసని పలుసార్లు వ్యతిరేకించినట్టు ఆర్టికల్ లో తెలిపారు. ఈ వివరాల ఆధారంగా పోస్టులో షేర్ చేసిన ఆ వీడియోకి ఫ్రాన్స్ దేశంలో ఇటివల జరిగిన ఉగ్రవాద చర్యలకి ఎటువంటి సంబంధం లేదని ఖచ్చితంగా చెప్పవచ్చు.

చివరగా, 2015లో ఒక బెల్జియం నాయకుడు ఖురాన్ గ్రంథాన్ని అవమానించిన వీడియోని చూపిస్తూ ఫ్రాన్స్ పార్లమెంట్ లో ఖురాన్ గ్రంథం పై చర్చ జరిగినట్టు షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll