ఫేస్బుక్ లో ఒక వీడియో ని పెట్టి, ‘మూడు రాజధానులకు సపోర్టుగా ర్యాలీకి రావటానికి డబ్బులు పంచి పెడుతున్న వై.సీ.పీ.నాయకులు’ అని దాని గురించి చెప్తున్నారు. పోస్టులో చెప్పిన దాంట్లో ఎంతవరకు నిజముందో చూద్దాం.
క్లెయిమ్: మూడు రాజధానులకు సపోర్టుగా ర్యాలీకి రావటానికి వై.సీ.పీ. నాయకులు డబ్బులు పంచి పెడుతున్న వీడియో.
ఫాక్ట్ (నిజం): పోస్టులోని వీడియో కనీసం మార్చ్ 2019 నుండి ఇంటర్నెట్ లో ఉంది. కావున, అది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించడానికంటే ముందే జరిగిన ఘటనకి సంబంధించినది. పోస్టులో చెప్పింది తప్పు.
ఆంధ్ర ప్రదేశ్ సీఎం జగన్ మోహన్ రెడ్డి డిసెంబర్ 17, 2019న రాష్ట్రానికి మూడు రాజధానుల గురించి ప్రతిపాదించినట్లుగా ‘Times of India’ వారి కథనం ద్వారా తెలుస్తుంది.
పోస్టులోని వీడియో గురించి ఫేస్బుక్ లో కీవర్డ్స్ తో వెతికినప్పుడు, అదే వీడియోని కొంత మంది గత సంవత్సరం మార్చ్ లో పోస్టు చేసినట్లుగా ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కానీ, వాటి ద్వారా, అది ఏ సందర్భానికి సంబంధించినదని తెలియలేదు. అదే క్లిప్ ని ‘TDP, YCP Activists Distributing Money in Campaigns’ అనే టైటిల్ తో ఉన్న ‘HMTV’ ఛానెల్ యొక్క ఒక న్యూస్ వీడియో లో చూడవచ్చు. ఆ వీడియో యొక్క టైంస్టాంప్ చూసినప్పుడు, దానిని యూట్యూబ్ లో మార్చ్ 25, 2019న అప్లోడ్ చేసినట్లుగా తెలిసింది. కావున, అది సీఎం జగన్ మోహన్ రెడ్డి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులను ప్రతిపాదించడానికంటే ముందే జరిగిన ఘటనకి సంబంధించినది.
చివరగా, పాత వీడియోని పెట్టి ‘మూడు రాజధానులకు సపోర్టుగా ర్యాలీకి రావటానికి డబ్బులు పంచి పెడుతున్న వై.సీ.పీ.నాయకులు’ అని ప్రచారం చేస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?