తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే క్రైస్తవులందరికీ శిలువ వేసేస్తాం అని టీడీపీ కార్యకర్త బెదిరిస్తున్నట్టు ఉండే ఒక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది. వీడియోలో మాట్లాడుతున్న వ్యక్తి మెడలో పసుపు కండువా, వెనకాల టీడీపీ పోస్టర్ చూడొచ్చు. ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించిన నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే క్రైస్తవులందరికీ శిలువ వేసేస్తాం అని టీడీపీ నాయకుడు బెదిరిస్తున్న వీడియో.
ఫాక్ట్(నిజం): ‘Rmkr Pegs’ అనే ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న వ్యక్తి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వివిధ వర్గాలకు సంబంధించి అమలు చేస్తున్న పథకాల ఆధారంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా/టీడీపీని వ్యంగంగా విమర్శిస్తూ ఈ వీడియోను రూపొందించాడు. ఐతే వివిధ వర్గాల వారు టీడీపీపై విద్వేషం పెంచుకునేలా కావాలనే వైఎస్ఆర్సీపీ నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డి ఈ వీడియోను రూపొందించారని టీడీపీ విమర్శించింది. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
వైరల్ వీడియో తెలుగు దేశం పార్టీ అధికారంలోకి రాగానే క్రైస్తవులందరినీ ఇబ్బంది పెడతామని చెప్తున్న వ్యక్తి నిజానికి టీడీపీ కార్యకర్త కాదు. ‘Rmkr Pegs’ పేరుతో యూట్యూబ్ ఛానల్ నడిపే ఒక యూట్యూబర్ ఈ వీడియోను రూపొందించాడు.
ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం యూట్యూబ్‌లో వెతకగా ‘Rmkr Pegs’ ఛానల్‌లో వైరల్ వీడియోకు సంబంధించిన 18:25 నిముషాల పూర్తి ఫూటేజ్ మాకు దొరికింది. ‘TDP Leader Press Meet’ అనే టైటిల్‌తో ఈ వీడియోను అప్లోడ్ చేసాడు.
చంద్రబాబు నాయుడు & సైకిల్ గుర్తు ఉన్న ఫ్లెక్సీ ముందు, మెడలో పసుపు కండువా వేసుకుని కూర్చుని, టీవీ ఛానళ్ల ముందు తెలుగుదేశం పార్టీ నాయకుడు మాట్లాడుతున్నట్టుగా ఉన్న ఈ వీడియోలో ఆ యూట్యూబర్ టీడీపీను వ్యంగంగా విమర్శించాడు.
వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వివిధ వర్గాలకు సంబంధించి అమలు చేస్తున్న పథకాల ఆధారంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి అనుకూలంగా/టీడీపీను వ్యంగంగా విమర్శిస్తు ఈ వీడియోను రూపొందించాడు. ఈ క్రమంలోనే క్రైస్తవులను ఉద్దేశించి ‘టీడీపీ అధికారంలోకి వస్తే క్రిస్టియన్స్ అందరికీ శిలువ వేసేస్తాం’ అనే వ్యాఖ్యలు చేసాడు. ఈ ఛానల్‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై అనేక వీడియోలు ఉన్నాయి.
ఐతే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో టీడీపీ నాయకులు దీనిపై తీవ్రంగా స్పందించారు. వివిధ వర్గాల వారు టీడీపీ పార్టీపై విద్వేషం పెంచుకునేలా కావాలనే వైఎస్ఆర్సీపీ నాయకుడు మన్విత్ కృష్ణారెడ్డి ఈ వీడియోను రూపొందించారని టీడీపీ నాయకుడు వర్ల రామయ్య అన్నారు.
చివరగా, ఈ వీడియోలో టీడీపీ అధికారంలోకి రాగానే శిలువ వేసేస్తాం అంటూ క్రైస్తవులను బెదిరిస్తున్నది టీడీపీ నాయకుడు కాదు.