“తన బిడ్డను వేధించవద్దని చెప్పినందుకు ఓ మహిళపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన జనసేన పార్టీ కార్యకర్త సుమన్” అంటూ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ & ఇక్కడ). ఈ కథనం ద్వారా ఆ వీడియోకు సంబంధించి నిజమేంటో చూద్దాం.
క్లెయిమ్: తన బిడ్డను వేధించవద్దని చెప్పినందుకు ఓ మహిళపై కత్తితో దాడి చేసి దారుణంగా హత్య చేసిన జనసేన పార్టీ కార్యకర్త సుమన్, అందుకు సంబంధించిన దృశ్యాలు.
ఫాక్ట్(నిజం): వైరల్ వీడియోలోని దృశ్యాలు మార్చి 2024లో రంగస్వామి అనే వ్యక్తి తన భార్య, అత్తపై కత్తితో దారుణంగా దాడి చేసిన దృశ్యాలను చూపిస్తున్నాయి. రిపోర్ట్స్ ప్రకారం, ఈ సంఘటన 04 మార్చి 2024న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని అవుకు బస్టాండ్ లో జరిగింది. అవుకు బస్టాండ్ లోని టెంకాయల షాప్ లో ఉండే కత్తితో రంగస్వామి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో అతని భార్య కుమారి మృతి చెందగా, అత్త సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం మేము ఆవుకు పోలీసులను సంప్రదించగా, వారు కూడా అనుమానం, కుటంబ కలహాల కారణంగానే ఈ హత్య జరిగిందని చెప్పారు. అలాగే, ఈ వైరల్ వీడియో ఈ హత్య ఘటనకు సంబంధించింది అని ధృవీకరించారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ వీడియోకు సంబంధించిన సమాచారం కోసం, ప్రస్తుతం షేర్ అవుతున్న వైరల్ వీడియో యొక్క కీఫ్రేమ్స్ ను రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా, ఇవే దృశ్యాలను రిపోర్ట్ చేస్తూ మార్చి 2024లో పబ్లిష్ అయిన పలు వార్త కథనాలు మాకు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).
ఈ వార్తా కథనాల ప్రకారం, ఈ సంఘటన 04 మార్చి 2024న ఆంధ్రప్రదేశ్‌లోని నంద్యాల జిల్లాలోని అవుకు బస్టాండ్ లో జరిగింది. అందరూ చూస్తుండగానే రంగస్వామి అనే వ్యక్తి తన భార్య, అత్తపై కత్తితో దారుణంగా దాడికి పాల్పడ్డాడు. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం. కుమారి, ఆమె భర్త రంగస్వామి అవుకు కోట వీధిలో నివాసం ఉంటున్నారు. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. అనుమానం, కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆ కారణంగా కుమారి ఆమె పుట్టింటికి వెళ్లి వాళ్ల అమ్మ సుబ్బలక్ష్మమ్మతో కలిసి మాట్లాడటానికి అవుకు వచ్చింది. ఈ క్రమంలోనే అవుకు బస్టాండ్ లో టెంకాయల షాప్ లో ఉండే కత్తితో రంగస్వామి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ దాడిలో భార్య కుమారి మృతి చెందగా, అత్త సుబ్బలక్ష్మమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం స్థానిక వైద్యశాలకు తరలించారు. బాధితురాలు సుబ్బలక్ష్మమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడు రంగస్వామిని అదుపులోకి తీసుకున్నారు. దీన్ని బట్టి వైరల్ వీడియోలోని దృశ్యాలు రంగస్వామి అనే వ్యక్తి తన భార్య, అత్తపై మార్చి 2024 లో కత్తితో దారుణంగా దాడి చేసిన దృశ్యాలను చూపుతున్నాయని మనం నిర్థారించవచ్చు.
ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం కోసం మేము ఆవుకు పోలీసులను సంప్రదించగా, వారు కూడా ఈ హత్య అనుమానం, కుటంబ కలహాల కారణంగానే జరిగిందని చెప్పారు. అలాగే, ఈ వీడియో ఈ ఘటనకు సంబంధించింది అని ధృవీకరించారు.
చివరగా, తన కూతురిని వేధించవద్దని చెప్పినందుకు ఓ మహిళను జనసేన పార్టీ కార్యకర్త సుమన్ హత్య చేశాడంటూ సంబంధం లేని వీడియోను తప్పుగా షేర్ చేస్తున్నారు.