“శ్రీరాముడి జోలికి వస్తే ఇదే గతి పడతాదంటు ఒక కుటుంబంలో తండ్రిని చంపేసిన మతోన్మాదులు” అంటూ ఓ వీడియోను సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు. ఈ వీడియోలో, సూర్యాపేటలో జరిగిన ఒక వ్యక్తి హత్యకు సంబంధించి మృతుడి కుటుంబం మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. అలాగే, ఈ వీడియోలో మృతుడి కుమార్తె వాట్సాప్ గ్రూప్‌లో వచ్చిన పోస్ట్‌కు మద్దతుగా ఎమోజీని పెట్టినందుకు తన తండ్రిని కొట్టి చంపారని చెప్పడం మనం చూడవచ్చు. ఈ కథనం ద్వారా అందులో ఎంత నిజముందో చూద్దాం.

క్లెయిమ్: సూర్యాపేటలో, శ్రీరాముడికి వ్యతిరేకంగా వాట్సాప్ గ్రూప్‌లో పెట్టిన పోస్ట్‌కు మద్దతుగా ఎమోజీ పెట్టినందుకు ఒక వ్యక్తిని కొట్టి చంపారు.
ఫాక్ట్(నిజం): ఈ వీడియో 22 జూలై 2025న సూర్యాపేట పట్టణంలో పద్మశాలి కుల సంఘం ఎన్నికల నేపథ్యంలో జరిగిన హత్యకు సంబంధించి మృతుడి కుటుంబం మీడియాతో మాట్లాడుతున్న దృశ్యాలను చూపిస్తుంది. రిపోర్ట్స్, కేసు FIR ప్రకారం, ‘సూర్యాపేట పట్టణ పద్మశాలి కుల బాంధవులు’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూపులో పద్మశాలి సంఘం ఎన్నికల నేపథ్యంలో, సంఘం అధ్యక్షునిగా గతంలో పనిచేసిన అప్పం శ్రీనివాస్ నిధులను కాజేశారంటూ శ్రీరాముల రాములు అనే వ్యక్తి వాట్సాప్ గ్రూప్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. దీనికి బదులుగా అప్పం శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. సూర్యాపేట భగత్‌సింగ్ నగర్‌కు చెందిన మానుపురి కృపాకర్ (54) అనే వ్యక్తి, శ్రీనివాస్ ఇచ్చిన వివరణ పోస్ట్‌కు మద్దతు పలుకుతూ సోమవారం సాయంత్రం ఒక ‘క్లాప్స్’ ఎమోజీని ఆ గ్రూప్‌లో పెట్టారు. దీంతో ఆగ్రహించిన శ్రీరాముల రాములు, అతని కుమారుడు శ్రీరాముల ధనుంజయ్ మరికొందరితో కలిసి కృపాకర్‌పై దాడి చేయగా, ఆయన ప్రాణాలు కోల్పోయారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పు.
ఈ పోస్టులో ఉన్న వీడియోలో సూర్యాపేట పట్టణంలో కృపాకర్ అనే వ్యక్తి హత్యకు సంబంధించి అతని కుటుంబ సభ్యుల మీడియా ఛానల్ ‘సుమన్ టీవీ’ తో మాట్లాడుతున్న దృశ్యాలను మనం చూడవచ్చు. ఈ హత్యకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం, తగిన కీవర్డ్స్ ఉపయోగిస్తూ ఇంటర్నెట్‌లో వెతకగా, పలు వార్తా కథనాలు లభించాయి (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ, & ఇక్కడ).

ఈ కథనాల ప్రకారం, సూర్యాపేట పట్టణంలో ఉన్న పద్మశాలీ సంఘం ఎన్నికలు ఆగస్ట్ 2025లో జరగనున్న నేపథ్యంలో చాలా కాలంగా సంఘంలో రగులుతున్న విభేదాలు మరింతగా ముదిరాయి. ఈ ఎన్నికల్లో పట్టణ అధ్యక్ష పదవికి శ్రీరాముల రాములు అనే వ్యక్తి నామినేషన్ వేశారు. ఈ నేపథ్యంలో సంఘం అధ్యక్షునిగా గతంలో పనిచేసిన అప్పం శ్రీనివాస్ నిధులను కాజేశారంటూ శ్రీరాముల రాములు ‘సూర్యాపేట పట్టణ పద్మశాలి కుల బాంధవులు’ పేరుతో ఉన్న వాట్సాప్ గ్రూప్‌లో ఒక పోస్ట్ పెట్టాడు. దీనికి బదులుగా అప్పం శ్రీనివాస్ వివరణ ఇచ్చారు. సూర్యాపేట భగత్‌సింగ్ నగర్‌కు చెందిన మానుపురి కృపాకర్ (54) అనే వ్యక్తి, శ్రీనివాస్ ఇచ్చిన వివరణ పోస్ట్‌కు మద్దతు పలుకుతూ 21 జూన్ 2025న సాయంత్రం ఒక ‘క్లాప్స్’ ఎమోజీని ఆ గ్రూప్‌లో పెట్టారు.
ఈ గ్రూప్‌కు అడ్మిన్‌గా ఉన్న రాములు, కృపాకర్ పెట్టిన ఎమోజీని వెంటనే తొలగించారు, ఆ తర్వాత కృపాకర్‌కు ఫోన్ చేసి దుర్భాషలాడాడు. ఈ పరిణామంతో మనస్తాపానికి గురైన కృపాకర్, 22 జూన్ 2025న ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసేందుకు కస్తూరి బజారులోని పద్మశాలీ భవనానికి వెళ్లారు. అక్కడే ఉన్న రాములు, అతని కుమారుడు ధనుంజయ్‌తో పాటు మరికొందరు కృపాకర్‌పై దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కృపాకర్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగానే ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన మానుపురి కృపాకర్ చెప్పుల దుకాణం నిర్వహించేవారు. కృపాకర్ భార్య విజయలక్ష్మి ఫిర్యాదు మేరకు శ్రీరాముల రాములు, శ్రీరాముల ధనుంజయ్‌తో పాటు మరికొందరిపై కేసు నమోదు చేసినట్లు పట్టణ ఇన్‌స్పెక్టర్ వెంకటయ్య మీడియాకు తెలిపారు.
ఈ హత్యకు సంబంధించి సూర్యాపేట పట్టణ పోలీసులు నమోదు చేసిన FIRలో కూడా ఇదే విషయం పేర్కొన్నారు. ఈ హత్య కేసుకు సంబంధించి నమోదైన FIR కాపీని ఇక్కడ చూడవచ్చు.

చివరగా, 22 జూలై 2025న సూర్యాపేట పట్టణంలో పద్మశాలి కుల సంఘం ఎన్నికల నేపథ్యంలో జరిగిన కృపాకర్ హత్యకు సంబంధించి అతని కుటుంబ సభ్యులు మీడియాతో మాట్లాడిన వీడియోను తప్పుడు కథనంతో షేర్ చేస్తున్నారు.