Fake News, Telugu
 

రేప్ పై శిక్షలు పెంచుతూ ఆర్డినెన్స్ జారీ చేసింది ఏప్రిల్ 2018 లో. అదే పార్లమెంట్ ఆమోదం తర్వాత చట్టంగా కూడా మారింది.

0

పసి పిల్లలపై అత్యాచారం చేసే వాళ్ళకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ ఆర్డినెన్స్ పై సంతకం చేసారని ఉన్న పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది ఈ మధ్య షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): దేశంలో పసి పిల్లలపై జరిగే అత్యాచారాలకు ఉరిశిక్షను ఖరారు చేస్తూ ఆర్డినెన్స్ పై సంతకం చేసిన రాష్ట్రపతి రామనాథ్ కోవింద్.

ఫాక్ట్ (నిజం): గత సంవత్సరం ఏప్రిల్ లో ఆర్డినెన్స్ పై సంతకం చేయగా, ఆగష్టు 2018 లో పార్లమెంట్ ఈ సవరణలకు ఆమోదం తెలిపింది. కావున ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఎటువంటి ఆర్డినెన్స్ పై సంతకం చేయలేదు. అంతే కాదు, కొత్త చట్టం ప్రకారం ఉరిశిక్ష అనేది 12 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న ఆడ పిల్లలని రేప్ చేస్తే ఇచ్చే గరిష్టమైన శిక్ష. ఉరి శిక్ష ఇవ్వాలా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి.

పోస్ట్ లోని చెప్పిన ఆర్డినెన్స్ గురించి గూగుల్ లో వెతకగా, గత సంవత్సరం ఏప్రిల్ లోనే రాష్ట్రపతి రామనాథ్ కోవింద్ 12 ఏళ్ళ కంటే తక్కువ వయసు ఉన్న బాలికలను రేప్ చేస్తే ఉరిశిక్ష వేయోచ్చంటూ ఒక ఆర్డినెన్స్ పాస్ చేసినట్టు తెలుస్తుంది. కానీ ఆ తరువాత ఆగష్టు లో పార్లమెంట్ ఆ ఆర్డినెన్స్ ని ఉపసంహరించి, దాని స్థానంలో ‘The Criminal Law (Amendment) Act, 2018’ చట్టాన్ని పాస్ చేసింది. ఆ చట్టం మీద ఆగష్టు 11, 2018న రాష్ట్రపతి సంతకం కూడా చేసారు

అసలు ఈ చట్టంలో ఎలాంటి మార్పులు చేసారు, ఇంతక ముందు ఈ చట్టాన్ని ఎప్పుడు సవరణ చేసారో చూద్దాం.

2012 లో ఢిల్లీ నిర్భయ రేప్ సంఘటన తర్వాత ప్రజలు తీవ్ర స్థాయిలో నిరసన తెలిపడంతో అప్పటి యు.పీ.ఏ ప్రభుత్వం ‘The Criminal Law (Amendment) Act, 2013’ తో అంతకు ముందు ఉందు ఉన్న చట్టాలను సవరించారు. మళ్ళీ గత సంవత్సరం (2018) కతువా మరియు ఉన్నావ్ రేపు సంఘటనలు జరిగాక ఎన్.డీ.ఏ ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ పాస్ చేయించింది. 2018 ఆగష్టు నెలలో  ‘The Criminal Law (Amendment) Act, 2018’ ని పార్లమెంట్ ద్వారా పాస్ చేసి అంతకుముందు ఉన్న ఆర్డినెన్స్ ని ఉపసంహరించారు.

‘The Criminal Law (Amendment) Act, 2018’ ద్వారా Indian Penal Code, Indian Evidence Act, 1872, the Code of Criminal Procedure, 1973 and the Protection of Children from Sexual Offences Act, 2012 చట్టాలను సవరించారు. సవరణ తరువాత 12 ఏళ్ళ లోపు బాలికలను రేప్ లేదా గ్యాంగ్ రేప్ చేస్తే ఉరి శిక్ష విధించడానికి వీలుగా శిక్షలను మార్చారు. The Criminal Law (Amendment) Act, 2013 మరియు 2018 లో శిక్షల మధ్య వ్యత్యాసాలను కింద బాక్సులో చూడొచ్చు.

కొత్త చట్టం ప్రకారం ఉరిశిక్ష అనేది 12 ఏళ్ళ కంటే తక్కువ ఉన్న ఆడ పిల్లలని రేప్ చేస్తే ఇచ్చే గరిష్టమైన శిక్ష. ఉరి శిక్ష ఇవ్వాలా లేదా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి.

గత నెలలో వరంగల్ కి చెందిన ఒక తొమ్మిది నెలల పాపని రేప్ చేసే ప్రయత్నంలో ఒక వ్యక్తి ఆ పాపని చంపేసిన విషయం అందరికి తెలిసిందే. కావున గత సంవత్సరంలో పాస్ చేసిన ఆర్డినెన్స్ ని మళ్ళీ ఫేస్బుక్ లో కొత్తగా ఈ కేసు తర్వాత పాస్ చేసినట్టు షేర్ చేస్తున్నారు.

చివరగా, గత సంవత్సరం రేప్ పై శిక్షలు పెంచుతూ చేసిన ఆర్డినెన్స్ తీసుకొని కొత్తగా ఇప్పుడు చేసినట్టు షేర్ చేస్తున్నారు. ఆ ఆర్డినెన్సు ఉపసంహరించి, అదే స్థానంలో చట్టం కూడా 2018 లోనే వచ్చింది.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?


Share.

About Author

Comments are closed.

scroll