కొంతమంది ఫేస్బుక్ పోస్ట్ లో ఒక వ్యక్తి రాహుల్ గాంధీ పాదాలను తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న ఫోటో పెట్టి, ఆ వ్యక్తి 90 ఏళ్ళ కాంగ్రెస్ లీడర్ మోతిలాల్ వోరా అని ఆరోపిస్తున్నారు. దాంట్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఫొటోలో రాహుల్ గాంధీ పాదాలను తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న వ్యక్తి, 90 ఏళ్ళ కాంగ్రెస్ లీడర్ మోతిలాల్ వోరా.
ఫాక్ట్ (నిజం): రాహుల్ గాంధీ పాదాలను తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉన్న వ్యక్తి ఛత్తీస్గఢ్ కాంగ్రెస్ నాయకుడు త్రిభువనేశ్వర్ సరన్ సింగ్ దేవ్ (టిఎస్ సింగ్ దేవ్ గా ప్రసిద్ది చెందారు). కావున, పోస్ట్ లో చేసిన ఆరోపణలో ఎటువంటి నిజం లేదు.
ఆ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేస్తే, సెర్చ్ రిజల్ట్స్ లో, ఈ ఫోటో 2018లో “Did TS Singh DEO touch the feet of Rahul Gandhi?” అనే ఆరోపణతో సోషల్ మీడియాలో ప్రచారం జరిగిందని తెలిసింది. దీని ద్వారా, ఆ ఫోటో లోని వ్యక్తి టిఎస్ సింగ్ దేవ్ అని తెల్సింది. కానీ, అతను నిజంగానే రాహుల్ గాంధీ పాదాలను తాకడానికి ప్రయత్నించాడా లేదా అనే విషయం మాత్రం స్పష్టంగా తెలియలేదు.
“పత్రిక” అనే ఒక రాయపూర్ స్థానిక వార్తా సంస్థ, ఆ ఫోటో టిఎస్ సింగ్ దేవ్ ఛత్తీస్ గఢ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటిది అని, దాంట్లో టిఎస్ సింగ్ దేవ్ రాహుల్ గాంధీ పాదాల దగ్గర పడిన ఒక దారాన్ని తీయటానికి వంగినప్పుడు ఫోటో తీసారని రిపోర్ట్ చేసింది.
ఫోటో యొక్క వాస్తవికత గురించి తెలుసుకోడానికి “India Today” వారు టిఎస్ దేవ్ ని సంప్రదించినప్పుడు, ఆయన స్వీయ విరుద్ధమైన జవాబులు ఇచ్చారు. ఒక సందర్భంలో అతను, ఆ ఫోటో ఒక మార్ఫింగ్ చేయబడిన ఫోటో అని చెప్పాడు. మరొక సందర్భంలో, అతను నేల మీద పడిన రుమాలు తీయటానికి తాను వంగినట్లుగా చెప్పారు. కానీ, ఫోటోలో అలాంటి రుమాలు ఎక్కడా కనిపించలేదు.
ఫోటో యొక్క వాస్తవికతను నిర్ధారించడానికి కావాల్సిన వీడియో కోసం టిఎస్ సింగ్ దేవ్ ఛత్తీస్ గఢ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినప్పటి వీడియో కవేరేజ్ చూసినప్పుడు, ఫోటో తీసిన సందర్భానికి సంబంధించి ఎక్కడ రికార్డ్ అవ్వలేదు. కానీ, మంత్రిగా ప్రమాణ స్వీకారం అనంతరం టిఎస్ సింగ్ దేవ్, వేదిక మీద ఉన్న రాహుల్ గాంధీ ఆశీర్వాదం తీకోవడానికి ప్రయత్నించినప్పుడు, రాహుల్ అలా చేయకుండా ఆపినట్లుగా ఈ వీడియో లో చూడవచ్చు.
చివరగా, ఫోటోలో రాహుల్ గాంధీ పాదాలను తాకడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కనిపిస్తున్న వ్యక్తి మోతిలాల్ వోరా కాదు. అతను ఛత్తీస్ గఢ్ కాంగ్రెస్ నాయకుడు త్రిభువనేశ్వర్ సరన్ సింగ్ దేవ్.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?