Fake News, Telugu
 

రాజస్థాన్‌లో పండ్లు అమ్ముకునే వ్యక్తిపై జరిగిన దాడి వెనక మతపరమైన ఉద్దేశం ఏమి లేదు, కేవలం పాత పగతోనే ఈ దాడి చేశారు

0

‘రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్‌లో తనకు పోటీ వస్తున్నాడనే కారణంతో దళితుడైన పండ్లు అమ్ముకునే వ్యక్తిని విచక్షణారహితంగా కొట్టిన ముస్లిం మూక’  అని చెప్తూ కొందరు యువకులు ఒక వ్యక్తిపై కర్రలతో దాడి చేస్తున్న వీడియో షేర్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ వీడియోకి సంబంధించి నిజమేంటో చూద్దాం.

క్లెయిమ్: రాజస్థాన్‌లోని శ్రీ గంగా నగర్‌లో తనకు పోటీ వస్తున్నాడనే కారణంతో దళితుడైన పండ్లు అమ్ముకునే వ్యక్తిని ముస్లిం మూక  విచక్షణారహితంగా కొట్టిన వీడియో.

ఫాక్ట్ (నిజం): ఈ దాడికి సంబంధించి గాయపడ్డ కిషన్ లాల్ కుమారుడు చెప్పిన దాని ప్రకారం పోలీసులు FIR రిజిస్టర్ చేసారు. ఈ FIRలో చెప్పినదాని  ప్రకారం గతంలో కిషన్ లాల్ కుమారులకు, ముకదర్ అనే వ్యక్తికి ఒక ప్యాంట్ విషయంలో గొడవ జరగగా, ఈ విషయాన్ని పంచాయతీలో పరిష్కరించుకున్నారు. ఐతే ఈ విషయంలోనే కోపం పెంచుకున్న ముకదర్ కొందరు యువకులతో కలిసి బస్టాండ్‌లో పండ్లు అమ్ముకుంటున్న కిషన్ లాల్‌ను కర్రలతో కొట్టారు. ఈ దాడి వెనుక మతపరమైన ఉద్దేశం ఏమీ లేదని, కేవలం గతంలో ప్యాంట్ విషయంలో జరిగిన గొడవ మీద కోపంతో నిందితులు ఈ దాడి చేసారని  పోలీసులు స్పష్టం చేసారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

ఈ వీడియోకి సంబంధించి మరింత సమాచారం కోసం గూగుల్‌లో కీవర్డ్ సెర్చ్ చేయగా ఈ ఘటనని జూలై 2021లో  రిపోర్ట్ చేసిన ఒక వార్తా కథనం కనిపించింది. ఈ కథనం ప్రకారం రాజస్తాన్, శ్రీ గంగానగర్ జిల్లాలో ఘర్సన పట్టణంలోని బస్టాండ్‌లో పండ్లు విక్రయించే కిషన్ లాల్ అనే వ్యక్తికి ఇంతకు ముందు కొందరితో గొడవ జరిగింది. ఐతే వివాదానికి సంబంధించి కోపంతో  కొందరు యువకులు బస్టాండ్‌లో పండ్లు అమ్ముకుంటున్న కిషన్ లాల్‌పై కర్రలతో దాడి చేసారు. ఈ కథనంలో ఎక్కడ కూడా ఈ దాడి వెనక మతపరమైన ఉద్దేశం ఉందని పేర్కొనలేదు.

ఈ ఘటనపై కిషన్ లాల్ కుమారుడు పోలీసులకు కంప్లైంట్ చేయగా, పోలీసులు కిషన్ లాల్ కుమారుడు చెప్పిన దాని ప్రకారం కేసు నమోదు చేసి FIR ఫైల్ చేసారు. ఐతే FIRలో చెప్తున్నదాని ప్రకారం గతంలో కిషన్ లాల్ కుమారులకు, ముకదర్ అనే వ్యక్తికి ఒక ప్యాంట్ విషయంలో గొడవ జరిగగా, ఈ విషయాన్ని పంచాయతీలో పరిష్కరించుకున్నారు. ఐతే ఈ విషయంలోనే కోపం పెంచుకున్న ముకదర్ కొందరు యువకులతో కలిసి బస్టాండ్‌లో పండ్లు అమ్ముకుంటున్న కిషన్ లాల్‌ను కర్రలతో కొట్టారు.

ఐతే పోస్టులో చెప్తునట్టు వ్యక్తుల మతానికి ఈ సంఘటనతో ఎలాంటి సంబంధం లేదు. పైగా FIR ప్రకారం 9 మందిపై కేసు నమోదు కాగా, వీరి పేర్లని భట్టి చుస్తే ఈ 9 మందిలో కేవలం ఒక్కడే ఇస్లాం మతానికి చెందిన వాడిగా తెలుస్తుంది. ఈ ఘటనకి సంబంధించి వివరాల కోసం FACTLY ఘర్సన నయీ మండి పోలీస్ స్టేషన్‌ని సంప్రదించగా, ఈ దాడి వెనుక మతపరమైన ఉద్దేశం ఏమీ లేదని, కేవలం గతంలో ప్యాంట్ విషయంలో జరిగిన గొడవ మీద కోపంతో నిందితులు ఈ దాడి చేసారని  పోలీసులు స్పష్టం చేసారు.

చివరగా, రాజస్థాన్‌లో పండ్లు అమ్ముకునే వ్యక్తిపై జరిగిన దాడి వెనక మతపరమైన ఉద్దేశం ఏమి లేదు, కేవలం పాత పగ వల్లే ఈ దాడి చేశారు.

Share.

About Author

Comments are closed.

scroll