నాలుగు తలల నాగ దేవత అంటూ ఒక పాము ఫోటోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. లైక్ చేసి షేర్ చేస్తే అరగంటలో శుభవార్త వింటారని పోస్ట్ లో ఉండడంతో ఆ పోస్ట్ ని ఇప్పటికే పదిహేను వేల మందికి పైగా షేర్ చేసారు. ఆ ఫోటోలో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఫోటోలో కనిపించేది నాలుగు తలల ఉండే నాగదేవత.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లో ఉన్నది ఒక ఎడిటెడ్ ఫోటో. రెండు తలలు ఉన్న పాము ఫోటో తీసుకొని ఫోటోషాప్ చేసారు. కావున పోస్ట్ లో చెప్పింది అబద్ధం.
పోస్ట్ లో ఇచ్చిన ఫోటోని యాన్డెక్స్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, ఫోటోలో ఉన్న పామే రెండు తలలతో ఉన్న ఫోటో సెర్చ్ రిజల్ట్స్ లో వస్తుంది. ఆ ఫోటో తీసుకొని ఫోటోషాప్ లో ఎడిట్ చేసి నాలుగు తలల పాముగా పోస్ట్ లో చూపెట్టారు. ఫోటోలో ఉన్న పాముకి రెండు తలలు ఉన్నాయని కచ్చితంగా చెప్పలేము (ఎందుకంటే ఇంటర్నెట్ లో దానికి కావాల్సిన ఆధారాలు దొరకలేదు), కానీ కచ్చితంగా నాలుగు తలలు మాత్రం లేవు. ఫోటోషాప్ సహాయం తో నాలుగు తలలే కాదు ఇంకా చాలా తలలు కూడా పెట్టోచ్చు.
చివరగా, పోస్ట్ లో ఉన్న నాలుగు తలల పాము ఫోటో ఒక ఎడిటెడ్ ఫోటో.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?