Fake News, Telugu
 

పోస్ట్ లోని చాలా వరకు ఫోటోలు మరియు వీడియో తెలంగాణ లో వడగళ్ళు పడినప్పుడు తీసినవి కావు.

0

తెలంగాణ లో వడగళ్ళ వాన అని చెప్తూ కొన్ని ఫోటోలు మరియు ఒక వీడియోతో కూడిన ఒక పోస్ట్ ని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ కి ఇప్పటికే అరవై ఆరు వేల షేర్లు వచ్చాయి. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్ (దావా): పోస్ట్ లోని ఫోటోలను మరియు వీడియోని గత వారం తెలంగాణ లో వడగళ్ళు పడినప్పుడు తీసారు.

ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని ఫోటోల్లో చాలా వరకు తెలంగాణ కి సంబంధించినవి కావు. ఎక్కడెక్కడివో ఫోటోలు తీసుకొని తెలంగాణవని తప్పుగా ప్రచారం చేస్తున్నారు. పోస్ట్ లోని వీడియో కూడా తెలంగాణది కాదు.

ఫేస్బుక్ లోనే కాదు Asianet News (తమిళ్) మరియు Socialnews.xyz వంటి కొన్ని వార్తా సంస్థలు, వెబ్సైట్లు కూడా పోస్ట్ లోని కొన్ని ఫోటోలను తెలంగాణకి సంబంధించినవిగా ప్రచురించారు. కానీ Factly ఇంగ్లీష్ లో ఏప్రిల్ 23 న ఈ విషయం పై ఫాక్ట్ చెక్ ఆర్టికల్ రాసిన తరువాత Asian News (తమిళ్) వారు తమ వెబ్ సైట్ నుండి తెలంగాణ వడగళ్ళ మీద రాసిన ఆర్టికల్ తీసేసింది.

అలానే, Times of India (తెలుగు and తమిళ్) and Asianet News (తెలుగు) వార్తా పత్రికలు పోస్ట్ లోని వీడియోని తెలంగాణ వడగళ్ళ వాన అంటూ తమ వెబ్ సైటులల్లో పెట్టాయి. కానీ Factly ఇంగ్లీష్ లో ఆర్టికల్ రాసిన తరువాత Times of India (తెలుగు) తమ ఆర్టికల్ నుండి వీడియోని తీసేసింది. Times of India (తమిళ్) పేజీ లో ఇంకా తప్పుడు వీడియో చూపిస్తున్న ఆర్టికల్ అలానే ఉంది.

పోస్ట్ లోని ఫోటో లను గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతకగా, కొన్ని ఫోటోలు వేరే దగ్గర నుండి తీసుకున్నట్టుగా తెలుస్తుంది.

ఫోటో 1:పోస్ట్ చేసిన ఫోటో

ఫాక్ట్: పోస్ట్ లో ఉన్న ఫోటోని షెల్ వింక్లీ ఏప్రిల్ 6, 2019 న ఫ్లో (టెక్సాస్) అనే ప్రాంతంలో వడగళ్ళు పడినట్టుగా ట్వీట్ చేసాడు.

ఫోటో 2: పోస్ట్ చేసిన ఫోటో

ఫాక్ట్: ఫోటో ఎక్కడ తీసారో దొరకలేదు కానీ అదే ఫోటో ని 9GAG వెబ్ సైట్ లో అక్టోబర్ 2018 లో అప్లోడ్ చేసారు. కావున అది గత వారం తెలంగాణ వడగళ్ళు పడినప్పుడు తీసిన ఫోటో కాదు.

వీడియో:
పోస్ట్ లోని వీడియో ని ఇన్విడ్ సాఫ్ట్ వేర్ సహాయంతో ఫ్రేమ్స్ గా విభజించి, వాటిని గూగుల్ రివర్స్ ఇమేజ్ సెర్చ్ లో వెతికినప్పుడు అదే వీడియోని ఒక వ్యక్తి గత సంవత్సరం (2018) మార్చ్ లో యుట్యూబ్ లో అప్లోడ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఆ వీడియో కింద వివరణ చూస్తే అది బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా రాసి ఉంటుంది. ఇదే విధంగా గత సంవత్సరంలోనే ఈ వీడియోని చాలా మంది బంగ్లాదేశ్ లో జరిగినట్టుగా అప్లోడ్ చేసారు, వాటిని ఇక్కడ మరియు ఇక్కడ చూడవచ్చు. కావున, పోస్ట్ చేసిన వీడియో కూడా తెలంగాణ లో తీసింది కాదు.

అంతే కాదు, పోస్ట్ లోని ఫోటోలను మరియు వీడియోని చాలా మంది వివిధ బాషల్లో తమ ప్రాంతంలో జరిగినట్టుగా సోషల్ మీడియా లో షేర్ చేస్తున్నారు.

చివరగా, పోస్ట్ లోని చాలా వరకు ఫోటోలు మరియు వీడియో తెలంగాణ లో తీసినవి కావు. వేరే వేరే ప్రాంతాలలో తీసినవి తెలంగాణ లో జరిగినట్టుగా చూపెట్టడానికి ప్రయత్నిస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll