కేవలం ఐదు వేల రూపాయలతో కొత్త టెక్నిక్ సహాయంతో గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా తొలగించవచ్చని చెప్తూ ఒక వీడియోని ఫేస్బుక్ లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఒక కొత్త టెక్నిక్ తో కేవలం ఐదు రూపాయలతో మాత్రమే గుండెలోని బ్లాకేజీలను ఆపరేషన్ లేకుండా డైరెక్టుగా తొలగించవచ్చు. ఈ గొప్ప అవకాశము బాంబేలోని జేజే హాస్పిటల్ లో కలదు.
ఫాక్ట్ (నిజం): పోస్ట్ లోని వీడియోలో ఎక్కడ కూడా డాక్టర్ బ్లాకేజీ తొలగించడం గురించి మాట్లాడడు. ఆ వీడియో యొక్క ఫుల్ వెర్షన్ చూస్తే కూడా కేవలం బ్లాకేజీ ఎంత అని కనిపెట్టడానికి CT Angiography మంచిదని చెప్పినట్టుగా చూడవచ్చు. అలానే, జే.జే.హాస్పిటల్ లో కేవలం ఐదు వేల రూపాయలతో గుండెలోని బ్లాకేజీ తొలగించే ఎటువంటి కొత్త టెక్నిక్ లేదు. కావున వీడియోలో చెప్పని విషయాలు పోస్ట్ లో రాసి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు.
పోస్ట్ లోని వీడియో సరిగ్గా వింటే, దాంట్లో డాక్టర్ ఎక్కడా కూడా బ్లాకేజీ తొలగించే విషయం గురించి మాట్లాడడు. కేవలం CT Angiography గురించి మాట్లాడుతాడు. పోస్ట్ లోని వీడియోనే ‘Saaol Heart Centre’ వారు యూట్యూబ్ లో తమ ఛానల్ లో పెట్టారు. దాని కింద వివరణ చూస్తే కూడా కేవలం ‘What is Ct Angiography?’ అని ఉంటుంది. CT Angiography తో బ్లాకేజీలను తొలగించలేము, కేవలం ఎంత బ్లాకేజీ ఉందో తెలుసుకోవచ్చు.
అలానే, పోస్ట్ లో చెప్పినట్టుగా జే.జే. హాస్పిటల్ లో ఐదు వేల రూపాయలతోనే గుండెలోని బ్లాకేజీ తొలగించడానికి ఏమైనా కొత్త టెక్నిక్ ఉందా అని వెతకగా, ఇలానే ఇంకో వీడియోలో ‘5000 వేల రూపాయలకే జే.జే. హాస్పిటల్ లో గుండెలోని బ్లాకేజీ తొలగింపు’ అని వచ్చిన వార్తల్లో నిజం లేదని 2015 లోనే DNA వారు మరియు గత సంవత్సరం Mumbai Live వారు ఆర్టికల్ రాసినట్టు చూడొచ్చు.
చివరగా, జే.జే.హాస్పిటల్ లో కొత్త టెక్నిక్ తో ఆపరేషన్ లేకుండా ఐదు వేలకే గుండెలోని బ్లాకేజీ తొలగింపు అని ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?