Fake News, Telugu
 

భారత నౌకాదళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే క్రమంలో అమెరికా నౌకాదళానికి చెందిన నౌక ఫోటో షేర్ చేస్తున్నారు

0

నౌకాదళ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపే క్రమంలో భారత నౌకాదళానికి చెందిన నౌక అని అర్ధం వచ్చేలా ఒక నౌక ఫోటో షేర్ చేసిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కథనం ద్వారా ఆ ఫోటోకి సంబంధించిన నిజమెంటో చూద్దాం.

ఈ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

క్లెయిమ్: భారత నౌకాదళానికి చెందిన నౌక ఫోటో.

ఫాక్ట్ (నిజం): ఈ ఫోటో అమెరికా నౌకాదళానికి చెందిన లిటోరల్ కంబాట్ షిప్, ఫ్రీడమ్ (LCS 1) నౌక. ఈ ఫోటో 2008లో ఈ నౌక యొక్క ట్రయల్స్ నిర్వహిస్తున్న సమయంలో తీసింది. లాక్హీడ్ మార్టిన్ అనే సంస్థ ఈ ఫోటోని ఫ్లికర్‌లో షేర్ చేసింది. గత కొన్ని సంవత్సరాలుగా పలు రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, పలు వార్తా సంస్థలు ఈ ఫోటోని భారత నౌకాదళానికి ఆపాదిస్తూ షేర్ చేస్తున్నారు. కావున పోస్టు ద్వారా చెప్పేది తప్పుదోవ పట్టించే విధంగా ఉంది.

భారత నౌకాదళం సాధించిన విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొంటూ ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న నౌకాదళ దినోత్సవాన్ని (Indian Navy Day) జరుపుకుంటారు. ఈ క్రమంలోనే భారత నౌకాదళానికి శుభాకాంక్షలు తెలుపుతూ ఇటీవల పలు రాజకీయ పార్టీలకి చెందిన నాయకులు (ఇక్కడ మరియు ఇక్కడ), పార్టీ సోషల్ మీడియా పేజీలు (ఇక్కడ మరియు ఇక్కడ) ఇదే ఫోటోని షేర్ చేసాయి.

ఐతే ఇదే ఫోటోని గత కొన్ని సంవత్సరాలుగా పార్టీలకు అతీతంగా పలు నాయకులు (ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మరియు ఇక్కడ) భారత నౌకాదళ దినోత్సవం నేపథ్యంలో షేర్ చేస్తున్నారు.

పలు వార్తా సంస్థలు కూడా భారత నౌకాదళం గురించి రాసిన కథనాలలో కూడా ఇదే ఫోటోని ప్రచురించారు (ఇక్కడ మరియు ఇక్కడ). అంతే కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే మీడియా ఏజెన్సీ అయిన DD న్యూస్ కూడా 2019 నౌకాదళ దినోత్సవం సందర్భంగా ఇదే ఫోటోని షేర్ చేసింది.

ఈ ఫోటో ఎక్కడిది ?

ఐతే ఈ ఫోటోకి భారత నౌకాదళానికి ఎటువంటి సంబంధంలేదు. పోస్టులోని వైరల్ ఫోటోని రివర్స్ ఇమేజ్ సెర్చ్ చేయగా ఇదే ఫోటో ఫ్లికర్, స్టాక్ ఫోటోస్ వెబ్సైటులో ‘లాక్హీడ్ మార్టిన్’ అనే ప్రొఫైల్‌లో మాకు కనిపించింది. వెబ్సైటులో ఈ ఫోటోకి సంబంధించిన వివరణ ప్రకారం ఈ ఫోటోలో ఉన్నది ‘లిటోరల్ కంబాట్ షిప్, ఫ్రీడమ్ (LCS 1)’, పైగా ఈ ఫోటోని 2008లో షిప్ యొక్క స్పీడ్ టెస్ట్ (బిల్డర్స్ ట్రయల్స్) నిర్వహిస్తున్న సమయంలో తీసింది.

పైన తెలిపిన వివరణ ఆధారంగా గూగుల్‌లో వెతకగా లాక్హీడ్ మార్టిన్ అనేది గ్లోబల్ సెక్యూరిటీ, ఏరోస్పేస్ రంగంలో ఆధునిక సాంకేతిక వ్యవస్థలు, ఉత్పత్తులు, సేవల అందించే సంస్థ. ఈ కంపెనీ ముఖ్యంగా యు.ఎస్. డిపార్ట్‌మెంట్ ఆఫ్ డిఫెన్స్, యు.ఎస్. ఫెడరల్ ప్రభుత్వ ఏజెన్సీలతో వ్యాపారం నిర్వహిస్తుంది. ఈ సంస్థ వెబ్సైటులో  లిటోరల్ కంబాట్ షిప్‌కి సంబంధించిన సమాచారం చూడొచ్చు. ఈ సమాచారం ప్రకారం 2008లో అమెరికా నేవీ కోసం రూపొందించిన ఈ షిప్‌కి సంబంధించి నిర్వహించిన ట్రయల్స్ విజయవంతం అయినట్టు ఒక కథనంలో పేర్కొన్నారు.

2009లో ప్రచిరించిన ఒక వార్తా కథనంలో కూడా ఇదే ఫోటోని ప్రచురించారు. ఈ ఫోటోకి సంబంధించిన వివరణ ప్రకారం ఫోటోలో ఉన్నది లిటోరల్ కంబాట్ షిప్ కాగా, యు.ఎస్. నేవీ తమ సముద్ర తీరంలో నియమించేందుకు ఈ నౌకలను కొనుగోలు చేసే వార్తకు సంబంధించిన కథనంలో ఈ ఫోటోని షేర్ చేసారు. ఈ ఆధారాల బట్టి ఈ ఫోటో అమెరికా నేవీకి చెందిన నౌకదని స్పష్టంగా అర్ధమవుతుంది. 

చివరగా, భారత నౌకాదళ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపే క్రమంలో అమెరికా నౌకాదళానికి చెందిన నౌక ఫోటో షేర్ చేస్తున్నారు.

Share.

About Author

Comments are closed.

scroll