ఫేస్బుక్ పోస్ట్ లో ఒక వినియోగదారుడు బేకరీలో పాడైపోయిన తిను పదార్ధాలను అమ్ముతున్నారనీ, అవి తినడం వలన తన కొడుకు అస్వస్థతకి గురయ్యాడని ఆ బేకరీ యాజామాన్యాన్ని నిలదీస్తున్న వీడియో ని పెట్టి, ఆ ఘటన హైదరాబాద్ పిస్తా హౌస్ లో జరిగిందంటూ పేర్కొంటున్నారు. ఆ పోస్ట్ లో చేసిన ఆరోపణల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.
క్లెయిమ్ (దావా): ఒక వినియోగదారుడు బేకరీలో పాడైపోయిన తిను పదార్ధాలను అమ్ముతున్నారనీ ఆ బేకరీ యాజామాన్యాన్ని నిలదీస్తుట్లుగా ఉన్న వీడియో పిస్తా హౌస్ లో జరిగిన సంఘటన కి సంబంధించినది.
ఫాక్ట్ (నిజం): వీడియోలోని ఘటన పాకిస్తాన్ లోని ‘Treats’ అనే బేకరీలో జరిగింది. కావున, పోస్టులో చేసిన ఆరోపణలో ఎటువంటి నిజం లేదు.
పోస్టులో పెట్టిన వీడియోని పరిశీలించినప్పుడు, అందులో ఎక్కడా కూడా “Pista House” పేరు కనిపించలేదు. ఇదే వీడియోతో ఉన్నఇంగ్లీష్ పోస్టు యొక్క కామెంట్స్ విభాగం చూసినప్పుడు, అందులో చాలా మంది ఆ వీడియోలో ఉన్నది పాకిస్తాన్ లోని ఒక బేకరీ అని పేర్కొన్నారు.
వీడియోలో ఉన్న పదార్ధాలు “Treats” అనే పేరుతో ప్యాకింగ్ చేసి ఉన్నట్లుగా చూడవచ్చు. ఆ సమాచారంతో వెతికినప్పుడు “Thetreatsbakery” అనే ఫేస్బుక్ పేజీ లభించింది. ఆ పేజీ యొక్క కవర్ పిక్ మరియు పోస్టులోని వీడియో లో కనిపించే బేకరీ లోగో ఒకేలా ఉండడం చూడవచ్చు. ఆ పేజీ యొక్క వివరాలు చూసినప్పుడు, ఆ బేకరీ కరాచీలో ఉన్నట్లుగా తెలిసింది.
ఈ క్రింది కొల్లేజ్ లో ఎడమ వైపున ఉన్నది వీడియో బాక్ గ్రౌండ్ లో కనిపించే బేకరీ యొక్క లోగో మరియు కుడి వైపున ఉన్నది ఆ ఫేస్బుక్ పేజీ యొక్క కవర్ ఫోటో.
ఆ సమాచారం తో కరాచీ లోని “Treats Bakery” వారిని ఇదే విషయం గురించి సంప్రదించినప్పుడు, ఆ ఘటన తమ బేకరీ లోనే జరిగిందని ధృవీకరించి, సింధ్ ప్రావిన్స్ ఫుడ్ సేఫ్టీ సిబ్భంది పోస్టులోని వీడియో లో ఆరోపించిన వాటిల్లో ఎటువంటి నిజం లేదంటూ, ఆ ఆరోపణలు చేసిన వ్యక్తి సమక్షంలో క్లియరెన్స్ ఇచ్చిన వీడియో ని షేర్ చేశారు.
చివరగా, ఆ వీడియో పిస్తా హౌస్ ది కాదు. అది పాకిస్తాన్ లోని ఒక బేకరీలో జరిగిన సంఘటనకి సంబంధించినది.
ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?