Fake News, Telugu
 

‘ఆర్టికల్ 370 అంటే ఏమిటి?’ అని వివరణ ఇస్తూ ఉన్న పోస్టుల్లో అన్నీ నిజాలు కావు

1

భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 370 గురించి వివరిస్తూ ఉన్న ఒక పోస్ట్ ని సోషల్ మీడియా లో చాలా మంది షేర్ చేస్తున్నారు. ఆ పోస్ట్ లో ఇచ్చిన వివరాలల్లో ఎంతవరకు నిజముందో విశ్లేషిద్ధాం.

ఆ పోస్ట్ యొక్క ఆర్కైవ్డ్ వెర్షన్ ఇక్కడ చూడవచ్చు.

ఆర్టికల్ 370 మన రాజ్యాంగంలో పార్ట్ XXI (Temporary, Transitional and Special Provisions) లో ఉంటుంది. పోస్ట్ లో ఆర్టికల్ 370 గురించి చాలా వివరాలు ఇచ్చారు. ఆర్టికల్ 370 ద్వారా జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక ప్రతిపత్తి ఇస్తూ చాలా ప్రత్యేక సదుపాయాలు ఇచ్చినట్టు పోస్ట్ లో ఉంటుంది. కావున ఒక్కొక్కటి తీసుకొని విశ్లేషిద్దాం.

క్లెయిమ్ 1: భారతదేశంలో అందరికీ ఒక పౌరసౌత్వంవుంటే జమ్మూ కాశ్మీర్ ప్రజలకు ఈ ఆర్టికల్ 370 ద్వారా రెండు పౌరసౌత్వాలు కల్పించబడ్డాయి.

ఫాక్ట్ (నిజం): జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగం ప్రకారం జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రభుత్వం ఆ రాష్ట్ర ప్రజలను ‘Permanent Residents’ గా (శాశ్వత నివాసులు) గుర్తించి ఆర్టికల్ 35A కింద కొన్ని ప్రతేక హక్కులు ఇచ్చింది. ఆర్టికల్ 370 మరియు ఆర్టికల్ 35A కలిసి జమ్మూ కాశ్మీర్ ప్రజలకి ప్రత్యేక నివాస హక్కులు ఇచ్చాయి. కావున ఈ క్లెయిమ్ పూర్తిగా నిజం కాదు. జమ్మూ కశ్మీర్ ప్రజలకి పౌరసత్వం ఒక్కటే, భారత దేశ పౌరసత్వం. కానీ శాశ్వత నివాసులకి కొన్ని ప్రత్యేక   హక్కులు హక్కులు కల్పించబడ్డాయి.

క్లెయిమ్ 2: జమ్మూ కాశ్మీర్ ప్రజలకు సెపరేట్ జాతీయ జెండా కూడా వుంది.

ఫాక్ట్ (నిజం): జమ్మూ అండ్ కాశ్మీర్ రాజ్యాంగంలో సెపరేట్ రాష్ట్ర జెండా గురించి ఇచ్చినట్టు చూడవచ్చు. మరింత సమాచారం కోసం జమ్మూ కాశ్మీర్ లో రెండు జెండాలు ఉండడం పై ‘Frontline’ వారు రాసిన ఆర్టికల్ చదవచ్చు. 

కావున ఈ క్లెయిమ్ నిజం.

క్లెయిమ్ 3: జమ్మూ కాశ్మీర్ లో ఆరు సంవత్సారాలకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి.

ఫాక్ట్ (నిజం): జమ్మూ అండ్ కాశ్మీర్ శాసనసభ వెబ్ సైట్ లో ఆరు సంవత్సారాలకు ఒకసారి జమ్మూ కాశ్మీర్ లో ఎన్నికలు జరుగుతాయని రాసి ఉన్నట్టుగా చూడవచ్చు. కావున ఈ క్లెయిమ్ నిజం.      

క్లెయిమ్ 4: జమ్మూ కాశ్మీర్ ప్రజలు భారత దేశ సార్వభౌమాదికారాన్ని జాతీయ పతాకాన్ని జాతీయ చిహ్నాలను అవమానించినా ఎటువంటి నేరము కాదు. పాకిస్థాన్ పతాకం ఉరేగించినా తప్పుకాదు.

ఫాక్ట్ (నిజం): Prevention of Insults to National Honour Act, 1971 మరియు Flag Code of India, 2002 లో జమ్మూ కాశ్మీర్ కి ప్రత్యేక మినహాయింపులు ఏమి లేవు. అంతే కాదు, Prevention of Insults to National Honour Act, 1971 జమ్మూ కాశ్మీర్ లో వర్తిస్తుందని ‘Central Enactments Applicable to State Of Jammu And Kashmir’ డాక్యుమెంట్ లో చూడవచ్చు. కావున ఈ క్లెయిమ్ తప్పు.      

క్లెయిమ్ 5: సుప్రీంకోర్టు తీర్పులు ఈ రాష్ట్రంలో పనిచేయవు.

ఫాక్ట్ (నిజం): 1954 లో ‘Constitution Application Order of 1954’ ద్వారా జమ్మూ కాశ్మీర్ కూడా సుప్రీమ్ కోర్టు అధికార పరిధిలోకి వచ్చినట్టు జమ్మూ కాశ్మీర్ హైకోర్టు వెబ్ సైట్ లో చూడవచ్చు. జమ్మూ కాశ్మీర్ లో IPC స్థానంలో రన్బీర్ పీనల్ కోడ్ ఉన్నందున సుప్రీమ్ కోర్టు IPC కి ఏమన్నా మార్పులు చేస్తే అవి రన్బీర్ పీనల్ కోడ్ లో జరగవు. అంతేకానీ అసలు సుప్రీమ్ కోర్టు తీర్పులే వర్తించవు అని అనడం లో ఎటువంటి నిజం లేదు. అంతే కాదు, సుప్రీమ్ కోర్టు వెబ్ సైట్ లో సుప్రీమ్ కోర్టు జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన కేసుల పై ఇచ్చిన తీర్పులు చూడవచ్చు. కావున ఈ క్లెయిమ్ తప్పు.      

క్లెయిమ్ 6: జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమెకు కాశ్మీరీ పౌరసత్వం రద్దవుతుంది.

ఫాక్ట్ (నిజం): కశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే ఆమె కాశ్మీరీ పౌరసత్వం (Residency Rights) మరియు ఆస్తి హక్కు పోదు అని జమ్మూ కాశ్మీర్ మాజీ అడ్వకేట్ జనరల్ ఇషాక్ కాద్రి చెప్పినట్టు ‘Outlook’ మరియు ‘Business Standard’ ఆర్టికల్స్ లో చూడవచ్చు. 2002 లో జమ్ముకాశ్మీర్ హైకోర్టు ‘State and others vs Dr Susheela Sawhney and others’ కేసులో ఇచ్చిన తీర్పు ప్రకారం కశ్మీరీ యువతి దేశంలో వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకున్నా తన పౌరసత్వ హక్కులు కోల్పోదు. హైకోర్టు ఇచ్చిన తీర్పును నిర్వీర్యం చేయడానికి 2004 లో జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ‘Jammu and Kashmir Permanent Resident Status (Disqualification) Bill, 2004’ ద్వారా ప్రయత్నించింది కానీ శాసనమండలి లో ఆ బిల్ ఆమోదం పొందలేకపోయింది. తర్వాత మళ్ళీ ఆ బిల్లుని ప్రవేశాపెట్టడానికి జమ్మూకాశ్మీర్ ప్రభుత్వం ప్రయత్నించలేదు. 1927 నోటిఫికేషన్ లో ఇచ్చిన ఒక వివరణ వల్ల వేరే రాష్ట్ర పౌరుడిని పెళ్లి చేసుకుంటే కశ్మీరీ యువతి పౌరసత్వం రద్దవుతుంది అని కొందరు అనుకుంటున్నారు అని ‘The Hindu’ ఆర్టికల్ లో చదవచ్చు. కావున ఈ క్లెయిమ్ తప్పు.        

క్లెయిమ్ 7: జమ్మూ కాశ్మీర్ లో వుండే కాశ్మీరీ యువతి పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే పెళ్లి చేసుకున్న భర్తకు కశ్మీరి పౌరసత్వం లభిస్తుంది.  .

ఫాక్ట్ (నిజం): లోక్ సభ సెక్రటేరియట్ తయారు చేసిన డాక్యూమెంట్ ద్వారా, మహారాజ హరి సింగ్ 1927 నోటిఫికేషన్ మూలంగా వేరే రాష్ట్ర యువతి ఎవరయినా జమ్మూ కాశ్మీర్ ‘శాశ్వత నివాస గుర్తింపు’ ఉన్న యువకుడిని పెళ్లి చేసుకుంటే, తనకు కూడా అక్కడ ఉన్నన్నాళ్ళు ఆ రాష్ట్ర ‘శాశ్వత నివాస గుర్తింపు’ లభిస్తుంది అని తెలుస్తుంది. అంతే కానీ వేరే రాష్ట్ర యువకుడు జమ్మూ కాశ్మీర్ ‘శాశ్వత నివాస గుర్తింపు’ ఉన్న యువతిని పెళ్లి చేసుకుంటే అతనికి కూడా ఆ రాష్ట్ర ‘శాశ్వత నివాస గుర్తింపు’ వస్తుంది అని ఆ నోటిఫికేషన్ లో ఎక్కడా తెలుపరు. కావున జమ్మూ కాశ్మీర్ లో ‘శాశ్వత నివాస గుర్తింపు’ ఉన్న కాశ్మీరీ యువతి పాకిస్థాన్ యువకుడిని పెళ్లిచేసుకుంటే, పెళ్లి చేసుకున్న భర్తకు కాశ్మీరి ‘శాశ్వత నివాస గుర్తింపు’ లభిస్తుంది అని ప్రచారం అవుతున్న వార్తల్లో నిజం లేదు.

క్లెయిమ్ 8: RTI చట్టాలు జమ్మూ కాశ్మీర్ లో పనిచేయవు.

ఫాక్ట్ (నిజం): జమ్మూ కాశ్మీర్ లో తమ సొంత RTI చట్టాన్ని జమ్మూ కాశ్మీర్ ప్రభుత్వం అమలు చేస్తుంది. అంతే కాదు, కేంద్ర RTI చట్టం జమ్మూ కాశ్మీర్ లో ఉన్న కేంద్ర ప్రభుత్వం కి సంబంధించిన ఆఫీసులకు వర్తిస్తుంది. కావున అసలు RTI చట్టాలే లేవని చెప్తూ ప్రజలను తప్పుదోవపట్టిస్తున్నారు.        

క్లెయిమ్ 9: కాగ్ (CAG) కు జమ్మూ కాశ్మీర్ లో తనిఖీలు చేసే అధికారం లేదు.

ఫాక్ట్ (నిజం): 1958 లో CAG అధికార పరిధిలోకి జమ్మూ కాశ్మీర్ వచ్చినట్టు ‘Accountant General, J&K’ వెబ్ సైట్ లో చూడవచ్చు. అంతే కాదు, CAG వెబ్ సైట్ లో జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన డాకుమెంట్స్ కూడా చూడవచ్చు. కావున ఈ క్లెయిమ్ తప్పు.        

క్లెయిమ్ 10: జమ్మూ కాశ్మీర్ మహిళలపై షరియా చట్టాలు అమలు చేయబడతాయి.

ఫాక్ట్ (నిజం): ‘Outlook’ ఆర్టికల్ ప్రకారం సివిల్ విషయాల్లో షరియా చట్టం అమలు అయ్యేలా 2007 లో  జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఒక చట్టం పాస్ చేసారు. కావున ఈ క్లెయిమ్ కొంత నిజం, ఎందుకంటే క్రిమినల్ కేసుల్లో షరియా చట్టం వర్తించదు.      

క్లెయిమ్ 11: జమ్మూ కాశ్మీర్ పంచాయితీలకు ఎటువంటి అధికారాలు లేవు.

ఫాక్ట్ (నిజం): 73వ రాజ్యాంగ సవరణ అమలు అయిన 26 ఏళ్ళ కి జమ్మూ కాశ్మీర్ పంచాయితీలకు ‘Jammu and Kashmir Panchayati Raj (Fourth Amendment) Act, 2018’ ద్వారా అధికారాలు వచ్చినట్టు ‘The Statesman’ ఆర్టికల్ లో చదవచ్చు. అంతేకాదు, ఈ చట్టం ఆమోదం పొందాక దాని ఆధారంగా జమ్మూ అండ్ కాశ్మీర్ లో పంచాయతీ ఎన్నికలు కూడా జరిగాయని మరియు పంచాయితీల ఆర్ధిక అధికారాలు పెంచుతునట్టు అప్పటి కేంద్ర హోం మంత్రి చెప్పినట్టు తెలుస్తుంది. కావున ఈ క్లెయిమ్ తప్పు.      

క్లెయిమ్ 12: కాశ్మీర్లో హిందువులు, సిక్కులు, బౌద్దులు ఇతర తక్కువ ఉన్నమతాలకు రాజ్యాంగ బద్దంగా రావాలిసిన 16% రిజర్వేషన్లు ఇక్కడ అమలు కావడం లేదు.

ఫాక్ట్ (నిజం): మత పరమైన రిజర్వేషన్లు తప్పని సరిగా ప్రతి రాష్ట్రం ఇవ్వాలని రాజ్యాంగం లో లేదు. కానీ కొన్ని రాష్ట్రాలు తమ మైనారిటీలకు కొంత రిజర్వేషన్లు ఇచ్చాయి (తెలంగాణ ప్రభుత్వం ముస్లింలకు 12% రిజర్వేషన్ ఇచ్చినా అది ఇంకా అమలు కాలేదు). అప్పట్లో OBC ల 27% రిజర్వేషన్ నుండి మైనారిటీలకు 4.5% కేంద్ర ప్రభుత్వం కేటాయించగా అది ఇప్పుడు సుప్రీమ్ కోర్టు పరిధిలో ఉంది. ఈ క్లెయిమ్ కి సంబంధించి ఇంకే సమాచారం దొరకలేదు.        

క్లెయిమ్ 13: జమ్మూ కాశ్మీర్ లో ఒక సెంటు భూమి కూడ భారతీయులు కోనే హక్కులేదు.

ఫాక్ట్ (నిజం): ఆర్టికల్ 35A ప్రకారం కేవలం ‘Permanent Residents’ కి ‘శాశ్వత నివాస గుర్తింపు’ ఉన్నవాళ్లు మాత్రమే జమ్మూ కాశ్మీర్ లో భూమి కొనే హక్కు ఉంది. జమ్మూ కశ్మీర్ లో ఉండే ప్రజలు కూడా భారతీయులే, కాబట్టి ‘శాశ్వత నివాస గుర్తింపు’ లేని భారతీయులు అక్కడ భూమి కొనలేరు. కావున ఈ క్లెయిమ్ నిజం. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమిటంటే, ఇలాంటి పరిమితులు షెడ్యూల్డ్ ప్రాంతాల్లోనూ, అనేక రాష్ట్రాలలో కూడా ఉన్నాయి     

పోస్ట్ లో ఇచ్చిన క్లెయిమ్స్ అన్ని ‘The Hindu’ వెబ్ సైట్ లో పెట్టిన ఒక డాక్యుమెంట్ లో కూడా చూడొచ్చు. ఆ డాక్యుమెంట్ లోని విషయాలే ప్రభుత్వాన్ని ఆర్టికల్ 370 ని తీసేలా చేసిందని ఒక ప్రభుత్వ అధికారి చెప్పినట్టు వెబ్ సైట్ లో చూడవచ్చు. కానీ, ఆ డాక్యుమెంట్ లో అన్నీ కచ్చితమైన నిజాలు ఉండకపోవచ్చని ఆర్టికల్ మొదట్లోనే ‘The Hindu’ వారు ఒక గమనిక పెట్టారు.   

అంతే కాదు, ఈ క్లెయిమ్స్ గత కొన్ని ఏళ్ళ గా సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్నట్టు చూడవచ్చు.

చివరగా, ‘ఆర్టికల్ 370 అంటే ఏమిటి?’ అని వివరణ ఇస్తూ ఉన్న పోస్టుల్లో అన్నీ నిజాలు లేవు.

ఏది ఫేక్, ఏది నిజం సిరీస్ లో మా వీడియోస్ మీరు చూసారా?

Share.

About Author

1 Comment

  1. Hey who are you to block the picture on FB. And post your link in language different than english. You cannot do that. What is wrong with you, it is pic of the country. You don’t have any right or valid reason. I’m complaining against you. You are a terrorist in disguise want to control others.

scroll